అయినవాటికీ, కానివాటికీ కోర్టు మెట్లెక్కి, అధికార పార్టీని ఇరుకున పెడుతూ ఆనందం పొందుతున్న రఘురామకృష్ణంరాజు మరోసారి అలాంటి పనే చేశారు. చింతామణి నాటక ప్రదర్శన నిషేధంపై ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జీవో 7ని రద్దు చేయాలని కోరారు.
అసలు చింతామణి నాటకాన్ని ఇప్పట్లో ఎవరు, ఎక్కడ ప్రదర్శిస్తున్నారు. దాదాపుగా అప్రకటిత నిషేధాన్ని అనుభవిస్తున్న చింతామణిపై ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారికంగా నిషేధాన్ని అమలు చేస్తోంది. దీనిపై కొంతమంది కళాకారులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ ఎక్కడా నిషేధం ఎత్తివేయాలని కోరలేదు.
పోనీ నిషేధం ఎత్తేస్తే ఊరూవాడా చింతామణి ప్రదర్శనలు మొదలైపోతాయా..? అది కూడా జరగని పని. ఈరోజుల్లో నాటకాలు ఎవరూ చూడట్లేదు. అందులోనూ నటీనటులు, ఇతర వ్యవహారాలన్నీ బాగా ఖర్చుతో కూడుకున్న పని. చింతామణి నాటకంపై నిషేధం ఉన్నా, లేకపోయినా ఏపీలో ఒకటే. అందుకే ప్రభుత్వం ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకించే బ్యాచ్ చింతామణి విషయంలో కూడా రంగంలోకి దిగింది. వారికి నాటకాలంటే అమితమైన ప్రేమ, నాటకాలాడేవాళ్లంటే విపరీతమైన అభిమానం ఉంది అనుకుంటే పొరపాటే. కేవలం రఘురామ కృష్ణంరాజు కోర్టు ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఈ పిల్ దాఖలు చేశారు.
నియోజకవర్గంలో పర్యటనలు ఆయన ఎప్పుడో ఆపేశారు. పోనీ మీడియాలో మాట్లాడదామంటే ఆయనకు స్థానిక సమస్యలేంటో తెలియదు, అస్సలు వాటిపై అవగాహనే లేదు. అందుకే రఘురామ ఎప్పుడూ జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై పెట్రేగిపోతుంటారు. ఆయన ఊ అంటే.. ఊపుకుంటూ వచ్చే ఓ వర్గం మీడియా రెడీగా ఉంటుంది కాబట్టి, ఆయన ప్రసంగాలకు ఇంకా పబ్లిసిటీ దొరుకుతోంది.
తాజాగా అనర్హత వేటు కూడా పడుతుందన్న భయం ఆయనలో ఉంది. అందుకే మరోసారి ప్రభుత్వాన్ని గిల్లాలనుకుంటున్నారు. చింతామణి నాటకంపై ఎనలేని ప్రేమ కురిపిస్తూ నిషేధం ఎత్తేయాలంటున్నారు. కానీ రఘురామ తెలుసుకోవాల్సింది ఒక్కటే. గిల్లితే గిల్లించుకునేవారెవరూ లేరిక్కడ.