వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన రెండేళ్లను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంలోనే అనుకోకుండా వివిధ రకాల ఎన్నికలు వచ్చాయి. ఏడాది కిందటే జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలు.. దాదాపు ఏడాది విరామం తర్వాత జరిగాయి. జగన్ పాలనకు హనీమూన్ పిరియడ్ లోనే జరగాల్సిన స్థానిక ఎన్నికలు ఒక రకంగా ఆయన రెండేళ్ల పాలనపై రిఫరండంలా సాగాయి. వాటిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ గా నిలిచింది.
ప్రతిపక్షాలపై పై చేయి సాధించడం కాదు, వార్ వన్ సైడ్ అయ్యింది. 80 శాతం పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు అవే ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతానికి పరిషత్ ఎన్నికల ఫలితాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని తెలుగుదేశం పార్టీ బహిష్కరణ పేరుతో తప్పుకున్నట్టుగా వ్యవహరించడం, కొన్ని చోట్ల మాత్రం తెలుగుదేశం నేతలు పోటీలో ఉన్నట్టుగా ప్రకటించుకోవడం.. ఆ పార్టీ పరిస్థితి తేటెతెల్లం అయ్యింది.
మున్సిపల్ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు. ఎక్కడ పొరపాట్లు జరిగాయో చంద్రబాబు నాయుడు సమీక్షించలేదు. ప్రాదేశిక ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు రావొచ్చనే లెక్కలతో ఆ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు. ఇక స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ హవా ఉందంటే.. దానికి ప్రతిపక్షాలు వివిధ సాకులు చెప్పాయి.
స్థానిక ఎన్నికలు ఏవైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయంటూ చెప్పుకొచ్చారు ప్రతిపక్ష పార్టీ నేతలు. అయితే అధికార పార్టీకి బుద్ధి చెప్పడానికి కూడా ప్రజలు స్థానిక ఎన్నికలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని కావాలని విస్మరించాయి ప్రతిపక్ష పార్టీలు. మరీ తాము పది ఇరవై శాతం సీట్లను కూడా సాధించలేకపోయినా అలాంటి సాకులు చెప్పడం ఏపీలో ప్రతిపక్ష పార్టీల దివాళా కోరు తనాన్ని చాటుతోంది.
ఇక ఇంతలోనే జరుగుతున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక విషయంలో జగన్ పాలనపై కచ్చితమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పట్టణ, పల్లె ఓటర్ల కలబోత. సామాజికవర్గాల సమీకరణాల ప్రకారం కూడా.. ఇది అందరి నియోజకవర్గం!
రాయలసీమలోని నియోజకవర్గం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల రెడ్డి సామాజికవర్గం జనాభా తిరుపతి నియోజకవర్గం పరిధిలో అంతంత మాత్రమే! తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అయితే బలిజ ల జనాభా ఎక్కువ. ఆ పై ఇది ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం. అంటే.. ఎస్సీలు కూడా నిర్ణయాతాత్మక శక్తులుగా ఉండే లోక్ సభ నియోజకవర్గం. మిగతా చోట్లతో పోలిస్తే కాస్త ఎస్సీల జనాభా ఎక్కువగా ఉండే నియోజకవర్గం. ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో.. ఏపీలో ప్రతిపక్షాలు చేస్తున్న మత రాజకీయానికి కూడా ప్రజా స్పందన ఏమిటో తిరుపతి ఉప ఎన్నిక తీర్పుతో క్లారిటీ రానుంది.
ఇక జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు వల్ల పల్లెల్లో, మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిందని కూడా కొంతమంది వాదిస్తూ ఉన్నారు. పంచుడు కార్యక్రమాల వల్లనే జగన్ విజయం అని వారు తేల్చేస్తూ ఉన్నారు. అలాంటి వారు గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఒక్క తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లోనే లక్ష మందికిపై గా ఓటర్లు ఎగువ మధ్య తరగతి వారు. వీరంతా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్న వారు కాదు.
ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు తిరుపతిలో పెద్ద ఎత్తున ఉంటారు. రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి, నెల్లూరు వైపు నుంచి కూడా తిరుపతి వచ్చి సెటిలైన ఎగువ మధ్యతరగతి కుటుంబీకులు ఎంతో మంది ఉంటారు తిరుపతి సిటీలో. వీరు స్పష్టమైన తీర్పును ఇవ్వగలరు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం వీరి మీద ఉండదు. అలాగే నెల్లూరు జిల్లాలో భాగమైన గ్రామీణ ప్రాంతాల్లో కూడా అగ్రవర్ణాల ప్రజలకూ సంక్షేమ పథకాల లాభం ఏమీ లేదు. సంక్షేమ పథకాలకు ఇప్పుడు అతి పెద్ద లబ్ధిదారులు అంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే.
చాలా మంది రెడ్లు కూడా జగన్ వచ్చాకా సంక్షేమ పథకాల ప్రయోజనాలేవీ పొందడం లేదు. పది శాతం మంది రెడ్లు అలాంటి ఫలితాలను పొందుతుంటే, చంద్రబాబు హయాంలో పెన్షన్ లు తీసుకున్న రెడ్లు కూడా ఇప్పుడు చాలా మంది ఆ అవకాశాన్ని కోల్పోయారు. అటు ఓసీలు, ఇటు బలిజలు, మరోవైపు పక్కా అర్బన్ ఓటర్…. వీరంతా తిరుపతి ఉప ఎన్నిక తీర్పులో కీలక పాత్ర పోషించబోతున్నారు.
జగన్ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ నియోజకవర్గం పరిధిలో కొంత మేర ఉన్నా, ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న బలిజలు, సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారే నిర్ణయాత్మక శక్తులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి బాగా మిశ్రమ నియోజకవర్గంగా నిలుస్తోంది. ఇలాంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మెజారిటీ సాధిస్తుంది అనేదాన్ని బట్టి.. జగన్ పాలనకు రాష్ట్రంలో ఎంత సానుకూలత ఉందో మరింత స్పష్టత రానుంది.