ఆడు మగాడ్రా బుజ్జీ

పార్టీ మారాలనుకుంటే, ఏ పార్టీని వీడాలనుకుంటున్నారో ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చెయ్యాలి. ఇది నైతికత. ఛత్‌, ఇలాంటి మాటలు తెలుగునాట మాట్లాడకూడదు. మాట్లాడితే అదో పెద్ద బూతు. అంతే మరి,…

పార్టీ మారాలనుకుంటే, ఏ పార్టీని వీడాలనుకుంటున్నారో ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చెయ్యాలి. ఇది నైతికత. ఛత్‌, ఇలాంటి మాటలు తెలుగునాట మాట్లాడకూడదు. మాట్లాడితే అదో పెద్ద బూతు. అంతే మరి, రాజకీయం అంత దారుణంగా దిగజారిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. పార్టీ ఫిరాయించడమంటే అదో ఘనకార్యం ఇక్కడ. సిగ్గు సిగ్గు. జనం ఏమనుకుంటున్నారో అనవసరం, నిస్సిగ్గుగా నేతలు పార్టీలు మార్చేస్తున్నారు. 

'పార్టీ మారడమంటే రాజకీయ వ్యభిచారమే..' అని నినదించినవాళ్ళే, పార్టీలు మారడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం గమనార్హమిక్కడ. అక్కడితో కూడా కొందరు నేతలు ఆగలేదు, ఇంకా ఘాటైన కామెంట్లు చేసి, చివరికి పార్టీ ఫిరాయించేశారు. 'నేను ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టినోడ్ని.. నేను పార్టీ మారనుగాక మారను..' అన్న ఒక పెద్దాయన, అనూహ్యంగా పార్టీ మార్చేశారు. ఇదంటే, తెలుగునాట పార్టీ పిరాయింపుల కక్కుర్తి తీరు. 

అప్పుడెప్పుడో వైఎస్‌ హయాంలో పార్టీ ఫిరాయింపులు జరిగాయి కాబట్టి.. ఇప్పుడు చేసేది తప్పు కాదు.. అంటూ పార్టీ ఫిరాయిస్తున్న నేతలు బుకాయించొచ్చుగాక. కానీ, పార్టీ మారడం రాజకీయ వ్యభిచారం అయితే అది అప్పుడైనా, ఇప్పుడైనా అది రాజకీయ వ్యభిచారమే. వృద్ధనారీ పతివ్రత.. అన్నట్లు బాధిత పార్టీలు నీతులు మాట్లాడుతోంటే, గుమ్మడికాయ దొంగ.. అనగానే భుజాలు తడుముకుంటున్నాయి పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలు. 

జాతీయ రాజకీయాల్లో ఈ రోజు ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బీజేపీని వీడి, ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారాయన. బీజేపీకి చేసిన రాజీనామా ఆమోదం పొందగానే, ఆయన ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. అందుకే మరి, ఇప్పుడు నెటిజన్లు 'ఆడు మగాడ్రా బుజ్జీ..' అంటున్నారు. 

అలాగైతే, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన నేతల మాటేమిటి.? అంటారా.! సిద్దూ విషయంలో 'ఆడు మగాడ్రా బుజ్జీ..' అన్నది నిజమే, మన తెలుగు ఫిరాయింపు కింగుల కేటగిరీ ఏంటో, జనానికి ఓ ఐడియా వుంది లెండి. సోషల్‌ మీడియాలో జనం ఈ ఫిరాయించిన నేతల్ని ఓ రేంజ్‌లో కడిగి పారేస్తున్నారు. దాంతో, 'ఈ సిద్దూ వున్నాడే.. మా పరువు బజార్న పడేశాడు..' అని ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్న పార్టీలు, నేతలు గింజుకోవాల్సి వస్తోందిప్పుడు. 

కామాతురానాం నభయం న లజ్జ.. అన్న సంగతి ఏమోగానీ, ఫిరాయింపు రాజకీయం.. న భయం న లజ్జ.. అనడం సబబేమో ఇప్పుడు.