ఒక్క హిట్ కొడితేనే భలేగా వుంటుంది. మరి రెండో హిట్ కొడితే, స్టారే మారిపోతుంది. కార్తికేయ సినిమాతో హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు చందు మొండేటి. ప్రేమమ్ సినిమా హిట్ కొట్టి ఇప్పుడు హీరోల అందరి దృష్టిని తన వైపు తిప్పేసుకున్నాడు. ప్రేమమ్ స్క్రిప్ట్ ను అతను డీల్ చేసిన విధానం, కమర్షియల్ చమక్కులు స్మూత్ గా జోడించిన పద్దతి క్లియర్ గా తెలిసింది. కార్తికేయ కన్నా ప్రేమమ్ నే చందును పూర్తి రేంజ్ దర్శకుడిగా ఎలివేట్ చేసింది అని చెప్పాలి.
అందుకే కావచ్చు. దాదాపు చాలా మంది హీరోలు చందుకు ఫోన్ చేసి అభినందననలో ముంచెత్తారు. చందుతో ఎప్పటి నుంచో పరిచయం వున్న బన్నీ, ఇంకా వరుణ్ తేజ, సాయి ధరమ్ తేజ ప్రత్యేకంగా అభినందించారట. సరైన డైరక్టర్లు దొరికితే మెగా క్యాంప్ లోకి లాగేయడానికి రెడీ వుంటారు. మరి కొంపదీసి..చందును కూడా లాగేస్తారేమో ?
నాగ్ ఉబ్బి తబ్బిబ్బు
నాగ్ చైతన్య తండ్రి హీరో నాగార్జున అయితే ఓ రేంజ్ లో చందును ప్రశంసల్లో ముంచెత్తారట. దుబాయ్ నుంచి మహాబలేశ్వర్ నేరుగా షూటింగ్ కోసం వెళ్తూ, ట్రాన్సిట్ లో ఆగినపుడు ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తోంది. కొత్తగా బాగా చేసావు అని చెప్పను..విడుదలకు ముందే చెప్పేసాను..యు డిడ్ ఇట్ అనే టైపులో నాగ్ అభినందించినట్లు తెలుస్తోంది. ఇక నిన్నటికి నిన్న నాగ్ ట్విట్టర్ లో చందు గురించి ఓ రేంజ్ ట్వీట్ కూడా చేసేసారు.
నాగ చైతన్య కు ఇప్పటిదాకా నటుడిగా పేరు రాలేదు. హిట్ లు ప్లాప్ లు వుండొచ్చు. కానీ చైతూ బాగా చేసాడు అన్న డైలాగ్ వినిపించలేదు. అలాంటిది తొలిసారి ఈ సినిమా విషయంలో ఆ ప్రశంస కీలకంగా వినిపిస్తోంది. బహుశా అది కూడా నాగ్ ఆనందానికి ఓ కారణం కావచ్చు. పైగా చాలా ఫ్లాప్ ల తరువాత చైతూ హిట్ కొట్టాడు కదా. అది కూడా ముఖ్యమే.