దేశంలో ప్రతి ఒక్కరూ విజయగర్వంతో ఉప్పొంగిపోయిన రోజు అది. సర్జికల్ స్ట్రైక్స్.. ఈ పదం వినగానే, సగటు భారతీయుడి ఛాతీ, నాలుగు అంగుళాలు పెరిగిందనడం అతిశయోక్తి కాదేమో. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు, పాకిస్తాన్ సైన్యం మద్దతుతో భారత్‌లోకి అడుగుపెట్టి, సరిహద్దుల్లోని సైనిక స్థావరంపై విరుచుకుపడిన వెంటనే, భారత సైన్యం అప్రమత్తమయ్యింది. కుక్క కాటుకి చెప్పు దెబ్బ తగలాల్సిందే.. అన్న మాటకు ట్టుబడి, ప్రమాదకరం అని తెలిసీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది.
ప్రపంచం నిర్ఘాంతపోయింది భారత సైన్యం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని తెలియగానే. పాకిస్తాన్ బుకాయించేసింది.. అబ్బే, అక్కడేమీ జరగలేదని. అయితే, పాకిస్తాన్ సైన్యం, ట్రక్కుల్లో మృతదేహాల్ని (తీవ్రవాదులవి) తరలించి, అడ్డంగా దొరికేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ పలుమార్లు కవ్వించింది, ఇంకా కవ్విస్తూనే వుంది. అయితేనేం, పాకిస్తాన్‌ని చావుదెబ్బ కొట్టాం. ఓ వైపు సర్జికల్ స్ట్రైక్స్, ఇంకో వైపు అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ని ఒంటరి చేయడం.. భారతదేశం సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు.
'సర్జికల్ స్ట్రైక్స్ మా ఘనత.. మేం పాకిస్తాన్‌కి గట్టిగా బుద్ధి చెప్పాం..' అంటూ తొందరపడి భారతీయ జనతా పార్టీ తమ ఖాతాలో ఆ క్రెడిట్‌ని వేసుకోడానికి ప్రయత్నించింది. సైన్యం త్యాగాల్ని రాజకీయం చేయడమేంటని దేశమంతా ఛీత్కరించుకుంది. ఇక్కడే, విపక్షాలు మళ్ళీ రాజకీయం షురూ చేసేశాయి. సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా జరిగితే ఆధారాలు చూపాలంటూ మండిపడ్డాయి. దాంతో, అసలంటూ రాజకీయమంటేనే సిగ్గుమాలినతనం.. అనే స్థాయికి విసిగిపోయింది సగటు భారతదేశం.
రాజకీయాలెలా వున్నా, భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్.. దేశ ప్రజలు గర్వపడేలా చేశాయన్నది నిర్వివాదాంశం. కాస్తో కూస్తో ఈ క్రెడిట్, అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీకీ దక్కకుండా పోదు. అక్కడున్నది మోడీ కాబట్టే, ఇంత సాహసం చేయగలిగామని దేశంలో కొంతమందైనా మనస్ఫూర్తిగా అనుకున్నారన్నది కాదనలేని వాస్తవం.
రోజులు గడిచాయి.. ఇంకోసారి ప్రధాని నరేంద్రమోడీ నోట సర్జికల్ స్ట్రైక్స్ అనే మాట వచ్చింది. ఈసారి, ఈ సర్జికల్ స్ట్రైక్స్ భారతీయులపైనే చేశారు నరేంద్రమోడీ. పెద్ద పాత నోట్ల రద్దును సర్జికల్ స్ట్రైక్స్‌గా అభివర్ణించారు. అయితే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే, అక్కడ గురి తప్పలేదు. అక్కడ చచ్చింది కేవలం తీవ్రవాదులే. కానీ, ఇక్కడ మనీ సర్జికల్ స్ట్రైక్స్ మాత్రం, గురితప్పాయి. నల్లకుబేరుల్ని తాకాల్సింది పోయి, సామాన్యుల్ని పొట్టన పెట్టుకుంది. నవంబర్ 8 నుంచి ఇప్పటిదాకా (డిసెంబర్ 27) సుమారు 200 మందికి పైగా సామాన్యులు మృత్యువాత పడ్డారు. అదీ బ్యాంకుల్లో వున్న తమ సొమ్ముని డ్రా చేసుకోవడానికి క్యూ లైన్లలో నిలబడి. అదే సమయంలో, బ్యాంకు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం.
పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారాన్ని సర్జికల్ స్ట్రైక్స్‌తో పోల్చడం దారుణాతి దారుణమైన విషయం. మామూలుగా ఎవరన్నా ఈ మాట అంటే ఫర్లేదు.. ప్రధాని నోట ఈ మాట రావడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై సర్జికల్ స్ట్రైక్స్ సక్సెస్ అయ్యాయి గనుక, అదే స్థాయిలో పెద్ద పాత నోట్ల రద్దు అనే సర్జికల్ స్ట్రైక్స్ కూడా గురి తప్పవనీ, నల్లదొంగల భరతం పట్టేయడం ఖాయమని, ఇది నిఖార్సయిన కరెన్సీ సర్జికల్ స్ట్రైక్ అనీ అంతా అనుకున్నారు. కానీ, గురి తప్పేసరికి దేశం విస్తుపోవాల్సి వచ్చింది.
మొత్తమ్మీద, ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్జికల్ స్ట్రైక్స్ అనే పదానికి వున్న ప్రత్యేకతను చెరిపేశారు.. పాతరేసేశారు.. పరువు తీసేశారు. అంతేనా, దేశ ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్నీ వమ్ము చేసేశారు.
ఏదిఏమైనా, 2016లో దేశాన్ని అమితానందంలో ముంచెత్తేసిన సర్జికల్ స్ట్రైక్ ఒకటైతే, ఇంకోటి దేశాన్ని రోడ్డున పడేసిన సర్జికల్ స్ట్రైక్. ఎనీ డౌట్స్.?