మహా నగరంపై తుపాను బీభత్సం.. దేశ చరిత్రలోనే తొలిసారి.. ఎటు చూసినా ఇదే ఆవేదన
నేనున్నా విశాఖను ఆదుకుంటా విశాఖలోనే మకాం వేసి, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా
స్మార్ట్ సిటీని చేస్తానని అమెరికాలోనే చెప్పా.. ఆ మాటకు కట్టుబడి వున్నా తుపాను పీడిత ప్రాంతంలో పర్యటించాక మోడీ ఇచ్చిన హామీ ఇది.
అయినా, విశాఖ వాసుల్లో ఆందోళన తగ్గడంలేదు.. భవిష్యత్తుపై నమ్మకం కలగడంలేదు. ‘చరిత్ర చూడని విధ్వంసం..’ అనే షాక్‌లోనే వున్నారింకా విశాఖ వాసులు. సముద్రమే విశాఖకు అందం అని ఇప్పటిదాకా చెప్పుకున్న విశాఖ వాసులు.. ఆ సముద్రం మీదనుంచే తమను సర్వనాశనం చేసే విపత్తు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. రాజధాని కావాల్సిన నగరం, ఐటీ రాజధాని అయినా అవుతున్నందన్న ఆనందంతో సరిపెట్టుకున్న విశాఖ వాసులు, ఇపడు భవిష్యత్తు మీద బెంగతో వున్నారు. ఆ బెంగను తీర్చేదెవరు.? నీళ్ళిస్తారు, తిండి ఇస్తారు, నష్టపరిహారం కూడా ఇస్తారు.. మరి విశాఖ బ్రాండ్‌ని నిలబెట్టేదెవరు.? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ.. వీరిద్దరిలో విశాఖను ఆదుకునే ఆపద్బాంధవుడెవరు.!
అంచనాలకు అందని విలయమిది. ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద విధ్వంసాలు చోటుచేసుకున్నా.. ఉత్తరాంధ్ర కనీ వినీ ఎరుగని విధ్వంసాన్ని చవిచూసింది మాత్రం ఈ నెలలోనే. అక్టోబర్ 12.. ఉత్తరాంధ్ర చరిత్రలో ఓ భయంకరమైన రోజుగా ఎప్పటికీ మిగిలిపోతుంది. విశాఖపై కన్నేసిందట హుదుద్ తుపాన్.. అన్న వార్తలు వినగానే, ‘విశాఖేకం తూర్పు కనుమలు అడ్డంగా వున్నాయి.. అయినా విశాఖకు చిన్న చిన్న తుపాన్ల బెడద వుండొచ్చేమోగానీ, తీవ్ర పెను తుపాను వచ్చే సమస్యే లేదు.. ఒకవేళ తుపాను వచ్చినా నష్టమేమీ వుండదు..’ అని సగటు విశాఖ పౌరుడు అనుకున్నాడు. ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రజానీకం మాత్రం ఆందోళన చెందారు. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే, గత ఏడాది ఇదే అక్టోబర్ 12న శ్రీకాకుళం జిల్లా ఫైలీన్ తుపాను నష్టాన్ని చవిచూసింది గనుక. కానీ కలలో కూడా ఊహించలేదు విశాఖ ప్రజానీకం హుద్ హుద్ తుపాను సృష్టించే విధ్వంసం గురించి. విశాఖ ప్రజానీకం.. ఆ ప్రాంత ప్రజా ప్రతినిథులు.. ఇలా ఎవరూ అంచనా వేయలేకపోయారుగానీ, హుద్‌హుద్ తుపాను తీవ్ర విధ్వంసం సృష్టించేసింది.. విశాఖను అతలాకుతలం చేసేసింది. ఓ మహా నగరం నాలుగైదు రోజులపాటు విద్యుత్ లేక, మంచినీళ్ళు లేక, తినడానికి తిండి లేక విలవిల్లాడిందంటే.. ఇంతకన్నా దారుణమైన విధ్వంసం ఇంకేముంటుంది.?
విశాఖ మహా నగరమేనా.!
అసలు విశాఖపట్నం మహా నగరం కింద లెక్కల్లోకి వస్తుందా.? అంటే, ఇప్పుడు వస్తుంది.. ఒకప్పుడు రాలేదు.. అనంటే అది సరైన సమాధానమవుతుంది. ఎందుకంటే, ఉమ్మడి తెలుగు రాష్ర్టంలో విశాఖ వెనక్కి నెట్టివేయబడ్డ నగరం. పేరు గొప్ప ఊరు దిబ్బ.. ఇదీ విశాఖ వ్యవహారం. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నదీ విశాఖకు సరిగ్గా సూటవుతుంది. సువిశాల తీర ప్రాంతం.. అంతర్జాతీయ విమానాశ్రయం, బోల్డంత పారిశ్రామికాభివృద్ధి… భిన్న సంస్కృతుల కలయిక.. పాశ్చాత్య పోకడలు.. ఇలా ఒకటేమిటి చాలానే వున్నాయి. కానీ ఏం లాభం.? హైద్రాబాద్ తర్వాత విజయవాడ, దాని తర్వాత గుంటూరు లేదంటే తిరుపతి అదీ కాదంటే ఇంకో నగరం.. అన్నారే తప్ప, విశాఖ గురించి పాలకులెప్పుడూ సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలేదు. అదే విశాఖకు శాపమైంది. తుపానుతో తీవ్ర నష్టం వాటిల్లితే, నగరం తేరుకునేందుకు తగిన యంత్రాంగం విశాఖలో లేకపోయింది. ఐటీ రాజధాని అన్నారు.. స్మార్ట్ సిటీ చేస్తామన్నారు.. ఇంకేవేవో చెప్పేశారుగానీ.. మహానగరమనదగ్గ స్థాయిలో విశాఖను అభివృద్ధి చేయలేకపోవడంతో, సరైన సమయానికి యంత్రాంగం అందుబాటులో లేక, తుపాను విధ్వంసం సృష్టించి వెళ్ళాక సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్టీల్ సిటీ, ఎన్టీపీసీ, నేవీ వంటివి వున్నా.. విపత్కర సమయాల్లో తగిన యంత్రాంగం లేకపోవడమేంటి.? అన్న ప్రశ్న ఇప్పుడు వేసుకుంటే.. విశాఖను ఇప్పటిదాకా పాలకులు ఎంత దారుణంగా వెనక్కి నెట్టేశారో అర్థం చేసుకోవచ్చు.
విభజన తెచ్చిన ముప్పు ఇంకా తీవ్రమైనది
తుపాను దెబ్బకు విలవిల్లాడిన విశాఖకు ముఖ్యమంత్రి చేరుకోడానికే రెండ్రోజుల సమయం పట్టింది. కొందరు మంత్రులు ముందస్తుగా విశాఖలో మకాం వేసినా, పర్యవేక్షణ అంతా తెలంగాణ రాష్ర్ట రాజధాని హైద్రాబాద్ నుంచి జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ర్టం విభజన జరిగాక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక.. పరిపాలన తాత్కాలిక రాజధాని విజయవాడకు పూర్తిస్థాయిలో వచ్చి వున్నా అక్కడినుంచి విశాఖలో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేసే, పర్యవేక్షించే అవకాశం వుండేదేమో. కానీ, రాజధాని ఎక్కడన్నదానిపైనే ఎటూ తేలక దిక్కుతోచని స్థితిలో వున్న ఆంధ్రప్రదేశ్‌కి తుపాను రూపంలో పెను విపత్తు వచ్చిపడింది. పరిపాలన ఎక్కడినుంచి చేపట్టాలో తెలియని అయోమయంలో వున్న సర్కార్‌ని హుద్‌హుద్ తుపాను కుదిపేసింది. విశాఖలో ఎంతో కొంత ఐటీ పరిశ్రమ ఉనికి చాటుకుంటుంది గనుక, అదే ఐటీ రాజధాని అని తప్పనిసరి పరిస్థితుల్లో భావించాల్సిందే తప్ప, దానికి తగ్గ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వకుండా తుపాను మింగేసింది. అతీగతీ లేకుండా రాష్ట్రాన్ని విభజించి పారేస్తే, విడిపోయాక రాజధాని కూడా లేని, లోటుబడ్జెట్‌తో ఏర్పడ్డ రాష్ర్టం ఓ తుపాను దెబ్బకు ఎలా విలవిల్లాడిపోతుందోననడానికి ఆంధ్రప్రదేశ్‌కన్నా గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది.?
వన్ మేన్ ఆర్మీ.. చంద్రబాబుది మళ్ళీ మళ్ళీ అదే పాత వైఖరి
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో మకాం వేశారు. పరిపాలన అంతా విశాఖ నుంచే చక్కబెడ్తున్నారు. విశాఖ తేరుకోవడానికి కంటిమీద కునుకు లేకుండా ప్రయత్నిస్తున్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు. బాధితుల్ని ఓదార్చుతున్నారు. బ్లాక్ మార్కెట్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ నిజాలే. కానీ, చిత్తశుద్ధి అనే విషయానికొస్తేనే సవాలక్ష అనుమానాలు. తుపాను రాత్రికి రాత్రి వచ్చిందేమీ కాదు. ముందస్తు హెచ్చరికలు చాలానే వచ్చాయి. తీవ్రత అంచనాలకు అందని రీతిలో వుంటుందనే హెచ్చరికల్ని స్వయానా చంద్రబాబే జారీ చేసిన పరిస్థితి. అలాంటప్పుడు, చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని విశాఖలో ఎందుకు మోహరించలేదు.? పోనీ కమ్యూనికేషన్ వ్యవస్థ అల్లకల్లోలమవుతుందని తెలిసి, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఎందుకు చంద్రబాబు ఆలోచన చేయలేదు.? ఈ ప్రశ్నలకు సమాధానమే బాబు వైఖరి. అదేం సమాధానమనుకుంటున్నారా.. అన్నీ చంద్రబాబే చక్కబెడ్తున్నారు.. ‘చాలా బాగా పని చేస్తున్నాం..’ అని చెబుతున్నదీ చంద్రబాబే. కానీ సమీక్షల్లో మాత్రం అధికారులపై విరుచుకుపడ్తున్నారు.. మొబైల్ కంపెనీల ప్రతినిథులపైనా నోరు పారేసుకుంటున్న పరిస్థితి. గొప్పగా అన్నీ చక్కబెట్టేస్తున్నప్పుడు వాళ్ళపైనా, వీళ్ళపైనా అరవాల్సిన అవసరమేముంటుందబ్బా.. అంటే, అలా అరిస్తేనే కదా, ఇక్కడ క్రెడిట్ చంద్రబాబు ఖాతాలో పడేది.. అదీ అసలు సంగతి.
గతం గతః ఇప్పుడు జరగాల్సిందేమిటి.?
ఉత్తరాంధ్ర కోలుకోవాలి.. ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళకయినా కోలుకుంటుంది. ఎలా కోలుకుంటుంది.? ఎప్పటికి కోలుకుంటుంది.? అన్నది మాత్రం పాలకుల చిత్తశుద్ధిపై ఆధారపడి వుంది. మరి మహా నగరం విశాఖ మాటేమిటి.! ఇదే అసలు సిసలు సమస్య. వందల కోట్లు, వేల కోట్లు కావాలిప్పుడు. అసలే లోటు బడ్జెట్.. రాజధాని నిర్మాణానికే కేంద్రం రూపాయి కూడా విదల్చని దుస్థితిలో, సర్వనాశమైన విశాఖకు వేల కోట్లు కేంద్రం ఇస్తుందని అనుకోలేం. రాబట్టే సత్తా చంద్రబాబుకి వుందనీ నమ్మలేం. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు, ‘అమెరికాలోనే చెప్పాం విశాఖను స్మార్ట్ సిటీని చేస్తాం..’ అన్నారు, వెయ్యి కోట్లు తక్షణ సహాయం ప్రకటించారు. ఆ తక్షణ సహాయం అందుకునేందుకు, ఏపీ ప్రభుత్వం తరఫున అధికార పార్టీ నేతలు ఢిల్లీకి పరుగులు పెట్టి, ఢిల్లీ పెద్దల్ని దేబిరించాల్సిన దుస్థితి దాపురించిందిప్పుడు. ప్రధాని ప్రకటించిన వెయ్యి కోట్లే ఎపడొస్తుందో తెలియనప్పుడు, విశాఖ పునర్నిర్మాణానికి అవసరమయ్యే లక్ష కోట్ల మొత్తం ఎక్కడినుంచి, ఎలా వస్తుంది.? కానీ వచ్చి తీరాలి. వస్తేనే విశాఖ మునుపటి వైభవం, అంతకన్నా గొప్ప వైభవం సంతరించుకుంటుంది. గొప్ప వైభవం అక్కర్లేదు.. నిన్న మొన్నటిదాకా విశాఖలో వున్న వెలుగులు వుంటే చాలని సరిపెట్టుకోవాల్సి వస్తోంది సగటు విశాఖ వాసికి.
ఉక్కు నగరం విలవిల..
ఉక్కు నగరంగా పేరొందిన విశాఖపట్నం ఇప్పుడు విలవిల్లాడుతోంది. మానసికంగానూ విశాఖ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కారణమొక్కటే, ఈ పరిస్థితుల్లో తమను, తమ నగరాన్ని ఆదుకునేవారెవరు.? అన్నదే వారి ఆందోళనకు కారణం. ఐటీ రాజధానిగా విశాఖ పట్నం ఎంపికవడం పట్ల నిన్న మొన్నటిదాకా సంబరాలు చేసుకున్నారు విశాఖ జనం. ఇపడేమో, ఐటీ పరిశ్రమ సందిగ్ధంలో పడింది.. పెట్టుబడులకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు.. అన్న అంచనాలు, వార్తా కథనాలు విశాఖ వాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ‘విభజన జరిగాక విశాఖే పెద్ద నగరమవుతుంది.. విశాఖ దశ తిరిగిపోతుంది..’ అనుకున్నారు చాలామంది. మోడీ స్మార్ట్ సిటీ గురించి మాట్లాడితే, విశాఖ వాసి ఛాతీ, ఒక్కసారిగా రెండింతలయ్యింది గర్వంతో. కానీ, ఆ ఆనందమంతా హుద్‌హుద్ తుపాను ధాటికి తుక్కుతుక్కయిపోయింది. తుపాను గాయం కన్నా, బ్రాండ్ విశాఖకు మీడియాతోపాటు సోకాల్డ్ రాజకీయ నాయకులు, సోకాల్డ్ మేధావులు, సోకాల్డ్ పారిశ్రామిక రంగాలకు చెందినవారు కొడ్తున్న దెబ్బ విశాఖ వాసుల మనసుకి తీవ్రగాయం చేస్తోంది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే హరికేన్ల ధాటికి ప్రముఖ నగరాలు విలవిల్లాడతాయి.. ఆ తర్వాత తేరుకుంటాయి. అంతెందుకు, జపాన్‌లో మొన్నటికి మొన్న సునామీ వచ్చింది. అక్కడా ఆ గాయం త్వరగానే మానిపోయింది. విశాఖ హుద్‌హుద్ దెబ్బకి, విధ్వంసానికి గురయ్యిందే తప్ప, మ్యాప్‌లోంచి చెరిగిపోలేదు కదా.. అని విశాఖ నగర ప్రజానీకం వాపోతున్నారంటే, వారి ఆవేదన ఏంటో విజ్ఞులైతే తమను తాము ప్రశ్నించుకోవాలి.
పునర్‌నిర్మాణం బాధ్యత తీసుకునేదెవరు.!
పదేళ్ళ తర్వాత ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది నారా చంద్రబాబునాయుడికి. దేశంలో స్పష్టమైన మెజార్టీతో బీజేపీని ముందుండి నడిపించిన నరేంద్ర మోడీ ప్రధాని పీఠమ్మీద కూర్చున్నారు. మోడీ సర్కార్‌కి చంద్రబాబు మద్దతిస్తున్నారు. మోడీ మంత్రివర్గంలో వున్న కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఉత్తరాంధ్రకు చెందినవారే. విశాఖ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు. ఇవి చాలు, విశాఖ హుద్‌హుద్ గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి.. అని ఎవరైనా భావించొచ్చుగాక. కానీ, ఇక్కడ కావాల్సింది చిత్తశుద్ధి మాత్రమే. అమెరికాలో ప్రకటించాను స్మార్ట్ సిటీ చేస్తానని.. అనేసి ఊరుకుంటే సరిపోదు, ప్రధాని నరేంద్ర మోడీ స్మార్ట్ విశాఖను ఓ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించి, దానికి తగ్గట్టుగా నిధుల్ని విడుదల చేయడంతోపాటు, ఆ ప్రాజెక్ట్‌పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇక, చంద్రబాబు విషయానికొస్తే, హైద్రాబాద్‌ని డెవలప్ చేసింది నేనే.. అని చెప్తారాయన. ఇప్పుడు విశాఖను అభివృద్ధి చేసి, సర్వనాశనమైపోయిన విశాఖను, దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దా.. అని చెపకునేస్థాయికి ఆయన తన చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన తరుణమిది. అలా చేస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మోడీ విశాఖకు చేసే సహాయమూ అంతే. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ దెబ్బ తిన్న విశాఖను అభివృద్ధి చెందిన మహానగరంగా మలిచి చరిత్రెకక్కుతారా.? ఈ క్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తమ ఉనికిని చాటుకుంటారా.? వేచి చూడాల్సిందే.
చివరిగా… ఇంతటి విషాద సమయాన షరా మామూలు రాజకీయాలు రాజ్యమేలడం పునర్నిర్మాణానికి మంచిది కాదు. రాజకీయం పక్కన పెట్టి, ప్రతి ఒక్కరూ పునర్నిర్మాణానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తే.. బంగారు విశాఖ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు.
సింధు