అరబ్‌ దేశాల్లో వెంటనే అమలు…!

భారత్‌ పవిత్ర దేశమని, ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన దేశమని, గొప్ప రుషులు జన్మించిన దేశమని ఇంకా చాలా చాలా విశేషణాలు జోడించి కొందరు పొగుడుతుంటారు. ఇది నిజమే అయివుండొచ్చుగాని అది కొన్ని వేల, వందల…

భారత్‌ పవిత్ర దేశమని, ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన దేశమని, గొప్ప రుషులు జన్మించిన దేశమని ఇంకా చాలా చాలా విశేషణాలు జోడించి కొందరు పొగుడుతుంటారు. ఇది నిజమే అయివుండొచ్చుగాని అది కొన్ని వేల, వందల ఏళ్ల క్రితం నాటి మాట. ప్రజాస్వామ్యం లేని, రాజులు పరిపాలించే కాలం నాటి మాట. ఇప్పుడు దీన్ని పవిత్ర దేశమని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి. ఇది అత్యాచారాల దేశం. మహిళలను వెంటాడి అత్యాచారాలు చేస్తున్న రాక్షసులు జీవిస్తున్న దేశం. రెండు నెలల పసికందు మొదలుకొని ఎనభై ఏళ్ల పండు ముదుసలి పైనా ఘోరంగా, దారుణంగా అత్యాచారాలు సాగుతున్న దేశం. చివరకు శవం మీద కూడా అత్యాచారం చేసినట్లు ఓ పత్రికలో వార్త వచ్చింది. 

యూపీఏ-2 ప్రభుత్వంలో చిరంజీవి పర్యాటక శాఖ మంత్రిగా ఉండగా టూరిజం అభివృద్ధికి కొంత కృషి చేశారు. ఆ సందర్భంగానే వివిధ దేశాల్లో పర్యటించారు. ఆ సమయంలో ఓ దేశం తన పర్యాటకులను 'ఇండియా వెళ్లకండి. అది అత్యాచారాలు సాగించే దేశం' అని హెచ్చరించింది. ఈ విషయం చెప్పి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో విదేశాల నుంచి వచ్చే మహిళా పర్యాటకులపైన అత్యాచారాలు చేయడం సాధారణమైపోయింది. నడుస్తున్న బస్సులో అత్యాచారం చేసి రోడ్డు మీదికి విసిరేసిన ఘటన కూడా జరిగింది. 

రోజూ వార్తా పత్రికలు తిరగేస్తే అత్యాచారాల వార్తలు ఐదారైనా కనబడతాయి. మీడియాకు ఎక్కని ఘటనలు ఎన్నున్నాయో తెలియదు. ఢిల్లీలో నిర్భయపై అత్యాచారం ఎంతటి సంచలనం కలిగించిందో ఇంకా మర్చిపోలేదు. విచిత్రమేమిటంటే ఆ ఘటన తరువాత అత్యాచారాలు మరింత పెరిగిపోయాయి. మన దేశంలో ఎంతటి దయనీయ స్థితి ఉందంటే కేంద్ర మంత్రులు సైతం అత్యాచార ఘటనలను తేలిగ్గా తీసిపారేస్తున్నారు. పంజాబ్‌లో నడుస్తున్న బస్సులో అత్యాచారం చేసి రోడ్డుపై విసిరేస్తే ఆ యువతి చనిపోయింది. దీనిపై తీవ్రంగా ఆగ్రహించాల్సిన ఓ మంత్రి 'అది దైవ సంకల్పం' అని ముక్తాయించారు. 

ఇలాంటి నికృష్టపు వ్యాఖ్యలు చేసిన మంత్రులు ఎందరో ఉన్నారు. వీళ్లు మన పాలకులు కావడం ఏనాడు చేసుకున్న పాపమో అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆలోచింపచేసేదిగా ఉంది. ఈ తీర్పు గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి కూడా. 'చిన్న పిల్లలపై అత్యాచారాలు చేసేవారిని నపుంసకులుగా మార్చి వారిని లైంగికంగా పనికిరాకుండా చేయాలి' అని న్యాయమూర్తి కృపాకరన్‌  సోమవారం తీర్పు ఇచ్చారు. చిన్న పిల్లలపై, మహిళలపై సాగుతున్న అత్యాచారాల పట్ల ఆవేదన చెందుతున్న ప్రతి ఒక్కరూ ఈ తీర్పును ఆహ్వానించాలి. 

న్యాయమూర్తికి ఎంతగా ఆవేశం కలిగితే, ఎంతగా ఆవేదన చెందితే, ఎంతగా అసహ్యం వేస్తే ఆయన ఈ తీర్పు ఇచ్చి ఉంటారు? ఆయన తన తీవ్ర నిరసనను ఇలా తెలియచేశారనుకోవాలి. ప్రజాస్వామ్యవాదులమని చెప్పుకునేవారు, మానవ హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకునేవారు, సోకాల్డ్‌ మేధావులు ఈ తీర్పును నిరసిస్తారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమంటారు. అమానవీయమంటారు. కాని అత్యాచారాలు చేసేవారికి ఇలాంటి శిక్ష వేస్తే తప్పేమిటి?  కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌లో వరకట్నం కోసం ఓ వివాహితను హత్య చేసిన కేసులో అక్కడి హైకోర్టు 'దోషిని బహిరంగంగా ఉరి తీయాలి' అని తీర్పు ఇచ్చింది. అది అమలు జరగలేదనుకోండి. ఇప్పుడు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అమలు జరగదు. మనది ప్రజాస్వామ్య దేశం కదా…! 

ఉగ్రవాదులను ఉరి తీస్తున్నప్పుడు అత్యాచారాలు చేసేవారికి ఎందుకు కఠిన శిక్షలు వేయడంలేదు. అత్యాచారం కూడా ఉగ్రవాదమే…ఉన్మాదమే. మద్రాసు హైకోర్టు తీర్పు అరబ్‌ దేశాల్లో అయితే వెంటనే అమలు జరుగుతుంది. అక్కడ పాలన మాత్రమే ఉంది. ప్రజాస్వామ్యం లేదు కదా….! అత్యాచారాలు చేసేవారికి కఠిన శిక్షలు లేకపోవడంతో చెలరేగిపోతున్నారు. ఈ దేశంలో ఆడవారు అర్థరాత్రి కాదు పట్టపగలు తిరగాలంటేనే భయపడే భయంకరమైన పరిస్థితి దాపురించింది. ఇలాంటప్పుడు పవిత్రమైన దేశమంటూ పాత కథలు చెప్పుకుంటూ బతకడం ఎందుకు?