గోడ్సే వాదన – ''1948 జనవరి 13న గాంధీ మరణపర్యంత నిరాహారదీక్ష పూనుటకు నిర్ణయించుకున్నాడని తెలిసింది. దీనికి యిచ్చిన కారణం – భారతరాజ్యంలో హిందూముస్లిం ఐక్యత నెలకొల్పడుననే హామీ కావాలనుట మాత్రమే. కానీ యీ దీక్ష వెనుకనున్న అసలు ఉద్దేశం పాకిస్తాన్‌కు యివ్వడానికి తిరస్కరించిన రూ.55 కోట్లు యిచ్చేందుకు భారతప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం మాత్రమేనని నేను, నా వలె అనేకమంది స్పష్టంగా చూడగలిగాం. దీనికి జవాబుగా పాత పద్ధతిలోనే శాంతియుతంగా, కాస్త పెద్దయెత్తున ప్రదర్శన ఒకటి గాంధీ ప్రార్థనా సమావేశం వద్ద చేయాలని ఆప్టే సూచించాడు. దీనివలన సాధించేదీ ఏమీ లేదని తెలిసి నేను ఆ పథకానికి అర్ధమనస్సుతోనే అంగీకరించాను.''
– ఈ 55 కోట్లు గాంధీ పాకిస్తాన్‌కు యిప్పించడం గురించి ఎవరి అభిప్రాయం వారికి వుండడంలో ఆశ్చర్యం లేదు. ఆ అభిప్రాయం స్థిరంగా వుండకపోయినా ఆశ్చర్యం లేదు. ఇలా యిప్పించడాన్ని చిన్నప్పుడు నేను గట్టిగా ఖండించేవాణ్ని. పోనుపోను మరో కోణంలో ఆలోచించాక ఖండనలో దృఢత తగ్గింది. మనిషికైనా, ప్రభుత్వానికైనా విశ్వసనీయత అనేది ముఖ్యం. ఇందిరా గాంధీ రాజభరణాలు రద్దు చేసినపుడు చప్పట్లు కొట్టాను. మాజీ మహరాజులకు ఏం తక్కువని భరణాలు యివ్వాలి? తీసేసి మంచి పని చేశారు అనుకున్నాను. ఒకాయన అన్నాడు – 'వాళ్లకు ఆస్తులున్నాయా లేదా అనేది ప్రశ్న కాదు. వాళ్ల సంస్థానాలు విలీనం చేసుకునేటప్పుడు మీరు మా దేశంలో చేరడానికి ఒప్పుకుంటే ఏటా యింత యిస్తాం అని పెద్దమనుషులుగా సంతకాలు పెట్టి ఒప్పుకున్నాం. పాతికేళ్లు తిరక్కుండానే దాన్ని ఏకపక్షంగా తోసిరాజనడం ఏం మర్యాద?' అని. పాయింటేస్మీ అనిపించింది. తుళ్లూరులో టిడిపి ప్రభుత్వం రైతులకు ఏవేవో హామీలిచ్చి భూములు తీసుకుంటోంది. రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి వేరే పార్టీ ప్రభుత్వం వచ్చినా, లేక యిదే పార్టీ ప్రభుత్వం కొనసాగి వేరే నాయకుడు వచ్చినా, యీయనే కొనసాగినా 'ఈ ఆస్తులకు అనుకున్నంత డిమాండు రాలేదు, మీకు యిస్తామని చెప్పినదంతా యిస్తే కిట్టుబాటు కాదు, దానిలో సగమే యిస్తాం అని మిగతాది ఎగ్గొడితే భావ్యంగా వుంటుందా? కమిట్మెంట్ అంటే కమిట్మెంటే, దానికి కట్టుబడి వుండాలి. ఇండియా పాకిస్తాన్‌కు ఎంత యివ్వాలో అంత యివ్వాలి, ఎంత రావాలో అంత పుచ్చుకోవాలి. ఆ డబ్బు పాకిస్తాన్ కశ్మీర్లో యుద్ధానికి ఖర్చు పెడుతుంది అనే అంశానికి, దీనికీ లింకేమిటి? అది యిచ్చే ముందే యుద్ధం ప్రారంభమైంది. ఇచ్చాకా కొనసాగింది. ఈ 55 కోట్లు లేకపోతే అది యుద్ధం చేయలేదా? యుద్ధకాంక్ష వుండాలే కానీ, ఆహారధాన్యాల సరఫరా ఆపేసైనా యుద్ధం చేస్తారు. అప్పటి లెక్కల్లోనైనా యుద్ధానికి వందల కోట్లు అయి వుంటాయి. 55 కోట్లు తొక్కిపెట్టినంత మాత్రంతో యుద్ధం ఆగివుండదు.
సరే, మన ప్రభుత్వం విశ్వసనీయత చూపుకోవడానికి యిద్దాం, కానీ అప్పుడే ఎందుకు, విద్వేషాలు చల్లారాక అప్పుడు యిద్దాం అని కూడా అనవచ్చు. ఆ లెక్కన చూస్తే యిప్పటికీ విద్వేషాలు చల్లారలేదు. మరి అప్పుడేం చేయాలి? ఛ, యిచ్చేయండి అని వేరే ఎవరితోనైనా మొట్టికాయలు వేయించుకుని అప్పుడు యివ్వాలా? ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ పేచీలు చూస్తున్నాం. తెలంగాణ నీళ్లు బిగబడుతోంది, ఆంధ్ర విద్యుత్ బిగబడుతోంది. ఏ రాష్ట్రంలో వున్నవాళ్లు ఆ రాష్ట్ర చర్యల్ని సమర్థించాలా? విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండి, తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నీటి సరఫరా లేక పంటలు ఎండి, ఆంధ్ర రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కెసియార్ స్వయంగా అడిగితే విద్యుత్ యిస్తానని బాబు, అడగాల్సిన ఖర్మ నాకేమిటి? అది నాకు వద్దే వద్దు, యింకో మూడేళ్లపాటు నా రాష్ట్రప్రజలు అష్టకష్టాలు పడినా నేను మాత్రం అడగను అని కెసియార్. రెండు రాష్ట్రాల పోలీసులు బాహాబాహీ కలబడ్డారు. హెడ్‌క్వార్టర్సు హైదరాబాదులో వున్నాయి కాబట్టి ఆంధ్రకు నిధులు బదిలీ కాకుండా తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు యిచ్చింది. అదేమంటే, ఆంధ్ర కేంద్రానికి వెళ్లి మాపై పితూరీలు చెప్పి మాకు ఏమీ రాకుండా చేస్తోంది అంటోంది. తెలంగాణలో వున్న ప్రజలందరూ దీన్ని సమర్థించి తీరాల్సిందేనా? ఇరు రాష్ట్రాలకు ఒకడే గవర్నరు. ఆయన ఏమీ తేల్చడు. కొట్టుకోండి, వేడుక చూస్తా అంటాడు. ఇద్దరూ కలిసి కేంద్రం వద్దకు వెళతారు. కేంద్రం కమిటీ వేశానంటుంది. కమిటీ మాట యిద్దరూ వినరు. కావలసిన ఫైళ్లు యివ్వరు, సిబ్బంది యివ్వరు, వేర్వేరు గణాంకాలు యిస్తారు. ఎందుకొచ్చిన గొడవండి, విద్యుత్ పిపిఏలు రద్దు చేయకండి అని ఆంధ్రలో ఎవరైనా నాయకుడు అంటే అతడు ఆంధ్రద్రోహి అయిపోతాడు. హెడ్‌క్వార్టర్సు యిక్కడ వున్నంత మాత్రాన 23 జిల్లాల కష్టార్జితంతో కట్టిన ఉమ్మడి సౌకర్యాలన్నీ తెలంగాణవే అనడం అన్యాయం, ఆంధ్ర వాటావి ఆంధ్రకు యిచ్చేద్దాం అంటే అతడు తెలంగాణద్రోహి అయిపోతాడు.
న్యాయం చెప్పవలసినది కేంద్రం. మళ్లీ అక్కడ ఆంధ్ర లేదా తెలంగాణ అధికారో, మంత్రో వుంటే పక్షపాతం చూపించారంటూ మళ్లీ హాహాకారాలు చేస్తారు. మరో రాష్ట్రంవాడు వచ్చి తీర్పు చెపితే, ఏవేవో రాజకీయప్రయోజనాలు, భవిష్యత్తు అవసరాలు అంటూ వుహాగానాలు చేస్తారు. ఇవన్నీ పడుతూనే వాళ్లు తీర్పు చెప్పాలి. ఒకే భాష మాట్లాడే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య పేచీకి కేంద్రం మధ్యస్తం చేస్తేనే యిన్ని చిక్కులు వస్తే దేశాల మధ్య వివాదం అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లినపుడు యింకెంత రిస్కు వుందో ఆలోచించండి. అంతర్జాతీయ వేదిక మీద ఎప్పుడూ న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏముంది? అగ్రదేశాలు వాటిని ఆడిస్తున్నాయని ఎన్నోసార్లు రుజువైంది. అసలు కశ్మీరు సమస్య యింత జటిలం ఎందుకైంది?
పాక్ దాడి చేసిన థలో నెహ్రూ ఘోరమైన తప్పిదం చేశాడు. కశ్మీరు సమస్యను యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు నివేదించి వాళ్ల సైన్యాలను పంపమన్నాడు. ఇది కృష్ణ మేనన్ సలహా అంటారు. మహారాజా హరిసింగ్‌తో ఒప్పందం జరిగాక సరైన చర్యలు తీసుకుని పాకిస్తాన్‌ను నిలవరించిన పటేల్‌కు యిది సుతరామూ యిష్టం లేదు. పటేల్‌తో ఈ విషయంలో విభేదించిన నెహ్రూ ఆయన మంత్రిత్వంలోని స్టేట్స్ డిపార్టుమెంటు నుండి కశ్మీరు వ్యవహారాలను తప్పించడం, భారత ప్రతినిథిగా గోపాలస్వామి అయ్యంగార్ను ఐక్యరాజ్యసమితికి పంపడం – ఇదంతా పటేల్, నెహ్రూల మధ్య అగాధాలు సృష్టించింది. ఒకసారి సమస్య తన చేతికి రాగానే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్' (యుఎన్‌సిఐపి) ఏర్పాటు చేసి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ 1948 ఏప్రిల్‌లో ఒక తీర్మానం పాస్ చేసింది. దాని ప్రకారం ఇరుపక్షాలు వెంటనే యుద్ధం ఆపేయాలి. పాకిస్తాన్ ఆ గిరిజనులను వెనక్కి రప్పించాలి. భారత్ తన సైన్యదళాల సంఖ్యను గణనీయంగా తగ్గించి కశ్మీరు ప్రజల మనోభావాలను తెలుసుకోవడానికి ప్లెబిసైటు నిర్వహించాలి. ఇది పాస్ చేసిన 7 నెలలకు ఇండియా ప్లెబిసైటు నిర్వహిస్తాం కానీ పాకిస్తాను ఆక్రమిత కశ్మీరును ఖాళీ చేసి వెళ్లాకనే చేస్తాం అంది. మేం వెళ్లిపోతే వాళ్లు ఓటర్లను సైన్యబలంతో భయపెడతారు. అందువలన మా ఉపసంహరణ, వాళ్ల ప్లెబిసైట్ రెండూ ఏకకాలంలో జరగాలి అని పాక్ మొండిపట్టు పట్టింది. ఏది ముందు, ఏది వెనుక అన్నదానిపై ఎప్పటికీ తేలలేదు. యునైటెడ్ నేషన్స్ చెప్పిన హితవును యిద్దరూ పట్టించుకోలేదు. ఇప్పటికీ పాక్ ఆక్రమిత కశ్మీరు వదలలేదు, ఇండియా ప్రజాభిప్రాయ సేకరణ చేయించే ధైర్యం చేయటం లేదు. దానికి బదులు షేక్ అబ్దుల్లా కుటుంబానికి, అనుచరులకు కశ్మీరును అప్పగించేసి, వేలాది కోట్ల రూపాయలు గుమ్మరించి, సైన్యాన్ని మోహరించి తన అదుపులో వుంచుకోవాలని చూస్తూ వచ్చింది. కశ్మీరులో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగిన సందర్భాలు ఒక చేతి వేళ్లపై లెక్కించవచ్చు. దీనివలన అంతర్జాతీయంగా ఇండియా ప్రతిష్ట దెబ్బ తింది. అనేక దేశాలు కశ్మీరును ఇండియాలో అంతర్భాగంగా చూపవు, వివాదాస్పద ప్రాంతంగానే చూపుతాయి.
జునాగఢ్ నవాబు ఇండియన్ యూనియన్‌లో చేరనంటే రిఫరెండం జరిపించి, ప్రజాభిప్రాయం చూపించి జునాగఢ్ కలిపేసుకున్నారు కదా, కశ్మీరులో అలాటి రిఫరెండం జరిపించలేదేం? అని అడిగితే మన వద్ద సమాధానం లేదు. కశ్మీరు ప్రజలు ఇండియాలో కలుద్దామనుకుంటున్నారా, పాకిస్తాన్లో కలుద్దామనుకుంటున్నారా, నేపాల్‌లా విడిగా వుందామనుకుంటున్నారా అన్న సంగతిని ప్లెబిసైటు జరిపించి, లోకానికి వెల్లడించాలనే వాదనతో ప్లెబిసైట్ ఫ్రంట్ అనే పార్టీ కశ్మీరులో చాలాకాలం నడిచింది. హైదరాబాదు విషయంలో విడిగా వుంటానన్న రాజు మాట కాదు, భారత్‌లో కలుద్దామనే ప్రజావాక్కే ప్రధానం అన్న భారతప్రభుత్వం కశ్మీరు విషయంలో దానికి విరుద్ధంగా చేసింది. విడిగా వుంటానంటూ మొండికేసి, పాకిస్తాన్ దాడి చేయగానే ఇండియాలో కలుస్తానని రాజు, కాదు విడిగా వుందాం అని ప్రజలు అంటే రాజు మాటకు విలువిచ్చి కశ్మీరును కలుపుకుంది. భారతీయులుగా మనకు యివేమీ తప్పుగా తోచవు. స్వతంత్రరాజ్యంగా వున్న సిక్కింపై దాడి చేసి కలిపేసుకున్నా, తప్పేముంది అనుకుంటాం. కానీ అంతర్జాతీయ పరిశీలకులకు యిలా చూడరు. వారికి మన విధానాల్లో లోపాలు కనబడతాయి. (సశేషం) –
ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)