పాత ఇమేజీ వుంచుకోవాలా? తుంచుకోవాలా?

జాట్‌లకు రాజకీయప్రాధాన్యం రావాలి అనే నినాదంపై చౌధురీ చరణ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో పైకి వచ్చాడు. ఆయన అనుచరుడిగా దేవీలాల్ అదే పంథాలో నడిచి హరియాణాలో రాజకీయాలు నడిపాడు. ఆయన కొడుకు ఓం…

జాట్‌లకు రాజకీయప్రాధాన్యం రావాలి అనే నినాదంపై చౌధురీ చరణ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో పైకి వచ్చాడు. ఆయన అనుచరుడిగా దేవీలాల్ అదే పంథాలో నడిచి హరియాణాలో రాజకీయాలు నడిపాడు. ఆయన కొడుకు ఓం ప్రకాశ్ చౌటాలా, అతని కొడుకు అజయ్ సింగ్.. అందరూ జాట్ ఓట్లపై ఆధారపడుతూనే తమ ఐఎన్‌ఎల్‌డి (ఇండియన్ నేషనల్ లోక్ దళ్) నడుపుతూ వస్తున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసినప్పుడల్లా గ్రామప్రాంతాలలోని నియోజకవర్గాలను తమకు కేటాయించుకుని పట్టణ ప్రాంతాల నియోజకవర్గాలను బిజెపికి ఇచ్చేది. బిజెపి నగరప్రాంతాలలో ఇతర కులస్తులను నిబెట్టినా, లోక్ దళ్ మాత్రం గ్రామాల్లో జాట్ కులస్తులనే అభ్యర్థులుగా నిలబెట్టి గెలుస్తూ వస్తోంది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి 62 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా వారిలో 1 మంది మాత్రమే జాట్లు. తక్కినవారు బ్రాహ్మణులు, అగర్వాల్‌లు, బిసి, ఎస్సీలు. 

దీనికి కారణం ఏమిటంటే ఇటీవలి పార్లమెంటు ఎన్నికలలో 10 సీట్లలో 7 సీట్లు గెలిచిన బిజెపి ఈసారి మొత్తం 90 సీట్లలో ఒంటరిగా పోటీ చేసి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసే సన్నాహాల్లో వుంది. పట్టణప్రాంతాల్లో బిజెపికి గట్టిపోటీ ఇవ్వాలంటే ఇతర కులస్తులను కూడా కలుపుకు పోవాలని లోక్‌దళ్ అనుకుంటోంది. జాట్‌లు కాకపోయినా బడా వ్యాపారస్తులకు టిక్కెట్టు ఇస్తోంది. యూపీఏ ప్రభుత్వం తను దిగిపోయేముందు జాట్‌లకు ప్రభుత్వోద్యోగులలో రిజర్వేషన్ కల్పించింది. కృతజ్ఞతాభావంతో ఈసారి జాట్‌లు కాంగ్రెసుకు ఓట్లేస్తారేమో, వారిపై తమకు వున్న గుత్తాధిపత్యం ఇంక వుండదేమోనని లోక్‌దళ్ భయం. జాట్ యువకులు మోడీపై అభిమానంతో పార్లమెంటు ఎన్నికలలో బిజెపి అభ్యర్థులకు ఓట్లేశారు. అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే జరిగితే ముప్పు తప్పదు. అందువలన జాటేతరులను కూడా కలుపుకు పోవలసిన అవసరం ఫీలయ్యారు వారు. అందుకే సిటింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేసి కూడా ఇలా టిక్కెట్లు ఇచ్చారు. అయితే టిక్కెట్లు దక్కనివారు, తొలినుండీ పార్టీలో వున్నవారు దీన్ని హరాయించుకో లేకపోయారు. కార్యకర్తల్లో తిరుగుబాటు వచ్చి కొందరు పార్టీ విడిచి వెళ్లిపోయారు. వారిలో కొందరు బిజెపికి వెళ్లగా మరి కొందరు హరియాణా మాజీమంత్రి గోపాల్ కండా పెట్టిన హరియాణా లోక్‌హిత్ పార్టీలో చేరారు. అన్ని సీట్లలో పోటీ చేయాలంటే అభ్యర్థులు లేని బిజెపి కాంగ్రెసువారికి వల విసిరింది. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే చాలామంది కాంగ్రెసు నుండి చేర్చుకుంది. ఇప్పుడు లోక్ దళ్ వారు కూడా చేరుతున్నారు.

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]