స్కాన్ రిపోర్ట్ 2021: ఎవ‌రు.. ఎలా?

ఒక ఏడాది గడచిపోయింది. ఇళ్లలో దాక్కున్న వాళ్లు బయటకు వచ్చి భయంగా తమ బతుకులను పునఃప్రారంభించిన సంవత్సరం ఇది! రాజకీయం కూడా అదే తీరుగా స్తబ్ధతలోంచి తిరిగి చైతన్యాన్ని పుంజుకుంది. యావత్తు ప్రజల జీవితాలను…

ఒక ఏడాది గడచిపోయింది. ఇళ్లలో దాక్కున్న వాళ్లు బయటకు వచ్చి భయంగా తమ బతుకులను పునఃప్రారంభించిన సంవత్సరం ఇది! రాజకీయం కూడా అదే తీరుగా స్తబ్ధతలోంచి తిరిగి చైతన్యాన్ని పుంజుకుంది. యావత్తు ప్రజల జీవితాలను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా ప్రభావితం చేస్తూ ఉండే.. రాజకీయాల్లో ఏ పార్టీకి ఈ సంవత్సరం ఎలా కలిసి వచ్చింది. ఎలా దెబ్బతీసింది. ఏపీ రాజకీయాల విషయానికి వస్తే.. అక్కడ రాజకీయం మూడు ముక్కలాటే. 

వైసీపీ- తెలుగుదేశం- జనసేన మధ్యనే రాజకీయం నడుస్తుంటుంది. బీజేపీ తామున్నామని చెప్పుకోడానికి ఉబలాటపడుతుంటుంది గానీ.. పట్టించుకునే వారు లేరు. అయితే ఈ మూడు పార్టీలు ఈ ఏడాదిలో ఏం చేశాయి? ఏం సాధించాయి? ప్రజలు ఈ పార్టీల ఏడాది నడకను ఏ రకంగా అర్థం చేసుకోవాలి. గ్రేటాంధ్ర అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం.. ఇయర్ ఎండ్ స్టోరీ..

వైఎస్సార్ కాంగ్రెస్ ఈ వెనకడుగులు ఎందుకోసం?

మాట తప్పను మడమ తిప్పను అనేది చాలా అందమైన నినాదం. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి భావాన్ని తమకు ఆపాదించుకుని ప్రజల ఎదుట మంచి పేరు తెచ్చుకోవడానికి నానా పాట్లు పడుతూ ఉంటారు. నాయకుల్లో ప్రతి ఒక్కరికీ ప్రజలు తమను ఈ నినాదానికి ప్రతిరూపంగా గుర్తించాలనే కోరిక ఉంటుంది. ఇలాంటి కోరిక ఎంతమందిలోనైనా ఉండవచ్చు గాక.. కానీ.. ఆ పేటెంటును సొంతం చేసుకున్న వర్తమాన రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి!

అవును- ఈ విషయం నిస్సంశయం. మాట తప్పను- మడమ తిప్పను అనే నినాదాన్న ఆయన అంత విస్తృతంగా గత ఎన్నికల సమయంలో వాడారు. కాస్త లోతుగా వ్యవహారాలను గమనించే జ్ఞానం లేనివారు.. ఈ నినాదాన్ని ఈయనే పుట్టించారేమో అని భ్రమపడేంతగా ఆయనకు అది స్థిర పడింది. మడమ తిప్పకపోవడానికి మొండితనం ఉంటే సరిపోతుంది. కానీ మాటతప్పకపోవడానికి గుండె ధైర్యం కావాలి. ఒక రకంగా చూసినప్పుడు ఆ రెండు లక్షణాలూ కూడా పుష్కలంగా, పరిపూర్ణంగా ఉన్న నాయకుడు జగన్ అని చెప్పొచ్చు. ఇదంతా రెండున్నరేళ్ల కిందటి వ్యవహారం. కానీ.. ఇప్పుడు ఆ నినాదాన్ని ఆయనే స్వయంగా ప్రయత్నపూర్వకంగా మరచిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్కొక్కటిగా చూద్దాం. 

రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గాన్ని మారుస్తానని జగన్ అధికారంలోకి వచ్చినప్పుడే  చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇప్పటివరకు ఎరగనంత పిన్నవయస్కుడైన ఈ యువ ముఖ్యమంత్రి ఆలోచనల్లో ఏదో ఫ్రెష్ నెస్ ఉన్నదని అందరూ అనుకున్నారు. ఇలాంటి ప్రకటన వలన పనిచేయని, చేయలేని మంత్రులకు, అడ్డగోలు దోపిడీకి పాల్పడే మంత్రులకు.. తమ మెడపై కత్తి వేలాడుతోందనే భయం ఉంటుందని ప్రజలు ఆశించారు. ఆ రూపేణా మంత్రుల అవినీతి తగ్గుతుందని కూడా ఆశించారు. కానీ.. మంత్రి పదవి అనేది హద్దులెరగని అవినీతికి  హక్కు అన్నట్లుగా చెలరేగిన వాళ్లున్నారు. 

జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్లకు కేబినెట్ ను మారుస్తాననే భీషణ ప్రతిజ్ఞ చేయకపోయినా నష్టమేం లేదు. కనీసం తన తండ్రి సహా, ఇతర సీనియర్లు అనుసరించే పద్ధతినే పాటించి ఉన్నా సరిపోయేది. పదవీకాలం మధ్యలో రాజకీయ అవసరాలను బట్టి పునర్ వ్యవస్థీకరిస్తే పోయేది. లేదా.. మంత్రులు అవినీతి వంటి బాగోతాలతో బజార్న పడినప్పుడ.. వారిమీద అప్పటికప్పుడు వేటు వేసే అలవాటు చేసుకుని ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. కానీ.. జగన్ రెండున్నరేళ్ల తర్వాత.. మంత్రి వర్గం మారుస్తా అనే ప్రకటన అడ్డం పెట్టుకుని.. అప్పటిదాకా పార్టీ, ప్రభుత్వం పరువు బజార్న పడేసిన వారిని కూడా ఉపేక్షిస్తూ వచ్చారు. దానివల్ల అవినీతి పరుల పట్ల జగన్‌కు ఉపేక్షభావం ఉన్నదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. 

కనీసం రెండున్నరేళ్ల తర్వాత అన్నమాట నిలబెట్టుకున్నారా అంటే అదీ లేదు. ఇప్పుడు దీన్నింకా సాగదీస్తున్నారు? సందేహంలో పడేస్తున్నారు? మాట తప్పడం అనే ప్రతిన కిందికి ఇది రాదా? మంత్రులు ఎవరు అనేది ప్రత్యక్షంగా ప్రజలకు సంబంధించిన అంశం కాకపోవచ్చు. కానీ.. ప్రభుత్వం వ్యవహార సరళికి వారు ప్రతినిధులు, ప్రతీకలు అనే సంగతి ముఖ్యమంత్రికి తెలియదా?

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. చాలా నిర్ణయాలను కోర్టులు అడ్డుకున్నాయి. జగన్ ప్రభుత్వం ఆ మేరకు కొంత అప్రతిష్టను మూటగట్టుకుంది. కోర్టులు జగన్ కు ప్రతికూలంగానే వ్యవహరిస్తున్నాయన్న ప్రచారమూ ప్రజల్లోకి వెళ్లింది. చాలా మంది ప్రజలు దానిని నమ్ముతున్నారు కూడా. ప్రభుత్వ నిర్ణయాలు కోర్టుల ద్వారా ఆగిపోతే.. సర్కారు వెనక్కు తగ్గాల్సి వస్తే.. అది ఓకే. కానీ తమ నిర్ణయాలపై ప్రభుత్వం తామే వెనక్కు తగ్గితే దాని అర్థం ఏమిటి? అలాంటి వాటిలో అన్నింటికంటె ముఖ్యమైనది మూడురాజధానుల వ్యవహారం. 

హైకోర్టులో మూడురాజధానుల వ్యవహారంపై రోజువారీ విచారణ ప్రారంభం అయిన వెంటనే.. కేవలం కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది. సిఆర్డీయేను పునరుద్ధరించింది. ఆ చట్టంలో సాంకేతికంగా కొన్ని లోపాలు ఉన్నాయని కొంత వ్యవధి తీసుకుని ఇంకా గట్టి చట్టం తెస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ఆ చట్టం కోర్టు ఎదుట పూర్తి స్కానింగ్ కు గురైతే.. చాలా ఇబ్బంది తప్పదని, అందుకే వెనక్కి తగ్గారని బయటకు లీకైంది. ఈలోగా ప్రభుత్వం ఆలోచనల్లో డొల్లతనం బయటపడిపోయింది. 

శాసనమండలి రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం జగన్మోహన్ రెడ్డి ఈ రెండున్నరేళ్లలో చేసిన అతిపెద్ద తప్పు! నిజానికి రద్దు చేయడమే ఆనాటి తప్పు! తన నిర్ణయానికి అడ్డు చెప్పగల ఏ వ్యవస్థనూ సహించే స్థితిలో లేని.. తొలినాటి వేడి, తొలినాటి దూకుడులో జగన్ అనాలోచిత నిర్ణయాన్ని తీసుకున్నారు. భవిష్యత్తును సరిగ్గా అంచనా వేయగలిగిన వాడే అయితే.. రెండున్నరేళ్ల తర్వాత ఈ శాసనమండలి కూడా తన దయాప్రాప్తమైన పదవులతో సాగిలపడుతూ ఉండే వారితోనే నిండిపోతుంది కదా.. అప్పటిదాకా కాస్త సహనం, కాస్త సంయమనం పాటిస్తే పోదా? అనుకుని ఉండేవారు. కానీ.. ఆవేశం ఆయనను నిలవనీయలేదు. 

అప్పటికప్పుడు రద్దు చేసేసి భంగపడ్డారు. ప్రత్యేకహోదా లాంటి కీలక అంశాలను కేంద్రంనుంచి రాబట్టడంలో ఫెయ్యిల్యూర్ ను ఎవ్వరూ తప్పుపట్టే స్థితిలో లేరు.. కనీసం మండలి రద్దు నిర్ణయాన్ని కూడా కేంద్రం నుంచి ఆమోదించుకోలేకపోతే.. తన పంతాన్ని అలా నెగ్గించుకోలేని స్థితిలో ఉంటే.. అమిత్ షా ఫోను చేసిన ప్రతిసారీ.. వారి పార్టీకి అనుకూలంగా.. రాజ్యసభలో తమ ఎంపీలు అందరితో మూకుమ్మడిగా ఓట్లు వేయించి.. జగన్ ఏం సాధించినట్టు? వారిని అలా ప్రసన్నం చేసుకుని ఏం బావుకున్నట్టు?

శాసన మండలి విషయంలో కనీసం ఒక పటిష్టమైన వాదన కూడా తయారు చేసుకోకుండా ఆ విషయంలో వెనకడుగు వేశారు. ఎందుకు రద్దు చేశారో.. ఎందుకు ఉపసంహరించుకున్నారో.. పార్టీ నేతలు చెప్పిన వాదనలు ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేశాయి. 

మద్యం రేట్లు ఎలా తగ్గాయి? జగన్ మద్యం రేట్లను అరాచకంగా పెంచినప్పుడు.. జనానికి అలవాటైన బ్రాండ్లను అందుబాటులో లేకుండా చేసినప్పుడు కూడా ఆయన తీరును సమర్థించిన తటస్థులు కొందరున్నారు. ఆ రకంగా ఆయన తాను ప్రజలకు మాట ఇచ్చిన సంపూర్ణ మద్య నిషేధానికి బాట వేస్తున్నారనే అనుకున్నారు. కానీ ఇప్పుడీ వెనకడుగు ఏమిటి? తెలంగాణ కంటె తక్కువ ధరకు కొన్ని రకాల మద్యం దొరికే వాతావరణాన్ని పునఃప్రతిష్టించడం దేనికి సంకేతం. ఏదో ఒకటి ప్రజలకు చెప్పాలి గనుక.. సమర్థించుకుంటున్నారు కానీ వారి వాదనలు తర్కానికి నిలబడేలా లేవు. 

ఎడ్వాంటేజీ ఒకటే..

ఇదివరకటి సంవత్సరాల్లాగానే.. ఈ ఏడాది కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న అంశం ఒకే ఒక్కటి.. అది ప్రజాబలం! ప్రజాబలం ఉన్నప్పుడు ఆ ఉధృతిలో ఎన్ని లోపాలు ఉన్నా సరే అన్నీ పరిహరించుకుపోతాయని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. కానీ మరీ అంత సులువు కాదు. అనుచితమని అనేకులు విమర్శిస్తున్న స్థాయిలో.. ఉచిత పథకాలను ఆయన అమలు చేస్తుండవచ్చు గాక.. ఆ లబ్ధిని పొందుతున్న వారందరూ ఆయనను తమవాడిగా భావిస్తుండవచ్చు గాక.. కానీ.. ఈ ఉచిత పథకాలను కొన్నాళ్లకు వారు హక్కుగా భావిస్తారు.

ఆ తర్వాత.. అది జగన్ దయ అనే ఆలోచన మరచిపోతారు. అప్పుడిక ప్రభుత్వ పరంగా చిన్న నొప్పి తగిలినా.. ఆ నెగటివ్ అంశం ఒక్కటే వారికి కనిపిస్తూ ఉంటుంది. విద్యుత్ బిల్లుల దగ్గరినుంచీ.. ప్రజలకు ప్రతినెలా స్వానుభవంలోకి వచ్చే విషయంలో వారికి నొప్పి కలిగించినప్పుడు.. ఆ దెబ్బకు- సంక్షేమ పథకాలు తెచ్చే చాలా వరకు మంచిపేరు గంగపాలవుతుంది. 

2021 మరియు  జగన్ :

ఇది జగన్‌కు వెనుకడుగుల సంవత్సరంగా మిగిలిపోయింది. మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ తరవాత సీనియర్ మంత్రులందరూ పార్టీని రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉండాలని జగన్ గతంలో ఓ సందర్భంలో అన్నారు. వారి సంగతి తర్వాత.. ప్రభుత్వాన్నే వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఇలాంటి వెనుకడుగులను వేస్తున్నారా? అనేది ఒక చర్చ.

అదే నిజమైతే వ్యూహం మంచిదే కావచ్చు. ఈ నిర్ణయాలను చూపించి.. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాడని ఎవరైనా భ్రమపడవచ్చు గాక.. కానీ.. ఇవన్నీ జగన్ వెనుకడుగులు అనే సంగతిని ప్రజలు పూర్తిగా మరచిపోయిన తర్వాతే.. ఎన్నికలు వస్తాయి. రాజకీయంలో నినాదాలను మరచిపోవడం, వెనుకడుగులు వేయడం, మడమ తిప్పడం కొత్తగానీ, వింతగానీ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి దళాలు.. అలాంటి నిర్ణయాలను కనీసం ప్రజలు మెచ్చేలా సమర్థించుకోవడం నేర్చుకోవాలి. 

తెలుగుదేశం: బాబుకు వయోభారం.. చినబాబు పార్టీకి భారం!

తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రాజకీయ వైకుంఠపాళిలో ఎత్తు పల్లాలను చవిచూసిన అనుభవం ఆ పార్టీకి బాగానే ఉంది. అయితే ఆ పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలోంచి కోలుకుని.. మళ్లీ ఉన్నతులను అధిరోహించడం సాధ్యమేనా? అనే తమను తామే సందేహించుకునే పరిస్థితిలో ఉంది. 

2014 నుంచి తొలి అయిదేళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబునాయుడు.. రాజకీయాల్లో తన సీనియారిటీ నలభయ్యేళ్లు దాటిందని పదేపదే చాలా గొప్పగా ప్రచారం చేసుకున్నాడు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ.. దేశ రాజకీయాల్లో తనంతటి వాడు తాను మాత్రమేనని చెప్పుకున్నాడు. వందిమాగధులంతా ఆహా ఓహో అన్నారు. ఆ పదవీకాలం కాస్తా ముగిసింది. అప్పుడు ఘనత కింద చాటుకున్నది కాస్తా.. ఇప్పుడు శాపంగా మారింది.

ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కావడం తర్వాతి సంగతి. ఇప్పుడు అది సీనియరిటీ కింద కనిపించడం లేదు. ఆయన సీనియర్ సిటిజన్ లాగా కనిపిస్తున్నారు. అప్పుడు గొప్ప అనుకున్నది ఇప్పుడు ముసలితనం కింద కనిపిస్తోంది. ముసలితనం వల్ల.. చంద్రబాబు పార్టీని నడపలేకపోతున్నారు. వయోభారం ఆయనను వెన్నాడుతోంది. 

కానీ.. చాలా కారణాల వల్ల చంద్రబాబునాయుడును చూస్తే జాలి కలుగుతుంది. ఇంత ముసలితనం వచ్చే సమయానికి దేశంలో ప్రాంతీయ పార్టీలు నడిపిన ఇతర నాయకులు చాలా మంది.. తమ వారసులను పార్టీ సారథులుగా తీర్చిదిద్దారు. మనకు అలాంటి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ.. చంద్రబాబు పాపం.. ఎంత ముసలితనం వచ్చినా.. స్వయంగా తాను నడిపితే తప్ప నడవలేని స్థితిలో పార్టీని ఉంచారు. సహజంగా తన నీడను కూడా నమ్మే అలవాటు లేని చంద్రబాబునాయుడు తత్వం వల్లనే.. ఆ పార్టీలో మరో నాయకుడు.. పార్టీ సారథ్యం చేపట్టగల స్థాయికి ఎదగలేకపోయారు. 

వీటన్నింటిని మించి పుత్రవాత్సల్యం మరొకటి. అన్ని రకాలుగానూ తన అసమర్థతను నిరూపించుకున్న నారా లోకేష్ ను భావి ముఖ్యమంత్రిని చేసేయాలన్న చంద్రబాబునాయుడు అత్యాశ ఆ పార్టీకి పెద్ద శాపంగా మారింది. 

చంద్రబాబునాయుడుకు వయోభారం ఒక శాపం అయితే.. నారా లోకేష్ ఆ పార్టీకే పెను భారంగా మారారు. లోకేష్ ను నాయకుడిగా నిరూపించడానికి పార్టీశ్రేణులన్నీ సర్వశక్తులు ఒడ్డవలసి వస్తోంది. కానీ.. లోకేష్ ఎక్కడికక్కడ తన చేతగానితనాన్ని బయటపెట్టుకుంటూనే ఉన్నారు. 

ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొన్నాళ్లకు వారికి అధికారం కట్టబెట్టిన క్రేజ్ కాస్త పలచబడుతుంది. అప్పుడు ప్రతిపక్షాలు బలంగా పనిచేస్తే.. పుంజుకుంటాయి. కానీ.. ఏపీలో రివర్సులో జరుగుతోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయిన తర్వాత కూడా.. వైసీపీ ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా పెరుగుతూనే ఉంటే.. తెలుగుదేశం నానాటికీ బలహీన పడుతోంది. అన్నీ సవ్యంగా ఉండి, తాను అధికారంలో ఉంటే.. నా అంతటి వాడు లేడు అని చెప్పే చంద్రబాబు.. పార్టీ విషమ పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఆయన వ్యూహ నిపుణుడు అనే మాట భ్రమ అని నిరూపణ అవుతోంది.

రాష్ట్రంలో వరుసగా ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశానికి పరాభవమే. అధికార పార్టీ అక్రమాలు చేస్తోందనే ఒకే ఒక డైలాగు వల్లిస్తూ ఎంతకాలం నెట్టుకొస్తారు. ఆత్మ పరిశీలన చేసుకోకపోతే.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ కూడా మిగలకపోవచ్చు. 

2021 మరియు చంద్రబాబు

చంద్రబాబునాయుడుకు 2021 కన్నీళ్లు నామ సంవత్సరం అని చెప్పాలి. పోయినోళ్లందరూ మంచోళ్లు అని సినీ కవి చెప్పినట్టుగా, పోయినరోజులన్నీ మంచిరోజులు అని గతం గురించి ఆయన చెప్పుకోవాల్సిందే. 2021 మాత్రం ఆయనకు చీకటి సంవత్సరమే. తిరుగులేని మెజారిటీలతో ఆయనను శాసనసభలో కూర్చుండబెట్టిన కుప్పం నియోజకవర్గ ప్రజలు ఆయనను ఏ రేంజిలో ఛీ కొట్టారంటే.. ఆయన బహిరంగంగా ఏడవడానికి కూడా సిగ్గుపడ్డారు. సరిగ్గా అదే సమయానికి కన్నీళ్లు కట్టలు తెంచుకోవడానికి మరో సందర్భం ఆయనకు కలిసి వచ్చింది. 

తన కుటుంబం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో ఆయన భోరుభోరున ఏడ్చారు. చంద్రబాబునాయుడు అని కాదు.. 72 ఏళ్ల వయసులో ఉండే.. ఏ వృద్ధుడు ఏడ్చినా సరే.. మనకు గుండె చెమ్మగిల్లుతుంది. కానీ.. చంద్రబాబునాయుడు ఏడ్చి ఆగిపోయి ఉంటే అలాగే అందరి గుండెల్లో ఆ తడి అలాగే ఉండేది. 

కానీ ఆయన రెండో రోజునుంచి.. తన కన్నీళ్లను రాష్ట్ర ప్రజలందరికీ పంచిపెట్టడానికి పెద్ద ఉద్యమం ప్రారంభించాడు. దాంతో అభాసుపాలయ్యాడు. రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటినుంచి… అపారమైన మార్కెటింగ్ తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగిన ఈ నాయకుడికి.. తనను తాను మార్కెట్ చేసుకోవడానికని కన్నీళ్లను వాడుకునే టెక్నిక్ సులువుగానే అబ్బింది. కానీ కన్నీళ్లను మార్కెట్ చేసుకుని.. తనపట్ల ప్రజల్లో ఆదరణ పెంచుకోవడంలో ఫెయిలయ్యారు. 

జనసేన: జీవితం సినిమా.. రాజకీయం నాటకం!

ఒక రంగంలో ఉద్ధండులుగా కీర్తి శిఖరాలను అధిరోహించినవారు.. రెండో పనిచేసేంత ఖాళీ ఉన్నప్పుడు.. దానికి సంబంధం లేని మరొక రంగంవైపు చూస్తారు. అదే రంగాన్ని పోలి ఉండే రెండో పని చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ అనివార్యంగా అలా చేయాల్సి వస్తే.. అప్పుడు చేస్తున్న పని కంటె కాస్త మెరుగైన పని చేయాలని అనుకుంటారు.

ఉదాహరణకు- ఓ హైస్కూలు టీచరు.. అదే రంగంలో ఉండదలచుకుంటే.. కాలేజీ లెక్చరర్ కావాలని అనుకుంటాడు గానీ.. ఎలిమెంటరీ స్కూలు మేష్టారు కావాలని కోరుకోడు. కానీ.. పవన్ కల్యాణ్ శైలే వేరు. పవన్ కల్యాణ్ ఒక రంగంలో ఉద్ధండుడే. దానికి సంబంధంలేని మరో పని చేయదలచుకుంటున్నట్టుగా ప్రజలను నమ్మించాలని ఆయన అనుకుంటారు. కానీ ఆయన అదే పనిని మరో రూపంలో చేస్తున్నారనే సంగతిని ప్రజలు గుర్తించేస్తుంటారు. 

పవన్ కల్యాణ్ స్వతహాగా సినిమా నటుడు. సినిమా నటనే ఆయన జీవితం, బతుకు తెరువు. అయితే రాజకీయాలను ఆయన వ్యాపకంగా ఎంచుకున్నారు. వాస్తవం ఏమిటంటే.. రాజకీయ రంగాన్ని ఆయన నాటకంలాగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఒక్కో అంశం మీ ఒక్కో నాటకం నడుస్తుంటుంది. సినిమాల తరహాలో ఒక సారి షూట్ చేసి వంద ఊర్లలో ఆడించడం కాదు కదా.. నాటకం అంటే. అందుకే ఒక చోట నాటకం సూపర్ హిట్ అయిందంటే.. ఆ నాటకాన్ని అనేక ఊర్లలో ఆడుతుంటారు. పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయ కార్యకలాపాలు మొత్తం నాటకాన్నే తలపిస్తున్నాయి.

ప్రత్యేకించి 2021 సంవత్సరంలో పవన్ టేకప్ చేసినవన్నీ సినిమా ప్రాజెక్టులే. రాజకీయం జోలికి వెళ్లింది తక్కువ. ఆ కొన్నింటిలో ప్రధానమైంది. రోడ్ల రిపేరు- శ్రమదానం! ఏపీలో రోడ్లు దెబ్బతిన్న మాట వాస్తవమే. అందులో ప్రభుత్వ వైఫల్యం ఉన్న మాట కూడా వాస్తవమే కావచ్చు. కానీ.. పవన్ కల్యాణ్ పంచె ఎగ్గట్టి ఓ తట్ట మట్టి అందులో వేయగానే.. రోడ్డు బాగయిపోతుందా? ఒక రాజకీయ పార్టీగా.. రోడ్ల బాగు కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు గట్రా చేయడం, ప్రభుత్వంలో కదలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఓకే. అలాంటిది లేకుండా.. చిన్న నాటకం నడిపించారు. ఆ నాటకం సూపర్ హిట్ అయిందని అనుకుని.. ఇప్పటికీ ఊరూరా అదే నాటకం ఆడడానికి ప్రయత్నిస్తున్నారు. 

పవన్ కల్యాణ్ ఈ ఏడాదిలో ప్రత్యేకంగా టేకప్ చేసిన నాటకం.. విశాఖ ఉక్కు పరిశ్రమ. ఆయన ఏ బీజేపీతో అయితే అంటకాగుతున్నాడో.. సదరు కేంద్రప్రభుత్వం విశాఖ ఉక్కు ఉసురుపోసుకుంటోంది. పవన్- తాను వారికి మద్దతిస్తానంటాడు. వారితో కలిసి దీక్ష చేస్తాడు.. వారి చప్పట్ల కోసం సభ పెడతాడు. కానీ.. వారంతా ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో.. ఆ కేంద్రప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడు! విశాఖ ఉక్కు ప్రెవేటు పరం అవుతోంటే.. దానికి జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టి తిడతాడు. తన నాటకం రక్తికట్టడం తర్వాత.. అభాసుపాలవుతుందునే స్పృహ కూడా ఆయనకు కలగడం లేదు. ఈ ఏడాది పొడవునా ఆ నాటకం ఆడుతూనే ఉన్నాడు. 

ఈ ఏడాదిలో పవన్ విడిచిపెట్టిన మరో నాటకం- అమరావతి! అమరావతి ఉద్యమానికి తానే ప్రాణం, జవం, జీవం అన్నట్టుగా గతంలో వారికి అనుకూల ప్రకటనలు చేసిన పవన్ కల్యాణ్ ఈ ఏడాదిలో పెద్దగా పట్టించుకోలేదు. చివరికి వారు పాదయాత్ర చేస్తోంటే కూడా పట్టించుకోలేదు. బీజేపీ వారిని దూరం పెడుతోందని అనుకుని.. తన స్నేహానికి పాటు రాకుండా జాగ్రత్త పడ్డారు. తీరా అమిత్ షా హూంకరించిన తర్వాత.. బీజేపీ వారు ఒక్కసారిగా యాత్రలోకి దూకితే.. నామ్ కే వాస్తేగా తమ దళాలను కొంత వారితో కలిపి నడిపించాడు. అంతే తప్ప.. తాను ఇదివరకటి క్రియాశీల పాత్ర తీసుకోలేదు.

పవన్ విడిచిపెట్టిన నాటకం అమరావతి అయితే.. దాచిపెట్టిన నాటకం చంద్రబాబుతో బంధం. తెలుగుదేశంతో వచ్చే ఎన్నికల నాటికి బంధం తిరిగి కుదుర్చుకుని ఎన్నికల బరిలోకి దిగాలని అనుకుంటున్న పవన్ కల్యాణ్.. ఇటీవలి కాలంలో.. చంద్రబాబు అనుకూల డైలాగులు కొన్ని వల్లిస్తున్నారు. అదే సమయంలో.. తాను తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు ప్రజలు గుర్తించకుండా కొన్ని అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవేమీ పారే పాచికలు కాదని, తన నాటకాలన్నింటినీ.. ప్రజలు చాలా తెలివిగా వెయ్యి కళ్లతో గుర్తిస్తూ ఉంటారని ఆయనకు తెలియడం లేదు. 

2021 మరియు పవన్

సినిమా టికెట్ల వ్యవహారాన్ని సంస్కరించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని కొత్త ఆలోచనలు చేస్తోంటే.. వాటికి వ్యతిరేకంగా హూంకరించిన వ్యక్తి పవన్ కల్యాణ్. తద్వారా యావత్ సినీ పరిశ్రమను కూడా ఇరుకున పెట్టిన ఘనత ఆయనది. ఒకప్పట్లో సినిమా రంగాన్ని విడిచిపెట్టేశానని చెప్పి రాజకీయాల్లోకి వెళ్లి.. డబ్బుకోసం అంటూ మళ్లీ ఇటు గెంతిన.. ప్రస్తుతానికి అటూఇటూ అవసరాన్ని బట్టి.. ఖాళీని బట్టి.. పదేపదే గెంతుతూ ఉన్న పవన్ కల్యాణ్ నిలకడలేని వైఖరి గురించి.. అందరికంటె ఎక్కువగా ఆయన సినీ సహచరులకే తెలుసు.

అందుకే ఆయన ప్రభుత్వం మీద గర్జించినప్పుడు వారంతా ఆయనను విడిచిపెట్టారు. ఆయన నిలకడలేని తనాన్ని బీజేపీ కూడా ఇవాళో రేపు వదిలించుకున్నా ఆశ్చర్యం లేదు. 

.. విజయలక్ష్మి