రెండూ పెద్ద కార్పొరేట్ సంస్థలే. కానీ సోషల్ మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. కావాలనే ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ రేట్లు పెంచేసిందని స్టార్ గ్రూప్ ఆరోపిస్తుంటే.. అలాంటిదేం లేదని ఎయిర్ టెల్ వాదిస్తోంది.
ఎయిర్ టెల్ డిజిటల్ టీవీలో స్టార్ ప్రసారాలు చూడాలంటే ఇకపై కాస్త ఎక్కువ మొత్తం చెల్లించాలట. ఈ విషయాన్ని స్వయంగా స్టార్ గ్రూప్ వెల్లడించింది. వినియోగదారులంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ నుంచి వైదొలిగి మరో మంచి కనెక్షన్ తీసుకోవాలని బాహాటంగానే ప్రకటన ఇస్తోంది.
దీనిపై ఎయిర్ టెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. స్టార్ గ్రూప్ కావాలనే తమపై నిందులు వేస్తోందని, తాము ఎలాంటి చార్జీలు పెంచలేదని స్పష్టంచేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. స్టార్ యాజమాన్యమే కావాలని ధరలు పెంచిందని, అందుకు నిరసనగా మార్చి 31నుంచి కొన్ని ప్యాక్స్ లో స్టార్ ప్రసారాలు నిలిపివేస్తున్నట్టు తెలిపింది.
ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఐపీఎల్. ఏప్రిల్ 7నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ఐపీఎల్ ప్రారంభం అవుతుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అటు ఎయిర్ టెల్ టీవీ, ఇటు స్టార్ గ్రూప్ రెండూ ప్రయత్నిస్తున్నాయి.
ఇందులో భాగంగా మ్యాగ్జిమమ్ లాభపడేందుకు స్టార్ గ్రూప్ ప్రయత్నిస్తుంటే.. ఆ వచ్చిన మొత్తం తమ ఖాతాలోకి మళ్లేందుకు ఎయిర్ టెల్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరూ ఇలా బహిరంగంగానే ఒకరి పరువు ఒకరు తీసుకుంటున్నారు. అయితే అంతిమంగా ఈసారి వినియోగదారుడి జేబుకు మాత్రం చిల్లుపడడం ఖాయమని తేలిపోయింది.