ప్రపంచానికి పాఠాలు చెప్తాం.. ప్రపంచాన్ని బెదిరిస్తాం.. ఎక్కడన్నా ఏదన్నా ఘటన జరిగితే, దాన్ని పట్టుకుని వెటకారాలు చేస్తాం, పుండు మీద కారం జల్లుతాం..
ఇప్పటిదాకా అమెరికా 'పెద్దన్న' తీరు ఇదే. ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం చెయ్యాలన్నా పెద్దన్న చూపే అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ఫలానా చోట శాంతి భద్రతల సమస్య తలెత్తింది.. అది ప్రపంచానికే పెను ముప్పుగా మారుతుందంటూ అమెరికా చేసే యాగీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐసిస్ మీద ఇరాక్ మీద ఎటాక్ చేసినా, అల్‌ఖైదాని మట్టుబెట్టేందుకంటూ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లను రణరంగాలుగా మార్చేసినా.. అదంతా పెద్దన్న పుణ్యమే.
చేసుకున్నోడికి చేసుకున్నంత.. అన్నట్లు అమెరికాపై అల్‌ఖైదా చాన్నాళ్ళ క్రితం పడగ విప్పింది. ఆ దెబ్బకి ఆఫ్గనిస్తాన్‌ని తన అధీనంలోకి తెచ్చుకుని, అల్‌ఖైదాని ఏరి పారేసింది అమెరికా. పాకిస్తాన్‌కి అమెరికాతో స్నేహంతో కూడిన అవసరాలుండడంతో.. అమెరికా, తమ గడ్డ మీద దాడులు చేస్తున్నా పాకిస్తాన్ చూసీ చూడనట్లు వదిలేయక తప్పలేదు. ఆ దెబ్బకి పాకిస్తాన్‌లో తీవ్రవాదం మరింత పెచ్చుమీరిందనుకోండి.. అది వేరే విషయం.
ఇక ఇప్పుడు అమెరికాలో కాల్పులు నిత్యకృత్యమైపోయాయి. ఐసిస్ మద్దతుదారుడొడు 'స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకిస్తూ' ఆ మధ్య అమెరికాలో మారణహోమం సృష్టించాడు. 'గే క్లబ్'లో జరిగిన ఆ దాడి దెబ్బకి అమెరికా షాక్‌కి గురయ్యింది. దాన్నుంచి తేరుకోకముందే, అమెరికాలో తాజాగా అల్లర్లు వెలుగు చూశాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు మృత్యువాత పడ్డారు. ఇంతకీ, ఆ కాల్పులకు తెగబడిందెవరు.? అన్నదే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.
అమెరికాలో 'గన్ కల్చర్' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాన్నిప్పుడు ఐసిస్ తనకు అనుకూలంగా మార్చుకుంది. అదే సమయంలో, తమపై అమెరికాలో జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తూ నల్లజాతీయులూ గళం విప్పుతున్నారు. దాంతో పరిస్థితి రోజురోజుకీ ఉద్రిక్తంగా, భయానకంగా మారుతోంది అమెరికాలో. ఇంతకుముందెన్నడూ ఇంత తీవ్రమైన పరిస్థితులు చోటుచేసుకోకపోవడంతో, తాజా పరిణామాల పట్ల అమెరికా అధ్యక్షుడు ఒబామా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దన్న పరిస్థితి ఎందుకు ఇంత దయనీయంగా తయారయ్యింది.? చీమ చిటుక్కుమంటే అలర్ట్ అయ్యే అమెరికా ఇంటెలిజెన్స్ ఇప్పుడేమయ్యింది.? అంతర్గత పరిస్థితులకు ఐసిస్ తోడైతే, భవిష్యత్తులో అమెరికా ముఖచిత్రమెలా వుంటుంది.? ఏమో మరి, కాలమే సమాధానం చెప్పాలి.