మహిళలపై అకృత్యాలకు పాల్పడటం.. అత్యాచారాలు చేయడం అనేది మగాడి జన్యువు మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు పరిశోధకులు. ఇది ఒక రకంగా వారసత్వ లక్షణం అని కూడా వారు తేల్చారు. ఉదాహరణకు.. ఒక వ్యక్తి అన్నకు కానీ, తమ్ముడికి కానీ, తండ్రికి కానీ.. అత్యాచారానికి పాల్పడ్డ నేపథ్యం ఉంటే.. సదరు వ్యక్తి కి కూడా లక్షణాలు చాలానే ఉంటాయట!
కుటుంబంలో ఎవరో ఒకరు అత్యాచార నేరగాళ్లు అయితే.. ఆ ఇంటి నుంచి వచ్చిన మగాళ్లు కూడా అలాంటి నేరానికి పాల్పడే అవకాశాలు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం తేల్చింది. ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ, స్వీడన్ కు చెందిన కరొలిన్ స్కా యూనివర్సిటీలు ఉమ్మడిగా అధ్యయనం చేసి ఈ అంశాన్ని తేల్చాయి.
ఇదేదో ఉత్తుత్తిగా తేల్చి చెప్పిన వ్యవహారం కాదు. ఏకంగా 37 సంవత్సరాల్లో నమోదైన వివిధ అత్యాచారాల కేసులపై పరిశోధించి ఈ విషయాన్ని తేల్చారు. వీటికి సంబంధించిన మొత్తం 21,566 మంది మగాళ్ల నేర చరిత్రను పరిశీలించి ఈ అంశాన్ని తేల్చారు.
దాదాపు 40 శాతం అత్యాచారాలు జనటిక్ నేచర్ తోనే జరుగుతున్నాయని.. 60 శాతం అత్యాచారాలు వ్యక్తిగత, అప్పటి పరిస్థితులను అనుసరించి జరుగుతున్నాయని ఈ పరిశోధకులు తేల్చారు. స్థూలంగా అత్యాచారాలకు ఒడిగట్టే వారి మనస్తత్వానికి వారి రక్త సంబంధీకులు మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుందని మాత్రం వీరు బల్లగుద్ది చెబుతున్నారు!