ఒడిశాలో మనలాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 147 అసెంబ్లీ సీట్లు. 21 లోకసభ సీట్లు. బిజూ జనతాదళ్ పార్టీ నాయకుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయమనిపిస్తోంది. అతనితో తలపడే నాయకుడు ఎవరూ ప్రత్యర్థి వర్గాలలో కనబడటం లేదు. 11 ఏళ్లపాటు బిజెపితో సఖ్యం చేసిన నవీన్ 2009 ఎన్నికలకు ముందు వారితో తెగతెంపులు చేసుకుని సిపిఐ, సిపిఎం, ఎన్‌సిపిలతో సీట్ల సర్దుబాటు చేసుకున్నాడు. ఈ సారి ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరి పోరాటమే. 36 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు, 6గురు సిటింగ్ ఎంపీలకు టిక్కెట్లు యివ్వకపోవడంతో వారు అసంతృప్తిగా వున్నారు కానీ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడే సాహసం చేయలేదు – అంజలీ బెహరా తప్ప! ఆమె ప్యారీ మోహన్ మహాపాత్రకు సహచరురాలు. ప్యారీమోహన్ బ్యూరోక్రాట్‌గా వుంటూ రాజకీయాల్లోకి వచ్చారు. నవీన్ చంద్రగుప్తుడైతే ఆయన చాణక్యుడనేవారు. 2012లో తనపై కుట్ర చేశాడంటూ నవీన్ అతన్ని బయటకు పంపించాడు. ప్యారీమోహన్ ఒడిశా జన మోర్చా అనే పార్టీ పెట్టి అభ్యర్థులను నిలబెడుతున్నాడు. 2009లో కోస్తా ప్రాంతంలోని 77 సీట్లలో బిజెడి 69 గెలుచుకుంది. అతనీ సారి కోస్తా ప్రాంతంలో కొన్ని ఓట్లు చీల్చి బిజెడికి నష్టం కలిగిస్తాడని అంచనా. 2009లో 54 స్థానాల్లో బిజెడి స్వల్ప మెజారిటీతో గెలుచుకుందని మర్చిపోకూడదు. ఈ సారి 45 అసెంబ్లీ స్థానాలలో బిజెడికి తిరుగుబాటుదారుల బెడద వుంది.
నవీన్ ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు వున్నాయి. మైనింగ్ స్కామ్‌లో 60 వేల కోట్ల రూ.ల గోల్‌మాల్ జరిగిందని షా కమిషన్ అంది. కోట్లాది రూపాయల చిట్‌ఫండ్ కుంభకోణంలో అధికారపార్టీ సభ్యుల హస్తం వుంది. అయితే వీటి గురించి ప్రజలకు చెప్పి నవీన్‌ను నియంత్రించగల సామర్థ్యం వున్న ప్రతిపక్షాలు కనబడటం లేదు. కాంగ్రెసు పార్టీ ఢిల్లీ పెద్దలు మన రాష్ట్రంలో చేసినట్లే అనవసరంగా పెత్తనం చేసి స్థానిక నాయకత్వాన్ని నాశనం చేశారు. దాంతో ప్రతిపక్షనాయకుడైన భూపేందర్ సింగ్ కాంగ్రెసు పార్టీ వదలి నవీన్‌కు విధేయుడుగా మారిపోయాడు. గతంలో తమతో స్నేహం చేసి, తర్వాత తృణీకరించి నెగ్గుకుని వచ్చిన నవీన్‌పై బిజెపి పగబట్టి వుంది. ఇప్పుడు మోదీ తరంగం భారత్‌ను ముంచెత్తుతోందన్న ఆశతో వున్నారు కాబట్టి చిన్నా చితకా పార్టీలను పోగేసి తమిళనాడులోలా యిక్కడా ఒక కూటమి ఏర్పరచాలని చూసింది. కానీ బండి ముందుకు సాగలేదు. సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి కానీ వాటికి బలం లేదు. ఇన్నేళ్లగా అధికారంలో వున్న బిజెడిపై యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ ఫీలింగ్స్ వుంటాయి. అయితే యిన్ని పార్టీలు రంగంలో వుండడం చేత ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీల్చి, అంతిమంగా నవీన్‌కే ఉపయోగపడవచ్చు.
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2014)