తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదును పూర్తిగా ఒక్క రాజో, ఒక్క ముఖ్యమంత్రో నిర్మించారా? ఇంత పెద్ద నగరాన్ని ఎవరు నిర్మించారంటే ఏం సమాధానం చెబుతాం? ఫలానా చోటు నుంచి ఫలానా ప్రాంతం వరకు ఓ ముఖ్యమంత్రి నిర్మించాడని, మరో బస్తీని ఇంకో ముఖ్యమంత్రి నిర్మించాడని చెబుతామా? కుతుబ్‌షాహీల వంశంలోని కులీ కుతుబ్ షా హైదరాబాద్ నిర్మాణకర్త. ఆ తరువాత నిజాములు, ఆ తరువాత కాంగ్రెసు, టీడీపీ ప్రభుత్వాలు నగరాన్ని అభివృద్ధి చేశాయి. ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు నగరాభివృద్ధికి కృషి చేస్తోంది. నాలుగొందల ఏళ్లకు పైబడి చరిత్ర ఉన్న హైదరాబాద్ అనేకమంది కృషి ఫలితంగా ఇప్పుడీ స్థాయికి చేరుకుంది. కాబట్టి నగరాన్ని మొత్తం తానే నిర్మించానని, ఆ క్రెడిట్ అంతా తనకే దక్కాలని ఎవ్వరూ క్లెయిమ్ చేసుకునేందుకు, జబ్బలు చరచుకునేందుకు వీల్లేదు. ఫలానా నిర్మాణం నా హయాంలో జరిగిందని ఏ ముఖ్యమంత్రయినా చెప్పుకోవచ్చు. తప్పు లేదు. అంతేగాని మొత్తం నగరాన్ని నేనే ఒంటిచేత్తో నిర్మించానని ఎవరైనా చెప్పుకుంటే పిచ్చోడనుకోవాలి. కాని ఇలా చెప్పుకునే వ్యక్తి ఒకరున్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
పొద్దన లేస్తే ఈయన పని ఆత్మస్తుతి, పరనింద. తన్ను తాను పొగుడుకోవడం, ఎదుటివారిని తిట్టడం. హద్దులు దాటిపోతున్న ఈయన ప్రచార కండూతిని, గొప్పలను ఆపడం ఎవ్వరి తరం కాదు. తాజాగా 'ఇండియా టుడే' మీడియా సంస్థ చెన్నయ్‌లో నిర్వహించిన 'సౌత్ కాంక్లేవ్'లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇండియా టుడే జాతీయ మీడియా కదా. ఇక్కడ గొప్పలు చెప్పుకుంటే జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైన ప్రచారం లభిస్తుందన్న ఉద్దేశంతో విజృంభిచారు. 'హైదరాబాదు కంటే పెద్దదైన, మెరుగైన, సౌకర్యవంతమైన రాజధాని నగరం నిర్మిస్తాను. భారత్‌లో అమరావతి ఉత్తమ నగరం అవుతుంది' అని చెప్పారు. ప్రపంచశ్రేణి రాజధాని నగరం, వాటర్ గ్రిడ్, మానవ వనరుల అభివృద్ధి …ఈ మూడింటికి తన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 'ప్రజలు నన్ను కలకాలం గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను'..అని చెప్పారు చంద్రబాబు. ఈయన చెప్పిందాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హైదరాబాదును మించిన రాజధాని నిర్మించేంతవరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారనుకోవాలి.
హైదరాబాదు ఈ స్థాయికి రావడానికి వందల ఏళ్లు పట్టింది. అది కూడా పక్కన పెడదాం. ఆంధ్రా-తెలంగాణ కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పటి నుంచి లెక్క వేసుకున్నా సుమారు అరవై ఏళ్లలో హైదరాబాద్ అభివృద్ధి చెంది ఇప్పుడున్న స్వరూపానికి వచ్చింది. ఇప్పటి హైదరాబాదులా అమరావతిని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు మరో అరవై ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండాలి. అది సాధ్యమా? డెబ్బయ్యో పడికి దగ్గరగా వస్తున్న చంద్రబాబు మరో అరవై ఏళ్లు సీఎంగా ఉండగలరా? 2019 ప్రథమార్ధంలో ఎన్నికలు జరుగుతాయి. అంటే ఆయన టర్మ్ పూర్తవడానికి రెండేళ్ల సమయమే ఉంది. అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇలాంటప్పుడు హైదరాబాదును మించిన నగరం ఎన్నేళ్లలో నిర్మిస్తారు? గొప్పలు చెప్పుకోవడం బాబుకు అలవాటుగా మారింది. అది పోయేది కాదు. ఇక ఆయనకున్న మరో అలవాటు ఒక అంశంపై రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం. దీన్నే కొందరు రెండు కళ్ల సిద్ధాంతమంటారు.
ఇండియా టుడే సదస్సులోనూ విచిత్రంగా మాట్లాడి తన జనం నవ్వుకునేలా (మనసులోనే) చేశారు. ప్రధాని మోదీ పెద్ద నోట్లు రద్దు చేయగానే ఈ విషయం తానెప్పుడో చెప్పానని, ప్రధానికి లేఖలు రాశానని, డీమానిటైజేషన్‌లో తన పాత్ర ఉందని చెప్పుకున్నారు. అంటే నల్లధనం నిర్మూలనకు తానూ కారకుడినేనని చెప్పడమన్నమాట. ఆ తరువాత ఆర్థిక సంక్షోభంతో జనం విలవిల్లాడుతుండటంతో చిరాకు పడిన బాబు మోదీ సర్కారు చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం ఎలా దొరుకుతుందో తనకు అర్థం కావడంలేదన్నారు. ఇలా చెప్పిన ఈ పెద్దమనిషి ఇండియా టు డే సదస్సులో పెద్ద నోట్ల రద్దు దేశానికి చాలా మంచి చేసిందన్నారు.
'నా రాష్ట్రంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభం రాలేదు. తొంభై శాతం ప్రజలు డీమానిటైజేషన్‌ను సమర్థించారు. పది శాతమే వ్యతిరేకించారు' అని చెప్పారు. ఆయన పార్టీ అనుకూల పత్రిక, టీవీ ఛానెల్ నోట్ల రద్దును చీల్చిచెండాడిన విషయం బాబుకు తెలియదా? ఆ మీడియాలో ప్రజల కష్టాలపై ఎన్ని కథనాలు వచ్చాయో చూసుకుంటే అసలు విషయం తెలుస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబు మనస్తత్వం విచిత్రంగా ఉంది. ఈ విషయంలో ఆయన్ని ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు.