అక్షింతలేస్తే పెళ్ళయిపోద్ది.!

'పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్ళిస్తాం..'  Advertisement – ఇదీ పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టే ముందు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ప్రకటనల సారాంశం.  రాయలసీమ కరవు…

'పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్ళిస్తాం..' 

– ఇదీ పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టే ముందు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ప్రకటనల సారాంశం. 

రాయలసీమ కరవు కోరల్లో చిక్కుకుంది. ఏదీ, పట్టిసీమ.? ఎక్కడుంది గోదావరి నీరు.? అని ప్రజలు ప్రశ్నిస్తున్నా, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా.. 'ఇదిగో, ఇంత నీటిని రాయలసీమకు పట్టిసీమ ద్వారా నీటిని తరలించాం..' అని చెప్పుకోలేకపోతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. చెప్పుకోడానికి, అక్కడ 'మేటర్‌' వుంటే కదా.! 

పట్టిసీమ ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసేసిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేనా, అచ్చంగా చెంబుడు నీళ్ళు కృష్ణా నదిలో కలిపేసి, 'నేనే నదుల అనుసంధాన కర్తని..' అంటూ ఘనంగా చాటేసుకున్నారు. గోదావరి నది, కాస్త లేటుగా అయినా కాలువల ద్వారా కృష్ణా నదిలో కలిసింది.. ఆ కారణంగానే పుష్కరాలు ఎలాగోలా గడిచిపోయాయి ఆంధ్రప్రదేశ్‌లో. నదుల అనుసంధానం ఎందుకు పనికొచ్చిందయ్యా.? అంటే, అదిగో పుష్కరాల కోసం.. అని చెప్పుకోవాల్సి వచ్చింది. 

ప్రస్తుతం రాయలసీమలో కరువు విలయతాండవం చేస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబే చెబుతున్నారు. కానీ, ఆ కరువు చంద్రబాబుని చూసి పారిపోయిందట. ఎలా.? అనడక్కండి. చంద్రబాబు రెయిన్‌ గన్‌లను కనిపెట్టారు. వాటి ద్వారా కరువుని పారద్రోలేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వాటర్‌ ట్యాంకర్లను తరలించారు.. వాటి సాయంతో, రెయిన్‌ గన్‌ల ద్వారా పొలాల్లో నీళ్ళు చల్లారు. అంతే రైతులు పండగ చేసుకున్నారుట! 

అరె, నీళ్ళు చల్లితే పంటలు పండుతాయా.? సమృద్ధిగా నీరు వుంటేనే తప్ప పంటలు కాపాడలేం అన్నది ఒకప్పటి మాటేనా.? అని అనుకోకండి. చంద్రబాబు తీరే అంత. అక్షింతలు చల్లితే పెళ్ళయిపోతుందనుకుంటారాయన. నాలుగు రోజులు హడావిడి చేసేసి, చేతులు దులిపేసుకుని.. వ్యక్తిగత పర్యటనల పేరుతో విదేశాలకు చెక్కేశారు చంద్రబాబు. 'రాష్ట్రాన్ని కరువు పరిస్థితుల్లో గాలికొదిలేశారు..' అన్న విమర్శలు రాకుండా, ఇదిగో ఇలా కళ్ళాపి చల్లేశారన్నమాట. 

కాస్తలో కాస్త రైతుల అదృష్టమేంటంటే, చంద్రబాబు రెయిన్‌ గన్‌ల పేరుతో హడావిడి చేసినప్పుడు, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఆ వర్షాల్ని చంద్రబాబే, ఆకాశంలో రెయిన్‌గన్‌లు పెట్టి కురిపించేశారని టీడీపీ ముందు ముందు ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

చంద్రబాబు ఇలా వ్యవహరించబట్టే.. బిచ్చమేసి పండగ చేసుకోమంటోంది కేంద్రం. అచ్చంగా చంద్రబాబునే ఫాలో అవుతున్న కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవాల్సింది పోయి, 'నువ్వు నేర్పిన విద్యయే కదా..' అంటూ చంద్రబాబుకి తేల్చి చెబుతోంది. దాంతో ఆటోమేటిక్‌గా చంద్రబాబు నోటికి లాక్‌ పడిపోతుందని ప్రత్యేంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!