పద్మ పురస్కారాలు, భారత రత్న, క్రీడా రంగంలో అర్జున, సినిమా రంగంలో దాదాసాహెబ్ అవార్డు …ఇలాంటివి ప్రదానం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. ఇవన్నీ విశిష్ట వ్యక్తులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాలు. ఈ అవార్డులు ఇవ్వడంలో కొంత రాజకీయాలు కూడా పని చేస్తాయనుకోండి. విశ్వనాథ్ తీసిన శుభలేఖ సినిమాలో సత్యనారాయణ తనకు భారత రత్న ఇప్పించాలని బ్రోకర్లను అడుగుతాడు. ఇప్పుడు భారత రత్న పరిస్థితి అలాగే ఉంది.
ప్రతి రాజకీయ నాయకుడికి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్లు ఎక్కువై పోయాయి. కొందరు నాయకులు తమ పార్టీ అధికారంలోకి వేస్తే ఫలానా వ్యక్తికీ భారత రత్న ఇప్పిస్తామని వాగ్దానాలు చేస్తుంటారు. ప్రభుత్వాలు ఫలానా వ్యక్తికీ భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంటాయి. తాము డిమాండ్ చేసిన వ్యక్తికీ భారత రత్న ఇవ్వకపోతే అలకలు, కోపాలు, నిరసనలు …ఇలాంటివన్నీ తెర మీదికి వస్తాయి.
చివరకు మనదేశంలో సాధారణ రాజకీయ నాయకులకు, రాష్ట్రస్థాయి నాయకులకు కూడా భారత రత్న ఇవ్వాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఫలానా నాయకుడికి మా పార్టీ భారత రత్న ఇప్పించింది అనో, మా పోరాటం వల్లనే లేదా మేం ఒత్తిడి చేయడం వల్లనే భారత రత్న వచ్చిందనో చెప్పుకోవడాన్ని గొప్పగా భావిస్తుంటాయి. సరే ఇక అసలు విషయమేమిటంటే …ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇప్పించే విషయంలో తాము కృషి చేస్తామని, ఎన్టీఆర్ కే కాదు వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా భారత రత్న దక్కేలా పని చేస్తామని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నాడు.
ప్రస్తుతం ఏపీలో జిల్లాల విభజన నేపథ్యంలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పెడతామని సీఎం జగన్ చెప్పారు కదా. అప్పటి నుంచి ఎన్టీఆర్ పేరుతొ రాజకీయం మొదలైంది. జిల్లాకు ఎన్టీఆర్ పెట్టి చంద్రబాబును దెబ్బకొట్టాలనుకున్నారు జగన్. చంద్రబాబు చేయలేని పని జగన్ చేశారని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆ పని ఎందుకు చేయలేకపోయారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది సహజం.
అందుకు టీడీపీ నాయకులు ఒక వాదన వినిపిస్తున్నారు. హైదరాబాదులో ఒక పెద్ద ఇండోర్ స్టేడియం కట్టి దానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని కాంగ్రెస్ సీఎం పేరు పెట్టిన వ్యక్తి చంద్రబాబు. హైదరాబాదులో ఒక పెద్ద టూరిజం ప్లేస్ లో ఎన్టీఆర్ ఘాట్ పెట్టి ముఖ్యమంత్రులు తిరిగే ఆ రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్ అని పెట్టింది చంద్రబాబు. ట్యాంక్ బండ్ కింద ఒక పెద్ద గ్రౌండ్ కు ఎన్టీఆర్ స్టేడియం అని పెట్టింది చంద్రబాబు.
వీటన్నింటికి మించి అంతర్జాతీయ ప్రముఖులు, హైదరాబాదుకు వచ్చే విదేశీ ప్రధానులు, ప్రెసిడెంట్లు, పారిశ్రామిక వేత్తలు, అంబాసిడర్లు ప్రతిరోజు తిరిగే ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు. చివరకు దానిని శంషాబాద్ కు తరలించినపుడు నిర్దాక్షిణ్యంగా కక్షతో ఎన్టీఆర్ పేరును తొలగించి రాజీవ్ గాంధీ పేరును పెట్టింది ఈ జగన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇక చంద్రబాబు కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ జిల్లాకు కుటుంబం, కులం రంగు పులుముతారు.
ఎన్టీఆర్ వంటి లెజెండ్ ను రాజకీయ వివాదాల్లో ఉంచడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కృష్ణా జిల్లాలో కమ్మ, కాపు సామాజిక వర్గాలు ప్రభావవంతమైన స్థానంలో ఉన్నాయి. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్లయితే జిల్లాలో రాజకీయ వివాదాలకు స్వయంగా చంద్రబాబే ఆజ్యం పోసినట్టవుతుంది. చంద్రబాబు ఎప్పటిలాగానే అతిజాగ్రత్తగా వ్యవహరిస్తూ ఆ జిల్లా పేరు మార్పు జోలికి పోలేదు. దాంతో తన పార్టీ వ్యవస్థాపకుడి పేరు కూడా పెట్టులేకపోయారనే నింద మోయాల్సి వచ్చింది. ఇదీ టీడీపీ నాయకులు వినిపిస్తున్న వాదన.
ఇక ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని టీడీపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఆయనకు భారత రత్న ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ విషయంలో చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీతో భుజాల మీద చేతులు వేసుకు తిరిగినా ఎన్టీఆర్ కు భారత రత్న రాలేదు. ఇప్పుడు బూతుల మంత్రిగా పేరుబడ్డ మంత్రి నాని మాత్రం తాము ఎన్టీఆర్ కే కాకుండా వైఎస్సార్ కూ భారత రత్న ఇప్పించడానికి కృషి చేస్తామంటున్నాడు.
ఈ మాట జగన్ చెప్పివుంటే అదోవిధంగా ఉండేది. పొద్దున్న లేస్తే వాళ్ళను వీళ్లను బూతులు తిట్టుకుంటూ తిరిగే నాని చెప్పిన మాటలకు విలువేముంది? తాను వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఎందుకైనా మంచిదని వైఎస్సార్ పేరు కూడా చెప్పాడు. వాస్తవానికి ఎన్టీఆర్ కు గాని, వైఎస్సార్ కు గాని భారత రత్న ఎందుకివ్వాలి? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే, కళాకారుడిగానే మిగిలి ఉంటే భారత రత్న వచ్చేదేమో ఎవరికీ తెలుసు?
కళాకారుడిగా ఆయన అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. దాన్ని ఎవరూ కాదనలేరు. ఇక రాజకీయ రంగంలో ఆయన అందరి మాదిరిగానే రాజకీయాలు చేశారు. వైఎస్సార్ అయినా అంతే. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ సంక్షేమ పథకాలు అమలు చేశారు. కానీ అత్యున్నత అవార్డుకు అవి మాత్రమే ప్రాతిపదిక కాదు. ఆ లెక్కన చూస్తే సంక్షేమ పథకాల్లో జగన్ తండ్రిని మించిపోయారు. మరి ఆయనకూ భారత రత్న ఇవ్వాలి కదా. రాజకీయం చేసి భారత రత్న అవార్డు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. కానీ నాని వంటివారు భారతరత్న అవార్డుతో రాజకీయాలు చేయడమే విచారకరం.