మహా ప్రతిష్ట మంటగలుస్తోంది

అంతటా అవినీతి కధలు.. అభివృద్ధికి ఆమడదూరం Advertisement మహా విశాఖ నగర పాలక సంస్ధ (జీవీఎంసీ) ప్రతిష్ట మంటగలుస్తోంది. ఏ ముహూర్తాన జీవీఎంసీగా మారిందో కానీ, దశ, దిశా ఏ మాత్రం తిరోగనమంలోనే సాగుతున్నాయి.…

అంతటా అవినీతి కధలు.. అభివృద్ధికి ఆమడదూరం

మహా విశాఖ నగర పాలక సంస్ధ (జీవీఎంసీ) ప్రతిష్ట మంటగలుస్తోంది. ఏ ముహూర్తాన జీవీఎంసీగా మారిందో కానీ, దశ, దిశా ఏ మాత్రం తిరోగనమంలోనే సాగుతున్నాయి. మహా నగరంగా ఏదో ఊడపొడుస్తుందనుకుంటే కుంభకోణాలు, అవినీతి కధలనే వినిపిస్తోంది. ఇక పాలన విషయానికి వస్తే మంద ఎక్కువైతే మజ్జిగ పలుచన అన్న చందంగా తయారైంది. విలీన గ్రామాలతోపాటు, అసలు నగరానికి కూడా మౌలిక సదుపాయాల కల్పనలో జీవీఎంసీ ఎప్పటికపుడు వెనకబడుతూనే ఉంది. లంచావతారాలు, క్రమశిక్షణా రాహిత్యం, రెడ్ టేపిజం వెరసి జీవీఎంసీ ప్రతిష్టను నానాటికీ తీసికట్టుగా చేస్తున్నాయి. 

మూడున్నర దశాబ్దాల క్రితం నగర పాలక సంస్ధగా ఏర్పడిన విశాఖపట్నానికి తొలి నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. బ్రిటిష్  వారి హయాంలోనే చక్కని మునిసిపాలిటీగా పేరు తెచ్చుకున్న విశాఖను ఎందరో ఉద్దండులు పరిపాలించారు. మేధావులు ప్రణాళికలు రచించారు. భవిష్యత్తును ఘనంగా ఊహించిన స్రష్టల నాయకత్వంలో విశాఖ రూపురేఖలు కొత్తగా దిద్దుకుంది.  1981లో జరిగిన తొలి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ గెలిచింది, ఆ తరువాత 1987లో టీడీపీ, 1995, 2000 సంవత్సరాలలో కాంగ్రెస్ గెలిచింది. 2005లో జీవీఎంసీగా చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు చేశారు. దాంతో, అప్పటికి 50 వరకూ ఉన్న వార్డులు కాస్తా 72కు పెరిగాయి. గాజువాక, మధురవాడ, పెందుర్తి వంటివి జీవీఎంసీలో వచ్చి చేరాయి. 2007లో జీవీఎంసీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2012 వరకూ ఆ పాలక మండలి పదవీకాలం గడిచింది. గత రెండేళ్లుగా ప్రత్యేక అధికారి పాలనలోనే జీవీఎంసీ ఉంది. ఇక, జీవీఎంసీ కాక ముందే నగరం పరిస్థితి బాగుందన్న మాట కూడా సర్వత్రా వినిపిస్తోంది. ఇటీవల మరణించిన మేధావి, న్యాయ కోవిదుడు డీవీ సుబ్బారావు వంటి వారు విశాఖకు సమగ్ర రూపాన్ని కల్పించారు. ప్రగతి గతిని నిర్దేశించారు. 

తొలి మేయర్‌గా పనిచేసిన ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి కూడా సామాజిక సేవా తత్పరుడు, ఆయన నాయకత్వంలో నగరం బాగానే అభివృద్ధి సాధించింది. ఇక, తరువాత వచ్చిన సబ్బం హరి బీచ్‌రోడ్డులో నగర ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటుచేయడంతో పాటు, నగరానికి కొత్త రూపును తీసుకువచ్చారు. ఆ తరువాత జీవీఎంసీగా ఎదిగిన తరువాత నుంచి నగరం విస్తరించింది. ఈ క్రమంలో ఇటు నగరానికి న్యాయం చేయలేక, అటు శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయలేక చతికిలపడింది. ఈ క్రమంలో అభివృద్ధి పట్టు తప్పింది. వికేంద్రీకరణతో సమన్వయం లోపించింది. జోనల్ విధానం వల్ల నిజానికి మంచి జరగాలి, కానీ అవినీతి విశ్వరూపం దాల్చింది. సరైన పర్యవేక్షణ, సమన్వయం లేకపోవడం వల్ల ఎవరు ఏమి చేస్తున్నారో తెలియని స్థితి ఏర్పడింది. ప్రజల ముంగిట ఉండాల్సిన పాలన కాస్తా గాడి తప్పింది. ఇక, గత పదేళ్లుగా శివారు గ్రామాల స్థితిలో ఏ మాత్రం మార్పు లేదు, పంచాయతీలుగా ఉన్నపుడే నయం అని ప్రజానీకం భావించే విధంగా తయారైంది. పన్నులు పెరిగాయి తప్ప, అభివృద్ధికి నోచుకోలేకపోయామని పెందుర్తి, మధురవాడ తదితర ప్రాంతాల ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అవినీతికి ఆలవాలం

జీవీఎంసీ ప్రధాన కార్యాలయం అవినీతికి ఆలవాలంగా తయారైంది. సమర్ధులైన వారు కమిషనర్లుగా వచ్చినప్పటికీ, దిగువ స్ధాయి సిబ్బంది మాత్రం ఇక్కడ పాతుకుపోవడంతో  అంతా ఇష్టారాజ్యంగా తయారైంది. ఇక్కడ కాగితం కదలాలంటే కరెన్సీ ఉండాల్సిందే అన్న పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ అవాలన్నా చేతులు తడపాల్సిందే. ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్, నీటి పారుదల విభాగాలలో అవినీతి బాగా ఉన్నట్లుగా పలు దఫాలుగా ఏసీబీ దాడులలో పట్టుపడుతున్న ఉద్యోగుల ద్వారా తెలుస్తోంది. జీవీఎంసీ వల్ల మేలు జరుగుతుందనుకుంటే మరింతగా అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. జీవీఎంసీ విషయంలో  రాబడి కంటే ఖర్చు ఎక్కువ అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక, గత పాలకులు వేలాది కోట్ల రూపాయలను బడ్జెట్‌గా చూపించడం కూడా గొప్ప కోసం చేసిన విన్యాసాలుగానే  ఉన్నాయి. వసూలు కాని పన్నుల విషయంలో తీసుకోవాల్సినంత శ్రద్ద తీసుకోకపోవడం వల్ల బకాయిలు పేరుకుపోయాయి. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా నిధులు సక్రమంగా విడుదల కాకపోవడం లోటుగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే జీవీఎంసీ ఏర్పాటుతో ఎంతో ముందుకు పోతుందనుకున్న అభివృద్ధి ఉత్తమాటగానే తేలిపోయింది.

కొలిక్కిరాని బీఆర్‌టీఎస్

నగరం పెరుగుతోంది, రవాణా సదుపాయాలు కూడా బాగా పెరగాలన్న కాన్సెప్ట్‌తో బీఆర్‌టీఎస్‌ను అయిదేళ్ల క్రితం తీసుకువచ్చారు. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్ధ నుంచి భారీగా నిధులు వచ్చాయి కూడా,  కానీ, అవినీతి, అలసత్వం మూలంగా ఆ పనులు ఇంకా కొలిక్కిరాలేదు, పెందుర్తి నుంచి నగరానికి, అలాగే, సింహాచలం, అడవివరం, అరిలోవ లైన్లు ఇంకా పూర్తి కాలేదు. ఇవి కనుక పూర్తి అయితే, నగరానికి మరింత వేగవంతమైన రవాణా వ్యవస్ధ అందుబాటులోకి వచ్చేది. భూ సేకరణలో తలెత్తిన సమస్యల మూలంగా సింహాచలం, అడవివరం, అరిలోవ లైన్ కొంతభాగం ఇప్పటికీ అలాగే ఉంది. మరో వైపు నగరంలో నిర్మించిన ఏకైక ఫ్లై ఓవర్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. 112 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలోనే అనేక లోపాలు ఉన్నాయి. మరో వైపు దీనిని ప్రజా బాహుళ్యం నిత్యం సంచరించే ప్రాంతాల వైపుగా కాకుండా సిరిపురం వైపు నుంచి రైల్వే స్టేషన్ వరకూ వేయడంతో ట్రాఫిక్ సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రజా ధనం మాత్రం వందల కోట్లు సిమెంట్ పాలైపోయింది. దీని వెనుక కూడా అవినీతి అధికారులు, రాజకీయ నాయకులు ఉండడం వల్లనే ప్రజా ప్రయోజనం పక్కకు పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి.

మెట్రో రైలు అలాగే..

విభజన తరువాత విశాఖ ఎంతో బాగుపడుతుందని అంతా ఆశించారు కానీ, విశాఖపై ఏపీ సర్కార్ సరైన ఫోకస్ పెట్టిన దాఖలాలు కనిపించడంలేదు. మెట్రో రైలు ప్రాజెక్టు గత రెండేళ్లుగా అలాగే ఉంది. తాజాగా ఢిల్లీ నుంచి ప్రతినిధులు వచ్చి వెళ్లారు. 2018 నాటికి తొలి దశ పూర్తి చేయాలని ఏపీ సర్కార్ చెబుతున్నా ఆ దిశగా చర్యలు మాత్రం లేవు. అంతా కాగితాలపైనే ఉన్నాయి. జీవీఎంసీకి పూర్తి స్ధాయి కమిషనర్ కూడా లేని పరిస్థితి ఉంది. గత మూడు నెలలుగా ఇన్‌చార్జిల పాలనలో మరింతగా సంక్షోభంలో జీవీఎంసీ ఉంది. దీంతో, దిగువ స్ధాయి సిబ్బంది ఆగడాలు మరింతగా పెరిగిపోతున్నాయి. జీవీఎంసీ పని కోసం వెళ్తే అక్కడ గోడలు కూడా చేతులు చాస్తాయన్న మాటలు పూర్తి నిజాలుగా మారిపోయాయి. ఇప్పటికైనా ఏపీ సర్కార్ విశాఖపై పూర్తి దృష్టిని నిలపాలని, జీవీఎంసీని సమూలంగా ప్రక్షాళన చేయాలని నగర ప్రజానీకం కోరుతున్నారు. సత్వరమే ఎన్నికలు జరిపించడం ద్వారా ప్రజా పాలనకు కూడా అవకాశం ఇవ్వాలని, జవాబుదారీ తనాన్ని పెంచాలని కోరుతున్నారు. మరి, ఆ దిశగా అడుగులు పడితేనే తప్ప జీవీఎంసీకీ మంచి రోజులు రావన్నది వాస్తవం.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,