ఏపీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ఖరారయ్యింది. వచ్చే నెల (నవంబర్)లో ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. నవంబర్ 13న హైదరాబాదు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం బయలుదేరనుంది. మరుసటి రోజున అమెరికాలోని లాస్ ఏంజెలిస్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 14న లాస్ ఏంజెలిస్‌లోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. తర్వాతి రోజు డల్లాస్‌కు వెళ్లి ఆ రోజంతా డల్లాస్‌లోనే పర్యటిస్తారు.
ఆ మరునాడు (నవంబర్ 16) రాత్రికి శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుంటారు. 17, 18 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… 19న న్యూయార్క్ నగరానికి బయలుదేరుతారు. 19, 20 తేదీల్లో న్యూయార్క్ లో జరిగే పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు… 21న న్యూయార్క్ నుంచే తిరుగు పయనం కానున్నారు.
అంటే నవంబరు 13 నుంచి మొదలయ్యే ఏపీ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన దాదాపుగా 8 రోజుల పాటు కొనసాగనుంది. ఈ పర్యటన మొత్తం ఏపీ ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన ఏపీఎన్నార్టీఎస్ పర్యవేక్షించనుంది. ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్షుడు, సీఈవో రవి వేమూరు ఈ పర్యటను ఆద్యంతం పర్యవేక్షిస్తారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే సమగ్ర పర్యటన ప్రణాళికను రూపొందించుకున్న చంద్రబాబు… అక్కడి ప్రవాసాంధ్రులతో పలుసార్లు సమావేశమవుతారు.
ఎన్నారై మరియు అమెరికా పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. నవ్యాంధ్రకు పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ఏపీఎన్నార్టీఎస్ ఆధ్వర్యంలో ఈ పర్యటన కొనసాగనుంది. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడం, ప్రవాసాంధ్రులను తమ జన్మభూమి అభివృద్ధిలో భాగస్వాములను చేయడం వంటి లక్ష్యాలతో ఏర్పడిన ఏపీఎన్నార్టీఎస్ గమ్యం చేరడంలో చంద్రబాబు పర్యటన మరింత సులువు కానుంది. ఎన్నారైల సంక్షేమం- జన్మభూమి అభివృద్ధి అనే సమతుల్య భావనతో చంద్రబాబు ఏపీఎన్నార్టీఎస్ ను నెలకొల్పిన విషయం తెలిసిందే.