తిరుపతి లోక్ సభ సీటు ఉప ఎన్నిక ప్రచారంలో పచ్చ పార్టీ ప్రహసనం పాలవుతోంది. ఒకవైపు లోకేష్, మరోవైపు చంద్రబాబు నాయుడు.. ఇద్దరూ ఎప్పుడే ఏం మాట్లాడతారో అనే పరిస్థితి ఏర్పడటం గమనార్హం. ఈ తండ్రీకొడుకులిద్దరూ ఏ మాత్రం స్పృహలో ఉన్నట్టుగా మాట్లాడటం లేదు. ప్రత్యేకించి అధికారం కోల్పోయిన తర్వాత ఒకవైపు ఫ్రస్ట్రేషన్ మరోవైపు ముందు నుంచినే ఉన్న మందమతి తరహాలో వీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ మధ్య తండ్రీ కొడుకులిద్దరూ పోటాపోటీగా బూతులు మాట్లాడారు.
ఏం పీకారు, ఏం పీకుతున్నారు, ఏం పీకబోతున్నారు.. అన్నట్టుగా ఇద్దరూ రెచ్చిపోయారు. అధికారం చేజారడంతో వీరిలో ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరిందని, అందుకే అలా అర్థం పర్థం లేకుండా బూతులు మాట్లాడుతూ వీరు తమ అక్కసును తీర్చుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. స్థానిక ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు పచ్చిపచ్చిగా బూతులు మాట్లాడిన చంద్రబాబు నాయుడు, లోకేష్ లు స్థానిక ఎన్నికల ఫలితాలతో అయినా కాస్త దారికి రావాల్సింది.
అయితే.. చంద్రబాబు, లోకేష్ ల తీరులో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. లోకేష్ ఏమో నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారు. వయోవృద్ధుల వద్దకు వెళ్లి.. తిరుపతిలో పనబాక లక్ష్మిని గెలిపిస్తే వాళ్ల పెన్షన్ మొత్తాలు పెరుగుతాయంటూ లోకేష్ హామీ ఇచ్చారు. ఇది చాలా కామెడీ అయిపోయింది.
జనాలకు కాస్తో కూస్తో ఆలోచనా శక్తి ఉందని లోకేష్ కు తెలియదు కాబోలు అని అంతా అనుకుంటున్నారు. అలాగే పనబాక లక్ష్మిని గెలిపిస్తే గ్యాస్ ధరలు తగ్గుతాయని, పెట్రో ధరలు తగ్గుతాయని లోకేష్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆమె ఎంపీగా గెలిస్తే ఆమెను లోకేష్ ఏమైనా ప్రధాని పీఠం మీద కూర్చోబెడతారా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలోకి లోకేష్ దిగడం అంటేనే పెద్ద కామెడీ. ఆ అంచనాలకు న్యాయం చేయాలన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తనయుడు తిరుపతి నియోజకవర్గం పరిధిలో కామెడీ చేస్తూ ఉన్నారు. అలాగే తన అహంభావపూర్వకమైన మాటలను కూడా లోకేష్ వదలడం లేదు. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా .. అలాంటి మాటల విషయంలో ఏమీ తగ్గేదే లేదని లోకేష్ చాటుకుంటూ ఉన్నాడు.
ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు.. ఓటర్లను కించ పరిచే మాటలు, వారిని తక్కువు చేసే మాటలు కొనసాగిస్తూ ఉన్నారు. డబ్బులు తీసుకుని ఓటేస్తారని, మద్యం తీసుకుని ఓట్లేస్తారని.. చంద్రబాబు నాయుడు ప్రచారంలో వ్యాఖ్యానించారు. అలాగే మంచి బ్రాండ్ల మద్యం దొరకడం లేదని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఆ మధ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గుంటూరుకు వెళ్లి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడి చంద్రబాబు నాయుడు తన డొల్ల తనాన్ని తనే బయటపెట్టుకున్నారు. అసలే మండే ఎండల నేపథ్యంలో ఇంకా చంద్రబాబు నాయుడు తిరుపతి పరిధిలో ఏమేం మాట్లాడతారో, ప్రచార పర్వం ముగిసే లోపు ఇంకా ఎంత కామెడీ చేస్తారో.. అనేది ఆసక్తిదాయకంగా మారింది.