‘విమానం మిస్సింగ్’ అన్న బ్రేకింగ్ న్యూస్ చూడగానే ఒక్కసారిగా ప్రపంచం షాక్‌కి గురయ్యింది. ఈ ఏడాదిలో ఇది మూడోది. మార్చి 8న ఎంహెచ్ 370 విమానం గగనతలంలోనే అంతర్థానమైపోయింది. అది కూలిపోయిందా? పేలిపోయిందా? అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎక్కడో ల్యాండిరగ్ అయ్యిందనీ, తీవ్రవాదులు దారి మళ్లించారనీ.. చాన్నాళ్ళు ఊహాగానాలు వచ్చినా, చివరికి విమానంలో ఎవరూ బతికి వుండే ఛాన్స్ లేదని అధికారిక ప్రకటన వెల్లడయ్యేసరికి.. ఒక్కసారిగా ఆ విమానంలో ప్రయాణిస్తూ అంతర్థానమైపోయినవారి బంధువులు ఘొల్లుమన్నారు.
ఇక, ఆ తర్వాత మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానమే కూల్చివేయబడిరది. అత్యంత కిరాతకంగా తీవ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో ఈ విమానం కుప్పకూలింది. 298 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణీకులు షాక్‌కి గురయ్యారు. తాజాగా మరో విమానం మాయమైపోయింది. కూలిపోయిందో, పేలిపోయిందో.. లేదంటే ఎక్కడన్నా సేఫ్‌గా ల్యాండ్ అయ్యిందో తెలియదు.
సవాలక్ష ఊహాగానాలు షరామామూలుగానే తెరపైకొచ్చాయి. దాంతో మిస్సయిన విమానంలో వున్న తమవారు ఏమయ్యారోనని ఆందోళన చెందుతున్నారు ప్రయాణీకుల బంధువుల. ఎయిర్ ఏషియా సంస్థను బాధిత కుటుంబాలు నిలదీస్తోంటే, ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి వారిది. బాధిత కుటుంబాలది నరకయాతన అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
టెక్నాలజీ ఎంతగా పెరిగిందో అందరికీ తెల్సిందే. కానీ ఓ విమానం మిస్సయితే, దాని ఆచూకీ కనిపెట్టలేకపోతున్నామంటే మనల్ని మనం నిందించుకోవాల్సిందే. ‘కొన్ని ఘటనలు జరుగుతుంటాయ్..’ అని లైట్ తీసుకోడానికి లేదిక్కడ. కూలిపోతే ఎందుకు కూలిపోయింది.? అన్నదానిపై జవాబు రావాల్సిందే. కానీ, మాయమైపోతేనో.!
ఎప్పుడో సుభాష్ చంద్రబోస్ ప్రయాణిస్తోన్న విమానం కూలిపోయిందనో, మాయమైపోయిందనో వార్తలొచ్చాయి. అది ఇప్పటి వార్త కాదు, అరవై ఏళ్ళ క్రిందటి వార్త. కానీ బోస్ చనిపోయాడనడానికి ఆధారాల్లేవు. ఏమో, బతికే వున్నాడేమో అన్న ఆశ ఇంకా చాలామందిలో వుంది. ఇన్నాళ్ళు (అంటే వందేళ్ళకు పైబడి) ఓ వ్యక్తి జీవించే అవకాశం లేదు.. అని అందరికీ తెలుసు. కానీ, ఆశ అలానే వుంటుంది.
మరి, ఎంహెచ్ 370 విమానంలోని ప్రయాణీకుల మాటేమిటి.? వారి బంధువుల ఆవేదన సంగతేమిటి.? తాజాగా మిస్సయిన విమానంలోని ప్రయాణీకుల బంధువుల పరిస్థితీ అంతే.