సెలబ్రిటీలకు అప్పుడప్పుడు కొన్ని చిక్కులు వస్తుంటాయి. ఏమిటా చిక్కులు, ఇబ్బందులు? ఆర్థికపరమైనవా? కాదులెండి. ఇది మరో రకమైన ఇబ్బంది. నేను ఫలాన సెలబ్రిటీ కూతురును, కొడుకును అని కొందరు మీడియాకు ఎక్కుతుంటారు. కొందరు నేను ఫలాన సెలబ్రిటీని పెళ్లి చేసుకున్నాను.
ఆమె నా భార్య అంటూ మీడియాలో రచ్చ చేస్తారు. ఇలాంటి ఇబ్బందులు సెలబ్రిటీల్లో మహిళలకే ఎక్కువగా ఎదురవుతుంటాయి. కాని ఇవేవీ వాస్తవం కాలేదు. చాలా ఏళ్ల కిందట ఇలాంటి అనుభవం అప్పటి టాప్ హీరోయిన్ జయప్రదకు ఎదురైంది. తాను ఆమెను పెళ్లి చేసుకున్నానంటూ ఒక వ్యక్తి చాలా రోజులు గొడవ పెట్టాడు.
కొంతకాలం కిందట తమిళ హీరో ధనుష్ తమ కుమారుడేనంటూ తమిళనాడుకే చెందిన దంపతులు చెప్పుకొని ధనుష్‌ను తమకు అప్పగించాలని పట్టుబట్టారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన పురట్చి తలైవి జయలలిత చనిపోయిన తరువాత ఒక యువతి, ఒక యువకుడు తాము జయలలిత పిల్లలమంటూ కోర్టుకెక్కారు.
ఆ యువకుడు తాను జయలలిత-శోభన్‌బాబుకు పుట్టినవాడినని చెప్పాడు. వారిద్దరూ చెప్పింది అవాస్తవమని తేలిపోయింది. జయలలిత మరణించాక ఆమె ఆస్తికి తానే వారసురాలినని ఆమె మేనకోడలు దీపా జయకుమార్ రంగప్రవేశం చేసింది కదా. జయకు పిల్లలు (వారసులు) లేరు కాబట్టే ఆస్తి దక్కించుకోవడానికి దీప వచ్చింది. అదేవిధంగా ఓ యువతి, యువకుడు కూడా అదృష్టాన్ని పరీక్షించుకుందామని వచ్చారు.
తాజాగా 'నేను అనురాధ పౌడ్వాల్ కూతురును' అంటూ కేరళకు చెందిన 45 ఏళ్ల మహిళ తెర మీదికి వచ్చింది. అవునూ…అనూరాధ పౌడ్వాల్ ఎవరో గుర్తుందా? ఒకప్పుడు బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన గాయని. చిత్ర రంగంలోకి ప్రవేశించిన కొద్ది కాలంలోనే చక్కని గాయనిగా పేరు తెచ్చుకుంది. అప్పట్లో టాప్ సింగర్ లతా మంగేష్కర్‌కు పోటీ ఇచ్చింది.
లతాజీయే అనూరాధను పైకి రాకుండా రాజకీయాలు చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అందులో నిజానిజాలేమిటో తెలియవు. అనూరాధ పౌడ్వాల్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించి గౌరవించింది. గాయనిగా జాతీయ అవార్డు సాధించింది. ఆమె భర్త అరుణ్ పౌడ్వాల్ మ్యూజిక్ కంపోజర్. సరే…ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, కేరళకు చెందిన కర్మలా అనే 45 ఏళ్ల మహిళ (ముగ్గురు పిల్లల తల్లి) తాను అనూరాధ పౌడ్వాల్ కూతురినని క్లెయిమ్ చేసుకుంది.
తనకు జన్మనిచ్చింది అనూరాధేనంటూ ఈమె తిరువనంతపురం జిల్లా ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈమె మొత్తం పేరు కర్మలా మోడెక్స్. ఈమె కథనం ప్రకారం…ఈమె పుట్టిన నాలుగు రోజులకే అనూరాధ ఈమెను తిరువనంతపురానికి చెందిన పొన్నచ్చన్-ఆగ్నెస్ దంపతులకు ఇచ్చేసింది. అప్పట్లో గాయనిగా ఎంతో బిజీగా ఉన్న అనూరాధ బిడ్డను పెంచలేననే ఉద్దేశంతో కేరళ దంపతులకు ఇచ్చింది.
నాలుగైదేళ్ల క్రితం తన పెంపుడు తండ్రి పొన్నచ్చన్ మరణశయ్య మీద ఉన్నప్పుడు తన తల్లి అనూరాధ పౌడ్వాల్ అనే నిజం చెప్పాడని కర్మలా చెబుతోంది. తన పెంపుడు తండ్రి ఆర్మీలో పని చేశాడని, ఆయన ఉద్యోగరీత్యా మహారాష్ట్రలో ఉన్నప్పుడు అనూరాధ తనను పెంచుకోవడానికి ఇచ్చిందని చెప్పింది. ఆ తరువాత తమ కుటుంబం కేరళకు వచ్చేసిందని తెలిపింది.
పొన్నచ్చన్‌కు ముగ్గురు కొడుకులు ఉన్నారు. తాను అనూరాధ కూతురినని తెలుసుకున్న తరువాత కర్మలా ఆమెను ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించింది. కాని అనూరాధ నుంచి రెస్పాన్స్ రాలేదు. అందుకే తాము లీగల్‌గా వెళ్లాలని నిర్ణయించుకున్నామని కర్మలా తరపు న్యాయవాది అనిల్ ప్రసాద్ చెప్పాడు.
అనూరాధ పౌడ్వాల్‌ను, ఆమె ఇద్దరు పిల్లలను ఈ నెల (జనవరి) 27న తన ముందు హాజరుకావాలని తిరువనంతపురం ఫ్యామిలీ కోర్టు ఆదేశించిందని న్యాయవాది చెప్పాడు. రోజుల వయసున్నప్పుడే తన తల్లి అనూరాధ, తండ్రి అరుణ్ తనను తిరస్కరించినందుకుగాను 50 కోట్లు పరిహారం చెల్లించాలని కర్మలా డిమాండ్ చేసింది.
అనూరాధ, అరుణ్ ఆస్తుల్లోనూ తనకు వాటా ఉందని చెబుతోంది. తనకు సమాచారం లేకుండా ఆస్తులు అమ్మడానికి వీల్లేదని అంటోంది. అయితే కర్మలా చెప్పిన కథనాన్ని అనూరాధ విశ్వసించలేదు. అవసరమైతే కర్మలా డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధంగా ఉందని ఆమె తరపు లాయర్ చెప్పారు.