బాబూ…వీటిని తప్పిదాలే అంటారు

బుడిబుడి నడకల వేళ తప్పటడుగులు పడొచ్చు. పరుగులు పెట్టే వేళ పడిపోయే చాన్స్ వుంటుంది. కానీ అనుభవం పండించుకుని ఆచి తూచి అడుగు వేసే వేళ మాత్రం అలాంటి ఇబ్బందులు వుండవు. నాలుగు దశాబ్దాల…

బుడిబుడి నడకల వేళ తప్పటడుగులు పడొచ్చు. పరుగులు పెట్టే వేళ పడిపోయే చాన్స్ వుంటుంది. కానీ అనుభవం పండించుకుని ఆచి తూచి అడుగు వేసే వేళ మాత్రం అలాంటి ఇబ్బందులు వుండవు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం పండించుకున్న నేత చంద్రబాబు. అనేక యుద్దములందు ఆరితేరి వృద్దమూర్తి. దేశ జాతీయ నాయకులకే సలహాలు అందించిన చాణక్యుడు. అంతర్జాతీయ బిజినెస్ గురువులకే పాఠాలు బోధించిన మాస్టర్. అలాంటి నేత ఇప్పుడు మళ్లీ కొత్తగా తప్పటడుగులు వేస్తున్నారు.

సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకోవడంలో సూపర్ మాన్ చంద్రబాబు అన్నది పార్టీ నాయకుల నమ్మకం. ఎక్కడ గెలుపు అవకాశం వుంటుందో అక్కడ చటుక్కున పట్టుకోవడంలో దిట్ట. అలాంటి వ్యక్తి గత రెండు మూడేళ్లుగా అన్నీ తప్పులే చేస్తున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. కేవలం లెక్కలు అడగుతున్నారు. 

వాజ్ పేయి మాదిరిగా తను చెప్పిన ప్రతి దానికీ తల ఊపడం లేదని, ఇచ్చిన డబ్బులకు లెక్కలు అడుగుతున్నారని, తన ఆటలు లేదా మాటలు సాగడం లేదని అలిగి మోడీని దూరం చేసుకున్నారు. పైగా ఆ టైమ్ లో మళ్లీ మోడీ అధికారంలోకి వచ్చే అవకాళాలు లేవు అని తప్పు అంచనా వేసుకున్నారు. అక్కడితో ఆగకుండా దేశం అంతా పర్యటించి మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు.

కానీ ఏమయింది. వ్యవహారం వికటించింది. మోడీకి పరిస్థితులు వ్యతిరేకమా కాదా? అన్నది గమనించడంలో తప్పు చేసారు అదే టైమ్ లో తనకు పరిస్థితులు వ్యతిరేకమా? అనుకూలమా అన్నది ఆలోచించుకోలేదు. అక్కడ జరిగిపోయింది అసలు సిసలు తప్పిదం. సరే అదంతా గతం. అధికారం కోల్పోయి ఏడాది దాటిపోయింది. మరో ఏడాది పూర్తి కాబోతోంది. ఇప్పటికైనా తప్పిదాలు దిద్దుకుని సరైన బాటలో వెళ్తున్నారా? అని ఆలోచిస్తే లేదనే అనిపిస్తుంది.

ప్రజలకా? మోడీకా?

అసలు చంద్రబాబుకు పరాజయం ఎందుకు సంప్రాప్తించింది? మోడీకి దూరం కావడం వల్లనా? జనాలకు దూరం కావడం వల్లనా? బాబుగారు మాత్రం మోడీకి దూరం కావడం వల్లనే అనుకుంటున్నారు. అదే అసలు తప్పిదం అయింది.  ఎప్పుడయితే మోడీకి దూరం కావడం వల్లే అనుకోవడం వల్లే చంద్రబాబు తప్పు మీద తప్పు చేయాల్సి వస్తోంది. అదే కనుక జనాలకు దూరం కావడం వల్లనే తనకు ఓటమి అనుకుంటే వేరేగా వుండేది.

మోడీ నిర్ణయాల కారణంగా, జనాలకు వస్తున్న ఇబ్బందులను చంద్రబాబు పట్టించుకుని వుంటే లోకల్ ఎన్నికల్లో ఇంతటి దారుణ పరాభవం వచ్చి వుండేది కాదు. కానీ మరో మూడేళ్లలోగా ఎలాగైనా మోడీకి దగ్గర కావాలన్నది టార్గెట్ గా పెట్టుకోవడంతో, జనాల సమస్యలను గాలికి వదిలేసారు. వాటిని పట్టించుకుంటే మోడీ ఆగ్రహానికి గురవుతానని భయపడుతున్నారు. ఇదే ఆయన చేస్తున్న అసలు సిసలు తప్పిదం. పైగా నిత్యం జగన్ మీద స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అలా చేయడమే జనాలకు దగ్గరగా వుండడానికి మార్గం అని భ్రమపడుతున్నారు.

లోకల్ ఫైట్

స్థానిక ఎన్నికల ఫైట్ విషయంలో కూడా తప్పే చేసారు. జగన్ ఎన్నికల విషయంలో ముందు వెనుక ఆడుతుంటే, అదంతా భయమే అనుకుని, గ్రౌండ్ తెలియకుండా,  రాజకీయ జనాల మైండ్ సెట్ మరిచిపోయి, నానా హంగామా చేసారు. ఏమయింది. దారుణ పరాజయం మిగిలింది. కానీ దాన్ని ఎంత బుకాయించాలో అంతా బుకాయించారు. పోనీ అదే స్టాండ్ మీద వున్నారా? అదీ లేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవహారాల దగ్గరకు వచ్చేసరికి రివర్స్ అయ్యారు. తూచ్ అంతా అన్యాయం. ఇక నేను ఫైట్ చెయ్య…అనేసారు.

ఇది అంతకన్నా తప్పిదం. ఆటగాడు ఆట ప్రాక్టీస్ చేస్తూనే వుండాలి. రాజకీయ నాయకులు పోరాడుతూనే వుండాలి. కార్యకర్తలను సదా బిజీగా వుంచాలన్నది చంద్రబాబే ఇతరులకు నేర్పారు. అలాంటిది ఇప్పుడు ఆయనే పార్టీ నాయకులను, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయలేకపోతున్నారు. ఆయన కన్నా లోకల్ గా నాయకులే బెటర్. 

పార్టీ నాయకుడి ఆదేశాలు పట్టించుకోకుండా తమ బలం తమకు వుండాలని ఇంతో అంతో ఫైట్ సాగిస్తున్నారు. పైగా అలా గెలిచినా కూడా మూడేళ్ల పాటు ఆర్థికంగా మనుగడ వుండాలని వైకాపాలో చేరిపోతున్నారు. మళ్లీ వాళ్లంతా వెనక్కు రారు అని లేదు. వస్తారనీ లేదు. మొత్తం మీద స్థానికంగా పార్టీ పట్టు సడలుతోంది. దీనికి కారణం కూడా చంద్రబాబే.

అధికారంలో వున్నపుడు సర్పంచ్ దగ్గర నుంచి సిఎమ్ వరకు సంపాదించకుండా వుండరు. ప్రజాస్వామ్యంలో అది వాస్తవం. కానీ అధికారంలో లేనపుడు పార్టీ జనాలను ఆర్థికంగా సపోర్టు చేయాల్సిందే. బలంగా వున్నవారిని వదిలేసినా, బలహీనమైన వారికి ఆర్థికంగా మద్దతు ఇవ్వాల్సిందే. గతంలో ఇలాంటివి అన్నీ సుజన చౌదరి చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆయన లేరు. 

బాబుగారు తన జేబులోంచి పైసా తీయరు అన్నది తెలుసున్నవారు అనేమాట, ఆ పార్టీకి మద్దతు పలికే సామాజిక వర్గ ఆర్థికమూలాలు కదిలిపోతున్నాయి. వాళ్లు కూడా ఆదుకునే పరిస్థితి లేదు. ఇది గమనించి మూడేళ్ల పాటు చంద్రబాబు స్వంత డబ్బులు తీయకుంటే పరిస్థితి మరింత వికటించే ప్రమాదం వుంది.

జనసేనను వదలలేక..

చంద్రబాబు చేస్తున్న తప్పిదం జనసేనను కూడా వదలలేక. అటు మోడీని ఇటు జనసేనను దగ్గర చేసుకుంటే విజయం సాధించడం ఈజీ అని నమ్ముతున్నారు. ఆ విషయం పైకి వ్యక్తీకరించకపోయినా, లోలోపల అదే జరుగుతోంది. ఎందకుంటే భాజపాకు గ్రౌండ్ లో బలం లేదు. జనసేనకు అంతో ఇంతో వుంది. అందుకే ఆ పార్టీ ని వదలడం బాబుగారికి ఇష్టం లేదు. కానీ ఇది కూడా తప్పిదమే అవుతోంది. తెలుగుదేశం పార్టీ పునాదులు బలంగా వుండడానికి కారణం బిసి లు. 

అధికారంలో వున్నపుడు పవన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో బిసిలు అలిగారు. ఆ అలకను జగన్ ఉపయోగించుకున్నారు. వారిని పూర్తిగా దగ్గరకు చేర్చుకున్నారు. దీనికి విరుగుడు చూడాల్సింది పోయి, ఇంకా జనసేనను దగ్గర చేర్చుకోవాలనే చూస్తున్నారు.

మోడీకి జనసేన ఎలాగూ దగ్గరగా వుంది. తాము కూడా అదే కూటమిలోకి చేరితే ఇక జగన్ ఆట కట్టు అన్నది బాబు గారి ప్రణాళిక. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏమిటంటే, మోడీ పై వున్న వ్యతిరేకత, జనసేనపై వున్న కాపు ముద్ర కలిసి తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు చేటు చేస్తాయన్నది గమనించడం లేదు. ఇప్పటికే మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సి వస్తోంది కానీ, హిందూ కార్డ్ ప్లే చేసి అలాంటి తప్పిదమే చేసారు.

హైదరాబాద్ వదలలేక

బాబుగారి మదిలో ఏం ఆలోచన వుందో కానీ, హైదరాబాద్ ను వదలలేకపోతున్నారు. ఓటుకు నోటు కేసు రాగానే క్షణాల్లో హైదరాబాద్ నుంచి పరుగెత్తుకు వచ్చారు. రాజధాని హక్కు వదిలేసుకున్నారు. నిజానికి అక్కడే వుండి, అమరావతిని అంత సీరియస్ గా తీసుకోకుండా వుండి వుంటే మరోలా వుండేదేమో? కానీ అప్పుడు అలా చేసారు. 

ఇప్పుడు హైదరాబాద్ వదిలేసి విశాఖలోనో, విజయవాడలోనో మకాం పెట్టుకుని వుంటే జనాలకు దగ్గరగా వుండే అవకాశం వుండేది. కానీ ఎందుకో అలా చేయలేకపోతున్నారు. ఎందుకో జూమ్ మీటింగ్ లను నమ్ముకుని కాలక్షేపం చేస్తున్నారు. ఆరోగ్య రీత్యా, వయస్సు రీత్యా హైదరాబాద్ లో వుండాలని అనుకుంటున్నారో ఏమో? తెలియదు. కానీ ఇలా చేయడం వల్ల పార్ట్ టైమ్ పొలిటీషియన్ అయిపోయారు. పోనీ బాబుగారు ఈ వయసులో ఆరోగ్యం, భార్య, కుటుంబం గురించి హైదరాబాద్ లో వుండి వుండొచ్చు. కానీ పార్టీ వారసత్వం అంది పుచ్చుకుందామని కిందా మీదా అవుతున్న లోకేష్ కు ఏమొచ్చె అన్న ప్రశ్న వినిపిస్తూనే వుంది.

ఇలాంటి వ్యవహారాలు అన్నీ బాబుగారు చక్కదిద్దుకోలేకపోతున్నారు. ఒకే సమస్య-అనేక పరిష్కారాలు. కానీ వాటిని ఎంచుకోవడంలోనే తప్పిదాల మీద తప్పిదాలు చేసేస్తున్నారు. ఇవన్నీ కలిసి ఎక్కడకు దారి తీస్తాయన్నది ఆయనకూ తెలియదు. కానీ ఆయన ఆలోచన అంతా ఒక్కటే ఏదో అద్భుతం జరిగి జగన్ అనేవాడు అధికారంలోంచి మాయం అయిపోతాడేమో? అన్నదే. కానీ ఒక్కో వర్గానికి ఒక్కోలా సాయం చేస్తూ, కిందా మీదా పడుతూనే రోజులు దొర్లించేస్తున్నాడు జగన్. 

తీరా ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ వున్నారో? అప్పుడూ అక్కడే వుంటారు. కానీ అప్పటికి పార్టీ, పార్టీ జనాలు సిద్దంగా వుంటారా? సగం మంది వైకాపా కు అలవాటైపోతారా? అన్నది తెలియదు. ఇకనైనా చంద్రబాబు నడుం బిగించాలి. విమర్శలు మాని పార్టీ బలోపేత మీద, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి. అప్పుడు ఆటోమెటిక్ గా జగన్ మీద పై చేయి సాధించడం సులువు అవుతుంది. 

అలా కాకుండా కేవలం విమర్శలను, తన మీడియాను నమ్ముకుని, మోడీ, పవన్ దగ్గరకు తీసుకోకపోతారా? వాళ్లు తన పల్లకీ మోసి తనను విజయతీరానికి తీసుకెళ్లకపోతారా? అని లెక్కలు కడుతూ వుంటే తప్పుల మీద తప్పులు జరిగిపోతాయి. ఆ తరువాత వగచి ప్రయోజనం వుండదు. మరొక్క పర్యాయం జగన్ అధికారంలోకి వచ్చాడా……..???? లోకేష్ హెరిడిటరీ ని మరచిపోయి హెరిటేజ్ ను మాత్రమే నమ్ముకోవాల్సి వుంటుంది.

చాణక్య