ఏపీఎన్నార్టీఎస్ కృషి ఫ‌లించింది!

మాతృభూమి పురోభివృద్ధే ల‌క్ష్యంగా ఏర్పాటైన ఏపీఎన్నార్టీఎస్ అతి త‌క్కువ కాలంలోనే ఘ‌న విజ‌యం సాధించింది. విదేశాల్లోని ఎన్నారైలు… ప్రత్యేకించి ప్రవాసాంధ్రుల‌ను ఏపీ అభివృద్ధి వైపు దృష్టి సారించేలా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీఎన్నార్టీఎస్‌కు రూప‌క‌ల్ప‌న…

మాతృభూమి పురోభివృద్ధే ల‌క్ష్యంగా ఏర్పాటైన ఏపీఎన్నార్టీఎస్ అతి త‌క్కువ కాలంలోనే ఘ‌న విజ‌యం సాధించింది. విదేశాల్లోని ఎన్నారైలు… ప్రత్యేకించి ప్రవాసాంధ్రుల‌ను ఏపీ అభివృద్ధి వైపు దృష్టి సారించేలా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీఎన్నార్టీఎస్‌కు రూప‌క‌ల్ప‌న చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ సంస్థకు అధ్యక్షుడిగా, ఏపీ ఎన్నారై వ్యవ‌హారాల స‌ల‌హాదారుగా ప్రవాసాంధ్ర ప్రముఖుడు డాక్టర్ ర‌వికుమార్ వేమూరును సీఎం చంద్రబాబునాయుడు నియ‌మించారు. 

ఈ నియామ‌కం జ‌రిగిన వెంట‌నే రవి వేమూరు కార్యరంగంలోకి దిగి ఎన్నారైలను ఏకతాటిపైకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఉపాధి నిమిత్తం అమెరికా వెళ్లిన పలువురు ఎన్నారైలు ఆ త‌ర్వాత అక్కడే త‌మ సొంత కంపెనీల‌ను ఏర్పాటు చేశారు. వీరంతా క‌లిసి ఐటీ స‌ర్వ్ అల‌యెన్స్ పేరిట ఓ గ్రూపుగా ఏర్ప‌డ్డారు. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 500ల‌కు పైగా కంపెనీలు స‌భ్యత్వం క‌లిగి ఉన్నాయి. మాతృభూమికి ఏదో చేయాల‌న్న త‌ప‌న‌, స్థానికంగా ఉపాధి అవకాశాల పెంపుద‌లే ప్రధాన ల‌క్ష్యంగా ఈ సంస్థ ప‌నిచేస్తోంది. ఈ సంస్థను సంప్రదించిన ర‌వి వేమూరు… ఏపీలో పెట్టుబడులు పెట్టడం, న‌వ్యాంధ్రను ఐటీ హ‌బ్‌గా తీర్చిదిద్దే విష‌యంపై చ‌ర్చలు జ‌రిపారు. 

ఈ చ‌ర్చలు ఫ‌లించాయి. ర‌వి వేమూరు నెర‌పిన మంత్రాంగంతో ఐటీ స‌ర్వ్‌ అల‌యెన్స్ లోని 17 కంపెనీల య‌జ‌మానులు ఏపీలోని విశాఖ‌లో త‌మ శాఖ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపారు. ఐటీ స‌ర్వ్ అల‌యెన్స్ నుంచి సానుకూల స్పంద‌న రావ‌డంతో ఏపీ ప్రభుత్వంతోనూ చ‌ర్చించిన ర‌వి వేమూరు… ఆయా సంస్థల‌కు చెందిన శాఖ‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన చ‌ర్యల‌న్నిటినీ యుద్ధప్రాతిప‌దిక‌న పూర్తి చేయించారు. ఇక ప్రారంభోత్సమే త‌రువాయిగా మారిన త‌రుణంలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నేడు విశాఖ ప‌ర్యట‌న‌కు వ‌చ్చారు. 

అక్కడ‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయ‌న ఒకేసారి 9 కంపెనీల శాఖ‌ల‌ను ప్రారంభించారు. మరో ఎనిమిది కంపెనీలు ఆఫీసులు ఏర్పాటుచేసుకున్నాక ప్రారంభం కానున్నాయి. ఫ‌లితంగా ఏర్పాటైన నెల‌ల వ్వవ‌ధిలోనే ఏపీఎన్నార్టీఎస్ త‌న తొలి ఫ‌లాన్ని ఏపీకి అందించిన‌ట్లైంది. ఈ సంద‌ర్భంగా ర‌వి వేమూరు కృషిని చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. మాతృభూమిపై మ‌మ‌కారంతో ఏపీని ఐటీ హ‌బ్‌గా తీర్చిదిద్దేందుకు ర‌వి ప్రత్యేక చొర‌వ చూపార‌ని కీర్తించారు. మ‌రిన్ని ఐటీ కంపెనీలు ఏపీకి వ‌చ్చేలా ర‌వి మ‌రింత మేర కృషి చేయాల‌ని చంద్రబాబు ఆకాంక్షించారు. తొలి విడ‌త‌లో విశాఖ‌లో ఏర్పాటైన‌ అమెరికా కంపెనీల జాబితాలో థాట్ వేవ్‌, ఫ్యాబిట్‌, థ్రిల్,  కైరోస్‌, రైజ్‌, అంజూర్‌, ప్రైమస్‌, డీజిట్‌, ఎవ‌ల్యూటిజ్, విండిసిటీ త‌దిత‌ర కంపెనీలున్నాయి. 

దీనిపై డాక్టర్ రవి వేమూరు ఏమన్నారంటే… ఐటి సర్వ్ ద్వారా ఆంధ్రాకు వచ్చిన కంపెనీలకు ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందింది. యాభై శాతం తక్కువకే ఆఫీస్ స్పేస్ వారికి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 30 కంపెనీలతో చర్చలు జరుగుతుండగా తొమ్మిది కంపెనీలు ఈరోజు సీఎం చేతుల మీదుగా ప్రారంభం అయ్యాయి. మిగిలిన కంపెనీలు కూడా త్వరలో ఏర్పాటవుతాయి. ఈ తొమ్మిది కంపెనీల వల్ల 300 మందికి ఐటీలో ప్రత్యక్ష ఉపాధి లభించిందన్నారు. 

ఈ విజయం వెనుక సతీష్ మండువ, రమేష్ తుమ్ము, ఐటీ సర్వ్ ప్రతినిధుల బృందం కృషి ఉంది. వారు ఏపీ ఎన్నార్టీఎస్ అధ్యక్షులు రవి వేమూరు, మురళి గారుతో కలిసి ప్రభుత్వాన్ని-ఎన్నారైలను కలిపి ఆంధ్రకు ఉద్యోగాల వలసను తీసుకురాగలిగారు. 

ఈ సందర్భంగా ఐటి సర్వ్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు పాలన వ్యవహారాల అధ్యక్షులు సతీష్ మండువ డాక్టర్ రవి వేమూరు గారికి కృతజ్ఞతలు తెలిపారు. రవి గారి రాజీలేని తత్వం, నిబద్ధత వల్ల ఈరోజు వైజాగ్ ఐటీ రంగంలో ఎంతగానో దూసుకెళ్తోందని ఎన్నారైల సంక్షేమమే కాకుండా వారికి అభివృద్ధికి, తద్వారా ఏపీ అభివృద్ధికి ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్ష బాధ్యతల్లో భాగంగా రవి గారు ఎంత గానో కృషిచేస్తున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఎన్నారైలు, ఐటి సర్వ్ తరఫున రవి వేమూరు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.