అట్లాంటాలో నివసించే రాయలసీమ ప్రాంతపు వారు మొదటిసారిగా నిర్వహించిన రాయలసీమ పిక్నిక్ గత ఆదివారం (ఏప్రిల్ 13, 2014న) బ్యూఫోర్డు బోగాన్ పార్కులోవిజయవంతంగా జరిగింది. ఈ పిక్నిక్కి సుమారు 300 మందికి పైగా రాయల సీమ ప్రాంతానికి చెందిన వారు హాజరయ్యారు. ఉదయం 10 గం. లకు వినాయక పూజతో కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. నిర్వాహకులు రాయలసీమ అల్పాహారం ‘ఉగ్గాని’ తో ఆహ్వానితులకు స్వాగతం పలికారు. విచ్చేసిన ఆహ్వానితులు సభికుల కరతాళధ్వనుల మధ్య స్వీయ పరిచయం చేసుకున్నారు. అన్నిరకాల రాయల సీమ సహజ వంటలను అక్కడికక్కడే వండి సరఫరా చెయ్యడం ఈ పిక్నిక్ ప్రత్యేకత. ఒక పక్క చక్కటి వంటకాల తయారిలో కొంతమంది సభ్యులు నిమగ్నమవ్వగా, మరో పక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ నిర్వహించిన ఆట పాటలలో మహిళలు, పిల్లలు, పురుషులు అందరూ పాల్గొనడం జరిగింది. స్పూనులో పెట్టిన నిమ్మకాయ పడిపోకుండా నడిచే ఆట పిల్లలనే కాకుండా పెద్దలని కూడా సంబర పెట్టింది. కేవలం 7వ తరగతి చదువుతున్న సంజన రెడ్డి చిన్ని చిన్ని పిల్లలకు పెయింటింగ్ వర్క్షాప్ నిర్వహించి చక్కని బొమ్మలు గీయించింది. అమెరికాలో పిల్లలు ఎప్పుడూ సోఫాలో కూర్చొని వీడియో గేములతో కాలం గడపడం సహజం. కానీ పిల్లలు ఆట స్థలంలో రకరకాల ఆటలు ఆడుకొని సేదదీరడం మళ్ళీ రాయలసీమలో గడిపిన బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది. రాగి సంగటి, మటన్‌కూర, కోడి పులుసు, పరమాన్నము, ఎర్రకారం దోశలు, ఉడకబెట్టిన శనక్కాయలు, మెంతుల పప్పు, సాంబారు, శెనక్కాయ పచ్చడి, వంకాయ కూర, రవ్వ లడ్డ్లు, పుచ్చకాయలు, మొక్క జొన్నలు, ఇంకా రకరకాల ఘుమ ఘుమ లాడే వంటకాలను అక్కడే వండి ఆరగించడం జరిగింది. వంటకాలను అరటి ఆకులలో షడ్రసోపేత భోజనం, సరదా కబుర్లు అందరికీ ముఖ్యంగా రాయలసీమను గుర్తుకు వచ్చేలా చేసింది.
గోపీనాథ్ రెడ్డి గారు రాయల విందు కార్యక్రమం గురించి వివరిస్తూ గతంలో డల్లాస్ నగరంలో ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్యహింప బడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం రాయలసీమ వాసులని ఒక గూటికిందకు తేవడానికేనని వివరించారు. ఈ సంస్థ భారతదేశం నుండి వచ్చే తల్లితండ్రులకు సహాయ సహకారాలు అందించడానికి, చిన్న పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలపడానికి మొదలు పెట్టామని, రాజకీయాలకు మరియు వ్యాపార ప్రయోజనాలకు అతీతమని వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా అట్లాంటాలో స్థిరపడ్డ బలరాంరెడ్డి గారు ఇంతమంది రాలాయసీమ వాసులను అట్లాంటాలో కలవడం ఇదే మొదటిసారి అని, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. దామోదర్ రెడ్డి గారు తనదైన శైలిలో రాయలసీమ మాండలికంలో సరదా మాటలతో అందరిని నవ్వించారు. ఆడ వారికి మగ వారికి జరిగిన సామెతలతో డమ్ చారేట్ ఆట సరదాగా సాగింది. పెద్దలతో పాటూ పిల్లలూ చక్కగా అన్ని ఆటలలో పాల్గొని సరదాగా సాయంత్రాన్ని గడిపారు. వాలీబాల్, క్రికెట్ ఆటలు చాలా సరదాగా జరిగాయి. రాయలసీమకి చెందిన వాళ్ళంతా ఒక చోట చేరి ఆదివారం సాయంత్రాన్ని సరదాగా గడపడం అందరినీ ఆనందపరిచింది. పవన్ టంగుటూరి గారు ప్రతి సందర్భాన్ని ఎంతో చక్కగా తన కెమెరా లో బంధించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరి కృషి వుంది. ఇలాంటి కార్యక్రమాలను రాబోయే రోజుల్లో మరిన్ని చేయాలని అందరూ తలంచారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడానికి కృషి చేసిన గోపినాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, బాలాజీ రెడ్డి, రమేశ్ మేడ, , వెంకట్ రామిరెడ్డి, నరసింహా రెడ్డి, చైతన్య రెడ్డి, డా. ప్రసాద్ రెడ్డి, పవన్ టంగుటూరి, శోభన్ రెడ్డి, గురు పరందామి, కిరణ్ రామిరెడ్డి, శరత్ రామిరెడ్డి, రమేశ్ దువ్వూరి, శ్రీనివాసులు రెడ్డి కొట్లూరు గార్లకు మరియు ఈ కార్యక్రమానికి విరాళాలు అందించిన డా. శ్రీనివాస్ రెడ్డి, శివా మట్టిపల్లి, రాజు (Maiinc), వెంకట్రామిరెడ్డి చింతం, గురవా రెడ్డి గార్లకు అట్లాంటా ఏరియా రాయలసీమ అసోసియేషన్‌వారి తరుపున ప్రత్యేక ధన్యవాదములు. వంటకాల తయారీలో సహాయం చేసిన శ్రీమతి రుక్మిణీదేవి వేమిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ వనభోజనాల కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ అట్లాంటా ఏరియా రాయలసీమ అసోసియేషన్‌వారి తరుపున పేరు పేరునా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇలాంటి వనభోజనాలను ప్రతి సంవత్సరం చేయాలని అట్లాంటా ఏరియా రాయలసీమ అసోసియేషన్‌వారు నిర్ణయించారు. అట్లాంటా ఏరియాలో వున్న ప్రతి రాయల సీమ వాసి కూడా ముందు ముందు జరుగబోయే రాయలసీమ అసోసియేషన్‌వారి నిర్వహించే మరిన్నికార్యక్రమాలలో పాల్గొనాలని అట్లాంటా ఏరియా రాయలసీమ అసోసియేషన్ వారి విజ్ఞప్తి.
ఫోటోల కోసం క్లిక్ చెయ్యండి: http://tanguturu.smugmug.com/RoyalaVindu2014