అల్లూరి సినిమా హీరో కాదు.!

ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ.. ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ..’ అంటూ గాంధీ అంటే ఏంటో చెప్పారు ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన రాసిన పాటలో తూటాలు…

ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ.. ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ..’ అంటూ గాంధీ అంటే ఏంటో చెప్పారు ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన రాసిన పాటలో తూటాలు పేలాయి. ఆ పాట ఓ అద్భుతం. మహాత్మా గాంధీ ఎంత గొప్ప వ్యక్తి.. అన్నది స్వయంగా చూడని ఈ తరం వారికి, సీతారామశాస్త్రి పాటతో గాంధీజీ గొప్పతనం తెలుస్తుంది. జాతి పిత గొప్పతనం ఇలాగైనా జాతికి తెలుస్తున్నందుకు సంతోషించాలో, మహానుభావుల్ని మర్చిపోవడం అనే దౌర్భాగ్యం మనకు పట్టినందుకు ఆవేదన చెందాలో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి. అల్లూరి సీతారామరాజు ఎవరు.? సూపర్‌ స్టార్‌ కృష్ణా.? అనే ప్రశ్న తెరపైకొస్తుందేమో.! పరిస్థితి అలానే వుందిప్పుడు.

తెల్ల దొరల దాష్టీకాల్ని ప్రశ్నించిన అల్లూరి సీతారామరాజు, తెల్లదొరల తూటాలకు బలైపోయారన్నది చరిత్ర. ఆ చరిత్ర చరిత్ర పుటల్లో కలిసిపోయే ప్రమాదం ఏర్పడిరది. స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చింది.. కానీ స్వాతంత్య్రం సిద్ధించడానికి ప్రాణ త్యాగం చేసినవారిలో అతి కొద్దిమందినే కొంతమేర గుర్తుపెట్టుకున్న ఘనత మనకే దక్కుతుందేమో. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాకగానీ, అల్లూరి సీతారామరాజు గుర్తుకు రాకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచినందుకు కాస్త సంతోసించాలి. అల్లూరి జయంతిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారికంగా ఇప్పుడు నిర్వహిస్తోంది. అల్లూరిని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురు రాజకీయ నాయకులు గుర్తు చేసుకున్నారు.. ఊరూ వాడా కాకపోయినా, చాలా చోట్ల అల్లూరి జయంతి వేడుకల్ని నిర్వహించేశారు.

అల్లూరి సీతారామరాజు జీవిత గాధను పాఠ్యాంశంగా చేయాలని ఓ ‘నేత’ అంటే, ఇంకొకాయన విశాఖ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలని డిమాండ్‌ చేసేశారు. పార్లమెంటులో అల్లూరి విగ్రహం పెట్టాలన్నది మరో డిమాండ్‌. చూస్తోంటే ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయమనో, పబ్లిసిటీ స్టంటో అన్పిస్తోందే తప్ప, ఇక్కడ చిత్తశుద్ధితో వారంతా అల్లూరిపై ప్రేమ కురిపిస్తున్నారని మాత్రం ఎవరికీ అన్పించడంలేదు. పైగా ఉమ్మడి రాష్ట్రం విడిపోతే తప్ప, అల్లూరి ఎవరికీ గుర్తుకురాకపోవడమేంటన్న ఆవేదన అల్లూరి అభిమానుల్లో కలుగుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకగానీ దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు గురించిన సోయ కలగలేదు తెలంగాణలోని రాజకీయ నాయకులకి. అల్లూరి విషయంలోనూ అదే జరుగుతోందిప్పుడు. ఎలాగైతేనేం.. స్వాతంత్య్ర పోరాటంలో తనదైన ముద్ర వేసిన అల్లూరిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించింది.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పీవీ నరసింహారావుని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించిందని అల్లూరి కీర్తి పెరగడమో, తగ్గడమో జరగదు. పీవీ నరసింహారావు విషయంలోనూ ఇంతే. మహనీయుల్ని స్మరించుకోవడమంటే మనల్ని మనం గౌరవించుకోవడం అంతే తప్ప, తమని ఎవరో గౌరవిస్తారని గాంధీ అయినా, అల్లూరి అయినా ఇంకొకరైనా ప్రజల పక్షాన పోరాటం చేయలేదు.