అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
ఉద్యోగం రాకపోతే ఎల్‌ఐసి బిల్డింగు నుండి దూకుతావా?
ఎమ్‌ఎస్‌సి పూర్తయ్యాక ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నాను. హిందూస్థాన్ లీవర్ వాళ్లు మద్రాసుకి రావాలని పిలిచారు. పొద్దున్న ఓ రెండువందల మందికి పరీక్ష పెట్టారు. వారిలో ఏడెనిమిదిమందిని సెలక్టు చేసి మధ్యాహ్నం యింటర్వ్యూకి రమ్మన్నారు. ఎల్‌ఐసి బిల్డింగులో పదో అంతస్తులో జరిగింది. నాకు ఉద్యోగానుభవం ఏమీ లేదు. వాళ్లు నాకు ఉద్యోగం యివ్వలేదు. దానిలో వింతేమీ లేదు. అయితే మరీ చిన్నగా కుఱ్ఱవాడిలా, లేతగా, సెన్సిటివ్‌గా కనబడ్డానో ఏమో ఉద్యోగం రాలేదంటే ఏ అఘాయిత్యం చేస్తానో అని భయపడినట్టున్నారు.
ఒకాయన ''అవును, ఒకవేళ.. అహ ఒకవేళ.. యీ ఉద్యోగం నీకు రాలేదనుకో, యీ ఎల్‌ఐసి బిల్డింగు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటావా?'' అని అడిగాడు.
అలాటి ప్రశ్న ఎవరైనా అడుగుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఉద్యోగం రాకపోతే కొంపలు మునిగిపోతాయా?
నిజానికి అది నాకు రెండో యింటర్వ్యూ. మొదటిది ఎయిర్ ఇండియాకు అప్లయి చేస్తే వాళ్లు మద్రాసులో పరీక్ష రాయడానికి పిలిచారు. రానూపోనూ సెకండ్ క్లాసు రైల్వే టిక్కెట్టు చార్జీలు యిచ్చారు. ఆ రోజుల్లో యింకోళ్లెవరో మన టిక్కెట్టు డబ్బులు పెట్టుకోవడం గొప్ప థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఉద్యోగం వచ్చేసినంత ఫీలింగు వచ్చేసి ఒళ్లు తెలియలేదు.
అక్కడ పొద్దున్న ఒక వందమందికి పరీక్ష పెట్టారు. పరీక్షలో ఎంతమందిని సెలక్టు చేస్తారో, తర్వాతి స్టెప్ ఏమిటో ఏమీ చెప్పలేదు. పరీక్ష రాయమన్నారంతే. రాశాం. మధ్యాహ్నం రిజల్ట్‌స్ అన్నారు.
భోజనం చేసి వెళ్లాక నువ్వు పాసయ్యావన్నారు. వందమందిలో 9 మందిని మాత్రం పాస్ చేశారు. పాసయిన వాళ్లందరికీ రేపు బొంబాయిలో యింటర్వ్యూ. ఇవాళే బొంబాయికి విమానంలో తీసుకెళతాం అన్నారు. ఆ 9 మందిలో నేనూ వున్నాను. అప్పటిదాకా ఎప్పుడూ విమానం ఎక్కలేదు. అవేళ ఆ భాగ్యం దక్కింది. హోటల్‌లో బస. నేను ఆకాశంలో విహరించేశాను. ఉద్యోగం జేబులో వున్నట్టు అనుభూతి కలిగింది. దీనిలో వుద్యోగం వస్తే యిక జీవితమంతా విమానాల్లో తిరగవచ్చు కదా అనుకున్నాను. ఇంటర్వ్యూ జరిగింది. ఫలితం వచ్చింది. ఉసూరుమన్నాను.
అంతలో యీ పిలుపు వచ్చింది. వీళ్లు విమానం ఎక్కించినూ లేదు, బొంబాయి తీసుకెళ్లనూ లేదు. ఏదో ఊరించి కిందకు పడదోస్తున్నట్లు ఎందుకనుకున్నారో ఏమో! ఆ అపజయానికే చలించలేదు. దీనికి చలిస్తానా? అందుకే వెంటనే చెప్పా –
''ఈ ఉద్యోగమే కాదు, ఏ ఉద్యోగం రాకపోయినా నేను 'ఛస్తే' అలాటి పని చేయను. నాకు యివ్వాలో లేదో తేల్చుకోవలసినది మీరు. ఇస్తానంటే చేరాలో లేదో చూసుకోవలసినది నేను. ఇవ్వనంటారా, నో ప్రాబ్లెమ్. మీరు నా గురించి వర్రీ అవకండి.'' అని.
వాళ్లు అలా ఎందుకు అడిగారో అప్పటికి తెలియలేదు. ఇప్పుడు ఆలోచిస్తే అలా ఆత్మహత్యలు చేసుకున్న కుర్రవాళ్లు వాళ్లకు తగిలారేమో!
ఇది 1967 నాటి సంగతి. ఈ కాలంలో అయితే అలాటి కారణాలకే కాదు, యింకా అంతకంటె చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకునేవారు కోకొల్లలుగా కనబడుతున్నారు.
xxxxxx
ఫెయిల్యూర్‌ను తట్టుకోలేకపోవడం కంటె పెద్ద ఫెయిల్యూర్ లేదు, జీవితంలో! అపజయం జయానికి మెట్టు అనే లోకోక్తి వలన మొదటి థలో మాత్రమే అపజయం వస్తుందని, ఆ తర్వాత విజయపరంపరే అనీ కొందరనుకుంటారు. సక్సెస్ వచ్చాక కూడా ఫెయిల్యూర్ రావచ్చు.
నేను మద్రాసులో సినిమాల్లో బాలనటుడిగా పేరు తెచ్చుకున్న రోజుల్లోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయింది. హై కోర్టు మద్రాసు నుండి గుంటూరుకి మారడంతో నాన్నగారు గుంటూరుకి కాపురం మార్చారు. నేను గుంటూరులో మాజేటి గురవయ్య హై స్కూలులో చేరాను. అక్కడ వుండగా కాలేజీలో ఏదో ఫంక్షన్ జరిగింది. సినిమా యాక్టరుగా నాకు కాస్త గ్లామర్ వుండేది కాబట్టి కాలేజీ ఫంక్షన్‌కి పిలిచి నన్ను ఏకపాత్రాభినయం వేయమన్నారు. ''హేమ్లెట్''లో 'టు బి ఆర్ నాట్ టు బి' ఘట్టం.
ఎన్నో సినిమాల్లో నదురు, బెదురు లేకుండా నటించిన అనుభవం నాకుంది. అంతకుముందు బాలానందంలో సభ్యుణ్ని కాబట్టి అనేక స్టేజి నాటకాల్లో వేరే వూళ్లు కూడా వెళ్లి నటించాను. అందువలన స్టేజి ఫియర్ అనేది లెక్కప్రకారం వుండకూడదు.
కానీ ఆ రోజు ఏమైందో తెలియదు. వేదిక ఎక్కేసరికి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. పోర్షన్ మర్చిపోయి చెప్పాల్సిన డైలాగు నోట పెగలలేదు. యాక్షనూ లేదు. శిలావిగ్రహంలా నిలబడిపోయాను. చిన్నపిల్లవాణ్ని కాబట్టి గోల చేయకుండా నవ్వేసి దింపేశారు. అవేళ ఎందుకలా జరిగిందో తెలియదు. ఆ తర్వాత కాలేజీలో చదివే రోజుల్లో ''సాజ్ ఔర్ ఆవాజ్'' పేరుతో అనేక స్టేజి షోలు యిచ్చాను. ప్రపంచంలో అనేక వేదికలపై అనర్గళంగా ఉపన్యసించాను.
xxxxxx
సరిగ్గా ఆలోచిస్తే – అపజయాల నుండి, అవమానాల నుండి చాలా పాఠాలు నేర్చుకుంటాం, మనల్ని మనం సరిదిద్దుకుంటాం. నేను మద్రాసులో కిండర్ గార్టన్ స్కూలుకి వెళ్లాను కానీ అక్కడ మాకు తెలుగు మీడియమే. మద్రాసు నుండి గుంటూరు వచ్చాక మాజేటి గురవయ్య స్కూలులో కూడా తెలుగు మీడియమే. ఇంగ్లీషు ఒక సబ్జక్ట్‌గా మాత్రమే వుండేది. ఎవరితోను ఇంగ్లీషులో మాట్లాడే అవసరంకాని, అవకాశంకాని వుండేది కాదు.
మా నాన్నగారు గుంటూరులో లాయరుగా వుండేటప్పుడు అక్కడ కలక్టరుగా పని చేస్తున్న భగవాన్‌దాస్ గారితో కుటుంబస్నేహం వుండేది. తర్వాతి రోజుల్లో నేను సర్వీసులో జాయినయినప్పుడు భగవాన్‌దాస్ గారు చీఫ్ సెక్రటరీగా వున్నారు. భగవాన్‌దాస్ గారి అమ్మాయిల్లో ఒకమ్మాయి పుట్టినరోజు ఫంక్షన్‌కు నన్ను కూడా పిలిచారు. నేను నాకు వచ్చిన ఇంగ్లీషులో ఆ పిల్లతో మాట్లాడేశాను. ఆ పిల్ల దడుసుకుంది లాగుంది.
తన తండ్రి దగ్గరకు వెళ్లి నన్ను చూపించి – 'వై యీజ్ హీ స్పీకింగ్ బ్రోకెన్ ఇంగ్లీష్..' అంది.
ఆ పిల్ల బాధ నాకు అర్థం కాలేదు. వాళ్లింట్లో ఏ వస్తువూ పగలకొట్టకపోయినా ఏదో బ్రేక్ చేశానని ఫిర్యాదు చేస్తోందేమిట్రాని. ఇంటికి వెళ్లి మా అమ్మతో నా నిర్దోషిత్వాన్ని గురించి చెప్పుకున్నాను.
మా అమ్మా, నాన్నా నుదురు కొట్టుకున్నారు. 'వీడికి ప్రైవేటు పెట్టించైనా కాస్త ఇంగ్లీషు నేర్పించకపోతే లాభం లేదు' అని మా అమ్మ మా నాన్నగారికి గట్టిగా 'ప్రెయివేటు' చెప్పేసింది.
''సరే, సరే, ఎలాగూ హై కోర్టు హైదరాబాదుకి మారుతోందిగా. అక్కడకు కాపురం మార్చినపుడు అక్కడ ట్యూషన్ పెట్టిద్దాంలే'' అన్నారు నాన్న.
నా ఇంగ్లీషు గురించి వ్యాఖ్యానించిన ఆ పిల్ల ఆ విషయం మర్చిపోయి వుండవచ్చు కానీ, నేను మర్చిపోలేదు. పట్టుదలగా ఇంగ్లీషు నేర్చుకున్నాను. ఇంగ్లీషే కాదు, యితర భాషలు కూడా. హైదరాబాద్‌లో నిజాం కాలేజీలో పి.యు.సి. (ఇంటర్మీడియెట్) చదివేటప్పుడు ఆప్షనల్ లాంగ్వేజిగా సంస్కృతం తీసుకున్నాను. భగవద్గీతలో మూడు అధ్యాయాలు డైరక్టుగా… అంటే వ్యాకరణం అదీ చెప్పకుండా… నేర్పించారు. ఆ భాషపై నాకు చాలా గౌరవం, ప్రేమ. అలాగే ఎమ్‌ఎస్‌సి చదివే రోజుల్లో ఫ్రెంచ్ నేర్చుకున్నాను. ఫ్రాన్సు ప్రభుత్వం వారు హైదరాబాదులో ఎలయాన్స్ ఫ్రాంసేజ్ అని ఒక సంస్థ నడుపుతారు. వారి ఆధ్వర్యంలో ఫ్రెంచ్ పరీక్షలు నిర్వహించేవారు. అదే సమయంలో జర్మన్ ప్రభుత్వం వారి సంస్థ మాక్స్‌ముల్లర్ భవన్ కూడా హైదరాబాదులో వుండేది. వాళ్లు జర్మన్ లో పరీక్షలు నిర్వహించేవారు. రెండు కోర్సుల్లోనూ చేరాను. ఫ్రెంచ్‌లో జూనియర్ డిప్లోమా పాసయ్యాను. జర్మన్‌లో 'గ్రండ్‌స్టాఫ్ టెల్-2' పాసయ్యాను. ఏదో సర్టిఫికెట్టు కోసం నేర్చుకున్నట్టు కాకుండా ఆ భాషలు, వాటిలో సామెతలు, వారి సంస్కృతి, సంప్రదాయం, వేషభాషలు అన్నీ కక్షుణ్ణంగా తెలుసుకున్నాను. అలా తెలుసుకోవడం వలన నా వ్యక్తిత్వంలో ఒక మార్పు వచ్చిందని తప్పకుండా చెప్పుకోవాలి. నాలో అవి ఒక భాగమై పోయాయి.
ఐయేయస్ ట్రెయినింగ్ జరిగేటప్పుడు ఉర్దూ నేర్పించారు. నేను ఆంధ్రరాష్ట్రం నుండి సెలక్టయ్యాను. ఉద్యోగానికి కూడా ఆంధ్రరాష్ట్రానికే ఎలాట్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో తెలుగు కాకుండా వేరే ఏదో ఒక భాష నేర్చుకోవాలి. ఆంధ్రరాష్ట్రంలో ఉర్దూ రెండవ అధికారభాష కాబట్టి మాకు సెకండ్ ఎడిషనల్ కింద ఉర్దూ నేర్పేవారు. ఇది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఉర్దూ అంటే చిన్నప్పటినుండి ప్రీతి, నేర్చుకోవాలన్న సరదా వుండేవి. హైదరాబాదులో పెరిగాను కాబట్టి, ఢిల్లీలో చదివాను కాబట్టి – కాస్త హిందీ, ఉర్దూ వచ్చు. ఉర్దూ నేర్చుకునే క్రమంలో హిందీ కూడా బలపడింది. ఆ ట్రెయినింగ్ జరిగిన ఏడాదిలో చాలా శ్రద్ధగా నా జీవితానికి సరిపడా ఉర్దూ నేర్చుకున్నాను. ఢిల్లీలో పని చేసినపుడు అది చాలా అక్కరకు వచ్చింది. హిదాయతుల్లా గారి వద్ద పనిచేసినపుడు ఆ మహాపండితుడి వద్ద రోజుకో కొత్త ఉర్దూ లేదా ఇంగ్లీషు మాట నేర్చుకునేవాణ్ని.
చెప్పవచ్చేదేమిటంటే మన అపజయాలపై యితరులు వ్యాఖ్యానించినపుడు క్రుంగిపోవడం కంటె, సరిదిద్దుకోమని దేవుడు మనకు యిలా చెప్పించాడు అనుకోవడం మంచిది.
ఇంకో విషయం ఏమిటంటే – ఈ అపజయం శాశ్వతం కాదు, ఒక ఫేజ్, కాస్సేపు రంగస్థలంపై నడిచే ఘట్టం మాత్రమే. అంతిమంగా మనకు జరగవలసినది జరిగితీరుతుంది. నేను ఎమ్‌ఎస్‌సి చదివే రోజుల్లో ఒక ప్రొఫెసర్‌గారు వుండేవారు. థియరీ ఆఫ్ రియల్ వేరియబుల్స్ అనే సబ్జక్ట్ చెప్పడంలో దిట్ట. ఆయనంటే నాకు చాలా గౌరవం వుండేది. ఆయన దగ్గరకు పరీక్ష పేపర్లు వస్తే దిద్దడానికి నా సాయం అడిగేవారు. ఎవరైనా అడిగితే, చేతనైతే చేయడమే నా ఫిలాసఫీ. పైగా ప్రొఫెసర్‌గారు అడిగారు. సంతోషంగా చేసేవాణ్ని. పరీక్షల్లో ఒక పేపరులో యీయన నాకు ఇంటర్నల్ ఎగ్జామినర్‌గా 73 మార్కులు వేశారు. ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ 96 వేశారు. ఇలా రెండిటి మధ్య 10 మార్కుల కంటె వ్యత్యాసం వుంటే మూడో ఎగ్జామినర్‌కు చూపించాలి అనే రూలు వుంది. ఆ మూడో ఎగ్జామినర్ 97 వేశారు. అది ఖరారైంది. ఇవన్నీ తర్వాత తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. నేను ఏ ప్రతిఫలమూ ఆశించి ఆయనకు సహాయపడలేదు. కానీ అవతలివాళ్లు 96, 97 మార్కులిచ్చిన పేపరుకే యీయన 73 యివ్వడం ఏమిటి? అయితే యీ అపజయం తాత్కాలికమే. అది జయం చేకూర్చడమే కాక యింకా పై మెట్టుకి తీసుకెళ్లింది. ఈయన 73 వేయడం బట్టే నాకు 96 కంటె 1 మార్కు ఎక్కువగా 97 వచ్చాయి!
xxxxxx
ఓటమిపాలై దిగులుగా వున్నవారితో ఎలా వ్యవహరించాలన్నది ఒక పెద్ద కళ. కొంతమందికి ఓదార్పు అవసరం. మరి కొందరికి మందలింపు అవసరం. ఈ మందలింపులో కూడా స్థాయీభేదం వుంది.
నా ఎమ్‌ఎస్‌సి అయిపోయాక, స్టేటు బ్యాంక్ ఉద్యోగానికి వెళ్లడానికి ముందు మా నాన్నగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అందరూ వచ్చి జాలి చూపించి, సానుభూతిగా మాట్లాడేవారు. మా నాన్నగారు తన జీవితం ఒక ముగింపుకి వచ్చిందని దిగాలు పడ్డారు. ఆ సమయంలో మా గాంధీ మావయ్య వచ్చాడు. మా తాతగారు కాంగ్రెసువాది. ఆయన ప్రభావం వలన మామయ్యలందరూ ఖద్దరే కట్టేవారు. ఈయన ఖద్దరు కట్టడంతో బాటు రామచంద్రపురంలో డాక్టరుగా ప్రాక్టీసు చేస్తూ అందరికీ తలలో నాలుకగా వుండడం చేత 'గాంధీ డాక్టరు'గా పేరుబడ్డారు – అసలు పేరు వేరే వున్నా! అదేమిటో అవేళ ఆయన గాంధీతత్వం ఏమైందో తెలియదు కానీ మా నాన్నను చూస్తూనే మండిపడ్డాడు.
''ఏమిటయ్యా, ఏదో పెద్ద గుండెజబ్బంటూ అందర్నీ హడలగొట్టేస్తున్నావ్! అసలు నీకేమైందని? ఇలాటి ఎటాక్ అందరికీ వస్తూ వుంటుంది. కొందరకి తెలియను కూడా తెలియదు. మామూలుగా నడిచిపోతూ వుంటుంది. నీకు ఎవడో ఏదో చెప్పడం, అది పెట్టుకుని నువ్వు అందర్నీ దడిపించడం.. బాగుందయ్యా వరస! ముందు ఆ మంచంలోంచి లే, నడు.. అదిగో.. చూశావా, నిక్షేపంలా వున్నావ్.. పెళ్లికొడుకులా నడుస్తున్నావ్. జబ్బాగిబ్బా!.. డాక్టర్ని, నా దగ్గర కుదరవు యీ వేషాలు..'' అంటూ ఎంతెంత అరుపులు అరిచాడంటే దెబ్బకు మా నాన్నగారి దిగాలు పారిపోయింది.
ఇక్కడ నమ్మకం పని చేసింది. డాక్టరుగా మా మావయ్యకున్న ప్రావీణ్యత వలన మా నాన్నగారికి ఆయన మాటమీద గురి కుదిరి, తనకే ప్రమాదమూ లేదన్న విశ్వాసం ఆయనలో కలిగింది. నమ్మకం అనేది ఎంత పనైనా చేయించగలదు అనేదానికి మా నాన్నగారు తరచుగా చెప్పే జోక్ గుర్తుకు వస్తోంది.
ఒక పల్లెటూళ్లో ఒకతను కాలువవైపు వెళుతున్నాడు. మరొకడు ఎదురు వచ్చాడు. ''ఎక్కణ్నుంచి వస్తున్నావ్?'' అని అడిగాడు మొదటివాడు. ''కాలవలో సంధ్యావందనం ముగించుకుని వస్తున్నాను'' అన్నాడు రెండోవాడు.
''అదేమిట్రా, కాలువలో నీళ్లు లేవు కదా!'' అని ఆశ్చర్యపడ్డాడు మొదటివాడు.
''లేవా!? ఉన్నాయని చెప్పారే! అందుకేగా స్నానం వగైరా చేసుకుని సంధ్యావందనం కూడా చేసేసుకున్నాను.'' అని యింకా ఎక్కువ ఆశ్చర్యపడ్డాడు రెండోవాడు!
నీకు వనరులు వున్నాయి, నువ్వ చెయ్యగలవు అని బ్రెయిన్‌వాష్ చేస్తే సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా ఎంత కష్టమైన పనైనా చేయగలరు మనుష్యులు. నీకు చేతకాదు, నీ వలన కాదు, ఎంత చేసినా ఫలితం రాదు, …నువ్వు పరీక్ష పాసవ్వవు, పెద్దయ్యాక ముష్టి ఎత్తుకుంటావు, …ఎందుకూ పనికి రాకుండా పోతావు, అలాటి జీవితం జీవించడమే అనవసరం అని నిరంతరం చెపుతూ వుంటే డీ-మోటివేట్ అయిపోతారు. ఫలితం గురించి నాకు భగవద్గీతలో చెప్పినది నాకు చాలా యిష్టం. చెప్పానుగా మాకు పియుసిలో భగవద్గీత మూడు అధ్యాయాలు నేర్పించారని. వాటిల్లోనే వచ్చింది – 'కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన' అనే శ్లోకం. మన పని మనం చేసుకుని పోవాలి కానీ ఫలితం ఆశించకూడదని.
ఇది చెప్పడం, అనుకోవడం కష్టం. కానీ ఫలితం ఆశించకుండా వుండడం చాలా కష్టమైన పని. క్రమేపీ వంటబట్టించుకోవాలి. అంతేకాదు, జరిగినదాని గురించి చింతించడం మానుకోవాలి. వెళుతూ వెళుతూ వుత్తిపుణ్యాన ఏ గోడకో గుద్దుకుని తలకు బొప్పి కట్టించుకున్నామనుకోండి. అలా ఎందుకు జరిగిందిరా అని బాధపడుతూ కూర్చోను. ఇది జరగాల్సి వుంది, జరిగింది. జరగనిదాని గురించి – అంటే గోడను కాకుండా ఏ బస్సునో, రైలునో గుద్దలేదు కదా – వూహించి, జరగలేదుకదాని సంతోషిస్తాను. అసలు అలా వూహించడానికైనా, బొప్పి తడిమి చూసుకోవడానికైనా మిగిలాను కదా. ఏ రైలునో గుద్ది వుంటే శాల్తీయే గల్లంతు. మనం గ్రహించం కానీ జీవితమే పెద్ద వరం. మా నాన్నగారు చెప్తూ వుండేవారు. ఎవరో ఆయన్ని – ''హౌ యీజ్ లైఫ్?'' (జీవితం ఎలా వుంది?) అని అడిగితే ''బెటర్ దాన్ ద ఆల్టర్నేటివ్'' అని చెప్పారట. జీవితానికి ప్రత్యామ్నాయం మృత్యువే కదా. చనిపోకుండా వున్నాం కదా. అందుకు సంతోషించకుండా వున్న జీవితం బాగా లేదని సణగడం దేనికి?
కొసమెరుపు – ''హేమ్లెట్'' ప్రదర్శన నాడు వేదిక ఎక్కడానికి ముందే నెర్వస్ అయిపోయినట్టున్నాను. నా ప్రదర్శన ఫ్లాప్ అయిన తర్వాత ఆడియన్సులో వున్న కోకా సుబ్బారావు గారు – ఆయన అప్పుడు ఆంధ్రా హైకోర్టుకి గుంటూరులో చీఫ్ జస్టిస్ – ఎవరి ద్వారానో కబురు పెట్టారు – ''వాడి యాక్షన్ సంగతి తర్వాత కానీ, ముందు ఆ లాగూబొత్తాలు సరిగ్గా పెట్టుకోమను'' అని.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version