ఎన్‌డిఏకు కనీసం 272 సీట్లు రావాలంటే బిజెపికు 225 సీట్లకు మించి రావాలి. బిజెపి బలమంతా ఉత్తరభారతం, పశ్చిమభారతంలో కనబడుతోంది. తూర్పున పెద్దగా ఆశలు లేవు. ఇక దక్షిణాదిన వున్న 129 సీట్లలో నాలుగోవంతైనా తెచ్చుకోవాలి. తెచ్చుకోగలదా? 1998లో దానికి 20 సీట్లు వచ్చాయి. 1999లో 18 వచ్చాయి. అప్పుడు వాజపేయికి అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి కాబట్టి అది సాధ్యపడిందని గుర్తు పెట్టుకోవాలి. 2004 వచ్చేసరికి కర్ణాటకలో 18 గెలుచుకుంది కానీ తక్కిన మూడు రాష్ట్రాలలో సున్నా. ఐదేళ్లు గడిచేసరికి 19 వచ్చాయి. కర్ణాటకలోనే! తక్కిన చోట్ల ఎప్పట్లా సున్నా! ఓట్లశాతం చూడబోతే కర్ణాటకలో 1998 నుండి 2009 మధ్య 14.6% పెరిగింది. (27% నుండి 41.6%) కేరళలో 0.7% తగ్గింది. (8% నుండి 7.3%), తమిళనాడులో 4.6% తగ్గింది (6.8% నుండి 2.3%), మన రాష్ట్రంలో అయితే 14.5% తగ్గింది. (18.3% నుండి 3.8%). అంటే కర్ణాటకలో తప్ప వేరెక్కడా పరిస్థితి బాగా లేదు. కర్ణాటకలో కూడా 2009 నుండి పరిస్థితి దిగజారింది. 2013 అసెంబ్లీ ఎన్నికలలో 224 ఎసెంబ్లీ సీట్లలో 18% సీట్లు అంటే 40 తెచ్చుకుని ప్రతిపక్షంలో కూర్చుంది. మోదీ ప్రచారం చేసినా పని చేయలేదు. ఎడ్యూరప్ప పెట్టిన పార్టీ ఓట్లు చీల్చింది కాబట్టి యిలా జరిగిందనుకుంటూ వాళ్లని తమ పార్టీలో చేర్చుకున్నారీసారి. తమిళనాడు, కేరళలలో ఒక్క అసెంబ్లీ సీటూ గెలవలేదు.
మన రాష్ట్రంలో 2009 ఎన్నికలలో 2, ఉపయెన్నికలలో మరో 2 వెరశి 4 గెలుచుకున్నారు. తెలంగాణకు పాటుపడ్డాం కాబట్టి తెలంగాణలో బలం పుంజుకున్నాం అని ఆశపడి 47 ఎసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటు సీట్లలో నిలబడుతున్నారు. టిడిపితో పొత్తు ఏ మేరకు లాభిస్తుందో, వీటిలో నాలుగో వంతైనా గెలుస్తారో లేదో తెలియదు. కర్ణాటకలో మళ్లీ బలం పుంజుకుంటే అక్కడో 20, ఇక్కడ 2/3 గెలుచుకున్నా మొత్తం 25 లోపే. తమిళనాడు నుండి 1999లోలా 4 సీట్లు గెలవాలంటే డిఎంకె, ఎడిఎంకెల వంటి బలమైన పార్టీలతో పొత్తు కుదరాలి. కానీ కుదరలేదు. అందువలన వారిద్దరితో పడని పార్టీలన్నిటినీ చేరదీసి ఒక కూటమి ఏర్పరచారు. దాని ప్రకారం డిఎండికె (విజయకాంత్ పార్టీ) 14, బిజెపి, పిఎంకె (డాక్టర్ రామదాసు పార్టీ) చెరో 8, ఎండిఎంకె (వైకో పార్టీ) 7 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఐజెకె, కెఎన్‌ఎమ్‌కె అనే మరో రెండు పార్టీలకు చెరో ఒక స్థానం కేటాయించారు. పొత్తులోని యితర భాగస్వాములకు వున్న పాప్యులారిటీతో పోలిస్తే స్థానిక బిజెపి నాయకుల పాప్యులారిటీ సోదిలోకి కూడా రాదు. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి ప్రధానిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న పట్టుదలతో వున్న జయలలిత దగ్గరకు రానివ్వకపోవడం వలన యీ నాయకులందరూ బిజెపితో పొత్తు పెట్టుకున్నారు.
తమిళనాడులో మైనారిటీలు గణనీయంగా వున్నారు. పైగా వాజపేయి కున్న ఉదారవాది యిమేజి మోదీకి లేదు. పొత్తు ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.
ఇక కేరళలో కూడా మైనారిటీలు ఫలితాలను నిర్ణయించగలరు. అందువలన మోదీ బిసి కార్డు బయటకు తీశారు. కేరళలో బిసిలలో బలమైన ఓటు బ్యాంకుగా వున్న ఈళవాలను ఆకట్టుకోవడానికి వారు ఆరాధించే శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ట్రస్టు వారి ఫంక్షన్‌కు వెళ్లి 'నేనూ బిసినే' అని చెప్పుకున్నాడు. అటువంటి కులానికే చెందిన మాతా అమృతానందమయి ఆశ్రమానికి వెళ్లి ఆమె భక్తురాలినని చెప్పుకున్నాడు. రాష్ట్రంలోని అతి పెద్ద దళిత సంఘమైన కేరళ పులయ మహాసభ సమావేశానికి వెళ్లి 'నాదీ తక్కువ కులమే, మా పార్టీ మీ రాష్ట్రంలో అంటరానిదే..' అంటూ పోలికలు చెప్పాడు. ఇవన్నీ కనీసం ఒక్క సీటైనా అక్కడ గెలిచిపెడతాయో లేదో వచ్చే నెలలో తేలిపోతుంది. ఏది ఏమైనా మోదీ ఇంగ్లీషులో వక్త కాకపోవడం దక్షిణాదిన పెద్ద మైనస్ పాయింటుగానే చెప్పాలి.
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2014)