ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూ అలజడి

ఇప్పటిదాకా తెలంగాణలోనే స్వైన్‌ఫ్లూ మరణ మృదంగం మోగిస్తూ వస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది. విశాఖలో స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఓ బాలుడు మృతి చెందడంతో, ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూపై అలజడి చెలరేగింది.…

ఇప్పటిదాకా తెలంగాణలోనే స్వైన్‌ఫ్లూ మరణ మృదంగం మోగిస్తూ వస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది. విశాఖలో స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఓ బాలుడు మృతి చెందడంతో, ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూపై అలజడి చెలరేగింది.

స్వైన్‌ఫ్లూ చికిత్సకు సంబంధించి హైద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి వస్తోన్న స్వైన్‌ఫ్లూ అనుమానితులు, బాధితులకు వైద్య చికిత్స అందిస్తోన్న విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని చోట్ల స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం ఆసుపత్రుల్ని సమాయత్తం చేస్తున్నా, అక్కడి చికిత్సపై పలు అనుమానాలున్నాయి.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వైద్యం పరంగా సకల సౌకర్యాలూ హైద్రాబాద్‌కే పరిమితం చేశారు గత పాలకులు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ వంటి ప్రముఖమైన ప్రభుత్వ ఆసుపత్రులన్నీ హైద్రాబాద్‌లోనే వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు చోట్ల ప్రభుత్వ ఆసుపత్రులు వున్నా, వాటిల్లో సౌకర్యాలు హైద్రాబాద్‌తో పోల్చితే నామ మాత్రంగా కూడా లేవన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

ఇక, స్వైన్‌ఫ్లూని నిర్ధారించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో తగిన సౌకర్యాలే లేవు. సంక్రాంతి పండగకి హైద్రాబాద్‌ నుంచి సొంతూళ్ళకు వెళ్ళే క్రమంలో పెద్దయెత్తున సీమాంధ్రులు తమతోపాటు స్వైన్‌ఫ్లూ వైరస్‌నీ తీసుకెళ్ళారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి నాటికి హైద్రాబాద్‌లో స్వైన్‌ఫ్లూ అత్యంత తీవ్రస్థాయికి చేరుకున్న దరిమిలా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళనను రేకెత్తిస్తోంది.

దావోస్‌ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూ పరిస్థితిపై వాకబు చేసినా, స్వైన్‌ఫ్లూపై భయం ఏమీ అక్కర్లేదని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ భరోసా ఇస్తున్నా.. సామాన్యుల్లో మాత్రం స్వైన్‌ఫ్లూపై భయాందోళనలు తగ్గడంలేదు.