వైద్య ప్రపంచంలో రోజుకో కొత్త ఆవిష్కరణ తెరపైకొస్తోంది. కొత్త కొత్త రోగాలు ఎలాగైతే పుట్టుకొస్తున్నాయో, రోగాలకు వైద్య చికిత్స కూడా అలానే అందుబాటులోకి వస్తోంది. కొత్త కొత్త రోగాల సంగతి పక్కన పెడితే, వైద్య ప్రపంచంలో కొత్త కొత్త ఆవిష్కరణలు మనిషి ఆయుఃప్రమాణాల్ని పెంచేస్తున్నాయన్నది మాత్రం కాదనలేని వాస్తవం.
ఒకప్పుడు గుండె నొప్పి వచ్చిందంటే.. ఇక పైకి పోయినట్టే. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గుండె పాడైపోయినా.. కొత్త గుండెను అమర్చి, ప్రాణాలు నిలుపుతున్నారు వైద్యులు. మెషీన్ల తరహా వ్యవస్థను గుండెకు ప్రత్యామ్నాయంగా అమర్చుతున్న సందర్భాలు అనేకం పాశ్చాత్య దేశాల్లో చూస్తున్నాం. దానికన్నా.. అందుబాటులో గుండె దొరికితే, హృద్రోగుల పాలిట అదో వరం అనే చెప్పాలి. కానీ, అలా అవయవదానం చెయ్యాలంటే పెద్ద మనసు కావాలి. ఆ పెద్ద మనసు వుంటే, ఒక మనిషి అవయవాలతో ఒకేసారి పన్నెండు మందికి జీవం పోసే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు.
లివర్, కళ్ళు, గుండె రక్తాన్ని అందించే రక్తనాళాలు, ఊపిరితిత్తులు, కిడ్నీలు.. ఇవన్నీ సరైన సమయంలో అవసరమైన రోగికి అందిస్తే, ప్రాణాలు నిలిపేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. కానీ, అలా చేయాలంటే దాత వున్నా, సకాలంలో చికిత్స కోసం ఆయా అవయవాల్ని తరలించే ఏర్పాట్లు జరగాలి. ఆ మధ్య హైద్రాబాద్‌లోనే ఒక ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి అత్యంత వేగంగా అంబులెన్స్‌లో గుండెను తరలించి, గుండె మార్పిడి చేసి ఓ రోగి ప్రాణాలు కాపాడారు వైద్యులు. బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి ఆ గుండెను సేకరించారు. ఈ ఘటన అప్పట్లో ఓ అద్భుతం. వైద్యం చేసిన వైద్యులెంతగా ఆ అద్భుతాన్ని చూసి మురిసిపోయారోగానీ, తమ జీవితానికి సార్ధకత లభించిందంటూ ఆ గుండె తరలింపు సమయంలో ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసిన పోలీసులు అమితానందం వ్యక్తం చేశారు.
తాజాగా, బెంగళూరు నుంచి చెన్నయ్‌కి ఓ ‘గుండె’ తరలి వెళ్ళింది. సుమారు నాలుగున్నర గంటలపాటు ఆ గుండె ప్రయాణించింది. ప్రత్యేకంగా భద్రపరిచిన గుండెను బెంగళూరు ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించి, చెన్నయ్‌కి ప్రత్యేక విమానంలో తరలించారు. అత్యంత క్లిష్టమైన ఇలాంటి చికిత్సల్లో ‘గుండె ప్రయాణం’ అత్యంత కీలకం అని వైద్యులు చెబుతున్నారు.
మారుతున్న ఆహారపుటలవాట్ల కారణంగా, మనిషి శరీరంలో విలువైన అవయవాలు పాడైపోతున్నాయి. అదే సమయంలో రోడ్డు ప్రమాదాల్లో చాలామంది బ్రెయిన్ డెడ్ అవుతున్నారు. అలాంటి వ్యక్తుల నుంచి అవయవాల్ని సేకరించగలిగితే.. అవయవాలు పాడైపోయిన వ్యక్తులకు పునర్జన్మ లభిస్తుంది. అదే సమయంలో ఇది అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారం గనుక.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలూ, స్వచ్ఛంద సంస్థలూ తగినంత చేయూత బాధితులకు అందించాల్సి వుంటుంది. అదే సమయంలో అవయవదానంపై విస్తృత ప్రచారం జరగాల్సి వుంది.