టార్గెట్ నెం2 విజ‌యసాయి

వైకాపా నాయకుడు విజ‌యసాయి ని తెలుగుదేశం జ‌నాలు కానీ, ఆ పార్టీ సోషల్ మీడియా అభిమానులు కానీ ఎ 2 అంటూ ఎగతాళి చేస్తుంటారు. విమర్శిస్తుంటారు. హేళన చేస్తుంటారు. జ‌గన్ తరువాత తెలుగుదేశం పార్టీకి…

వైకాపా నాయకుడు విజ‌యసాయి ని తెలుగుదేశం జ‌నాలు కానీ, ఆ పార్టీ సోషల్ మీడియా అభిమానులు కానీ ఎ 2 అంటూ ఎగతాళి చేస్తుంటారు. విమర్శిస్తుంటారు. హేళన చేస్తుంటారు. జ‌గన్ తరువాత తెలుగుదేశం పార్టీకి అంత ప్రమాదకారి విజ‌యసాయి అని వాళ్లు ఏనాడో ఫిక్స్ అయిపోయారు. 

విజ‌యసాయిని బలంగా టార్గెట్ చేయడానికి బలమైన కారణమే వుంది. అది అందరూ అనుకున్నట్లు, కనిపిస్తున్నట్లు ఢిల్లీలో చక్రం తిప్పి జ‌గన్ కు మోడీ, అమిత్ షాలకు మధ్య బలమైన బంధం వుండేలా చూడడం మాత్రమే కాదు. అసలు కారణం వేరే వుంది.

జ‌గన్ మాదిరిగానే విజ‌యసాయి కూడా తెలుగుదేశం మూలాల్లోని బలమైన సామాజిక వర్గాన్ని బలంగా టార్గెట్ చేసారు. ఆయనకు కూడా ఆ సామాజిక వర్గం అంటే కిట్టనట్లే కనిపిస్తోంది. జ‌గన్ మాదిరిగానే ఆయన కూడా ఆ సామాజిక వర్గం వల్ల అన్ని విధాలా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. జ‌గన్ కారణంగా ఆ వర్గం రాష్ట్ర స్థాయిలో ఇబ్బంది పడుతుంటే విజ‌యసాయి కారణంగా విశాఖలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే జ‌గన్ ను వ్యతిరేకించే రఘురామ కృష్ణం రాజుకు కూడా విజ‌యసాయినే టార్గెట్. సుజ‌న కు కూడా విజ‌యసాయినే లక్ష్యం.

కృష్ణా,గుంటూరు జిల్లాల్లో బలంగా వున్న ఆ వర్గం అక్కడ మరో బలమైన సామాజిక వర్గం నుంచి పోటీ ఎదుర్కొంటోంది. ఇది దశాబ్దాల కాలంగా జ‌రుగుతున్నది. అయితే చాలా ముందు చూపుతో, తెలివిగా ఆంధ్రలోని మరో ప్రధాన నగరమైన విశాఖ మీద దాదాపు 80ల కాలంలోనే కన్నేసింది ఆ వర్గం. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చింది లగాయతు ఉత్తరాంధ్ర, విశాఖ ల మీద గట్టి పట్టు సాధిస్తూ వచ్చింది. 

ఉత్తరాంధ్రలో మైనింగ్, హోటల్, థియేటర్, రియల్ఎస్టేట్, ఇంకా ఇంకా అనేకానేక వ్యాపారాల్లో బలంగా విస్తరించారు. అక్కడితో ఆగకుండా రాఙకీయంగా కూడా అవకాశాలు స్థానికుల నుంచి గుంజుకున్నారు. పార్టీ ఆ వర్గానిదే కావడంతో పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. పైగా కృష్ణ, గుంటూరు జిల్లాలో మరో వర్గం నుంచి బలమైన పోటీ, వ్యతిరేకత వుంది కానీ ఉత్తరాంధ్రలో అలాంటి ఎదురుగాలి అన్నది అస్సలు రాలేదు. స్థానికులు తల వంచుకునే వుండిపోయారు.

ఇలాంటి టైమ్ లో విజ‌యసాయి విశాఖలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆ సామాజిక వర్గానికి కష్టాలు మొదలయ్యాయి. ఒకటి రెండు కాదు వారి వ్యవహారాలు, అక్రమాలు అన్నీ విజ‌యసాయి వెలికి తీసారు. అక్రమ కట్టడాలు, అక్రమ ఆక్రమణలు, ఇలా ఎన్నో. అలా చేసినపుడల్లా విజ‌యసాయి మీద, జ‌గన్ ప్రభుత్వం మీద బురద జ‌ల్లడమే పనిగా పెట్టుకున్నారు ప్రత్యర్థులు. తమను కావాలని వేధిస్తున్నారంటూ. ఇన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని చేసిన ఆక్రమణలు, కట్టిన అక్రమ కట్టడాలను అడ్డుకుంటే వేధింపులు అనే అస్త్రం సంధించడం ప్రారంభించారు.

విజ‌యసాయిని విశాఖ నుంచి సాగనంపితే తప్ప మన అక్రమాలకు, ఆశలకు భవిష్యత్ వుండదని ఆ వర్గం గట్టిగా డిసైడ్ అయిపోయింది. అవకాశం దొరికినపుడల్లా విశాఖకు విజ‌యసాయి దూరం అంటూ కథనాలు వండి వార్పిస్తూనే వున్నారు. జ‌గన్ కోప్పడ్డారని, జ‌గన్ దూరం పెట్టారని, జ‌గన్ ను ఉత్తరాంధ్ర నుంచి విజ‌యసాయిని తరిమేసారని ఇలా వండని కథనం లేదు. తమ వర్గానికి వున్న సవాలక్ష మీడియా ల నుంచి ఒక్కోసారి ఒక్కో కథనం. గమ్మత్తేమిటంటే ఇప్పటి వరకు అలాంటి కథనాలు ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం కాకపోవడం.

విజ‌యసాయి ఉత్తరాంధ్రలో తనకంటూ బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నారు. వారితో నిత్యం మమేకమవుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అయితే విశాఖలో లేదంటే ఢిల్లీలో తప్ప మరెక్కడా వుండడం లేదు. ఇది అన్ని విధాలా ఆ వర్గాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇలా వదిలేస్తే వచ్చే ఎన్నికల తరవాత విశాఖ మీద తమ పట్టు వదిలేసుకోవాల్సి వస్తుందేమో అని భయపడుతోంది.

అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారీ విజ‌యసాయి మీద కథనాలు వండి వార్పించడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ఒక్కటీ నిజం కావడం లేదు. ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చింది. విజ‌యసాయికి ఎంపీ టికెట్ ఇక ఇవ్వరు అన్న ప్రచారం మొదలుపెట్టారు. ఇవ్వాళ ఈ మీడియా రాస్తే రేపు మరో మీడియా, మర్నాడు ఇంకో మీడియా. ఇలా తమ వేళ్లున్న ప్రతి మీడియాను వాడుతున్నారు.

ఇప్పుడు జ‌గన్ కనుక మరోసారి విజ‌యసాయికి అవకాశం ఇస్తే ఆ వర్గాన్ని నిరాశకు గురిచేసినట్లే. వాళ్ల ఆటలు కట్టించడానికి విజ‌యసాయికి మరోసారి చాన్స్ ఇచ్చినట్లే. ఏం జ‌రుగుతుందో చూడాలి.