టాలీవుడ్ పెద్ద కుటుంబాల్లో ఒకటి. ఇంకా చెప్పాలంటే వాళ్లది చరిత్ర. సినీ కళామతల్లికి రెండు కళ్లు ఉంటే అందులో ఒక కన్ను ఏఎన్నార్. అక్కినేని ఘనత అది. ఆయన ఓ లెజెండ్. ఆయన నటవారసుడు, తనయుడు నాగార్జునది కూడా చరిత్ర. ఇక తనయుడు నాగచైతన్య కూడా నిలదొక్కుకున్నాడు.
అఖిల్ ఓ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఇలా సినిమాల పరంగా చూసుకుంటే అక్కినేని కుటుంబానిది సూపర్ హిట్ ట్రాక్ రికార్డ్. వృత్తిగత జీవితంలో సూపర్ హిట్టయిన ఈ కుటుంబం, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు చూసింది. మరీ ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి వైవాహిక జీవితం కలిసొచ్చినట్టు కనిపించడం లేదు. చరిత్ర చెబుతున్న వాస్తవం ఇది.
నాగార్జున నుంచి చూసుకుంటే నాగచైతన్య వరకు అక్కినేని ఫ్యామిలీలో ఎవ్వరికీ వైవాహిక బంధం అచ్చొచ్చినట్టు కనిపించదు. నాగార్జున మొదటి వివాహం గురించి అందరికీ తెలిసిందే. డాక్టర్ డి.రామానాయుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నారు నాగ్. ఆయన తొలి కాపురం నిలబడలేదు. మొదటి భార్యకు పుట్టిన సంతానమే నాగచైతన్య. అలా చైతూ పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్న నాగార్జున.. అమలను పెళ్లి చేసుకున్నారు. అప్పుడు అఖిల్ జన్మించాడు.
వైవాహిక బంధంలో నాగార్జున ఎదుర్కొన్న స్ట్రగుల్ నే నాగచైతన్య కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య-సమంత. టాలీవుడ్ లో స్టార్ కపుల్ అనిపించుకుంది ఈ జంట. ఏ ఈవెంట్ జరిగినా, ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినా చై-శామ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచేవారు. అలాంటి జంట నాలుగేళ్లకే తమ వైవాహిక బంధాన్ని కాదనుకుంది. కారణాలేంటనేది పక్కనపెడితే.. చైతన్య-సమంత విడిపోయారనేది పచ్చి నిజం. అది ఇప్పటికీ హాట్ టాపిక్ గానే నడుస్తోంది.
పెళ్లి కాకముందే ఇలాంటి ఎదురుదెబ్బ తిన్నాడు అఖిల్. చాలా చిన్న వయసులోనే అఖిల్ కు పెళ్లి సంబంధం సెట్ చేశారు నాగార్జున. జీవీకే కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్ తో అఖిల్ పెళ్లి కుదిరింది. ఒక దశలో కొడుకుల ఇద్దరి పెళ్లిళ్లు మినిమం గ్యాప్స్ లో జరిపించాలని ప్లాన్ చేశారు నాగార్జున. ఈ క్రమంలో అఖిల్ నిశ్చితార్థం కూడా అట్టహాసంగా జరిగింది. కానీ ఆ సంబంధం పెళ్లిపీటల వరకు వెళ్లలేదు. అలా పెళ్లి రద్దు చేసుకున్న అఖిల్, అప్పట్నుంచి ఇప్పటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతూనే ఉన్నాడు.
కేవలం నాగార్జున కుటుంబం వరకే ఈ ఒడిదుడుకులు పరిమితం కాలేదు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుమంత్ కు కూడా పెళ్లి కలిసిరాలేదు. హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లాడాడు సుమంత్. అలా పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే ఇద్దరూ విడిపోయారు. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్లీ పెళ్లి ఆలోచన చేయలేదు సమంత్. కీర్తి రెడ్డి మాత్రం విదేశాల్లో సెటిలైంది.
రాబోయే తరంపై ప్రభావం
ఇలా అక్కినేని కుటుంబంలో హీరోలెవ్వరికీ తొలిసారి వైవాహిక బంధం కలిసి రావడం లేదు. ఇది యాదృచ్ఛికమా, వాళ్ల జాతక ప్రభావమా అనే విషయాన్ని పక్కనపెడితే.. నాగార్జున నుంచి నాగచైతన్య వరకు అంతా తొలిసారి వైవాహిక బంధంలో సక్సెస్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ లో హీరో సుశాంత్ పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు. అందరి దృష్టి ఇతడిపై పడింది.
మిగతా కుటుంబాల పరిస్థితేంటి?
ఇండస్ట్రీలో కేవలం అక్కినేని కుటుంబంలోనే ఇలా జరుగుతోందా? ఇతర కుటుంబాల్లో ఇలాంటివి జరగడం లేదా? అక్కడ కూడా జరుగుతున్నాయి. కాకపోతే అక్కినేని ఫ్యామిలీలో జరిగినట్టు వరుసపెట్టి, ఒకే విధంగా జరగడం లేదు. మెగా కాంపౌండ్ లో కూడా వైవాహిక బంధాలు వీగిపోయిన ఘటనలు ఉన్నాయి. చిరంజీవి కూతురు ఉదంతం అందరికీ తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా తెలిసిందే.
చిరంజీవి తన చిన్న కూతురుకు రెండో పెళ్లి చేశారు. ఆ అల్లుడే కల్యాణ్ దేవ్. ఇప్పుడీ వైవాహిక బంధంపై కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. అటు పవన్ కల్యాణ్ అయితే వైవాహిక జీవితంలో వరుసగా ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికి 3 పెళ్లిళ్లు చేసుకున్నారాయన. ఇక మంచు ఫ్యామిలీలో కూడా వేర్పాట్లు ఉన్నాయి. మంచు మనోజ్ కూడా తన భార్య నుంచి విడిపోయినట్టు ఆమధ్య ప్రకటించాడు.
ఇలా టాలీవుడ్ లో చాలా బ్రేకప్స్ ఉన్నప్పటికీ.. అక్కినేని కుటుంబంలోనే అవి ఎక్కువగా ఉండడం బాధాకరమైన విషయం. ఈ విషయంలో ఆ హీరోలు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఓ సినిమాను హిట్ చేసే సత్తా వాళ్ల చేతిలో ఉండొచ్చేమో కానీ, వైవాహిక బంధాన్ని కొనసాగించేంత చాకచక్యం, నైపుణ్యం అక్కినేని హీరోలకు లేదనుకోవాలి. ఇలాంటి విషయాల్లో విధిని నమ్మడం తప్ప ఎవరూ ఏం చేయలేరు.