తిరుపతి లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం ఓటు బ్యాంకుకు భారీగా కన్నం పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రీ పోల్ పరిస్థితులను గమనిస్తే.. భారతీయ జనతా పార్టీకి ఎంత బలం పెరిగినా, అదంతా తెలుగుదేశం పార్టీకి బలహీనతగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
వాస్తవానికి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో భారతీయ జనతా పార్టీ కనీసం నోటా స్థాయి ఓట్లను కూడా పొందలేకపోయింది. కాంగ్రెస్ కన్నా వెనుకే నిలబడింది. అయితే కేంద్రంలో వరసగా రెండో సారి అధికారంలోకి రావడంతో బీజేపీ కాన్ఫిడెంట్ లెవల్స్ చాలా పెరిగాయి. ఆ పై జనసేన సపోర్ట్ బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారింది.
అందునా తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో బలిజల ఓట్లు గణనీయంగా ఉండటంతో.. పవన్ కల్యాణ్ ప్రచారం వల్ల అవి బీజేపీకి బదిలీ అయ్యే పరిస్థితి కొంత వరకూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ కొద్దో గొప్పో ఓట్లను సాధించవచ్చనే అంచనాలు ఏర్పడుతున్నాయి.
తిరుపతి లోక్ సభ సీట్లు పరిధిలో బీజేపీ ఏమైనా ఓట్లను సాధించినా అవేమీ ఏపీకి బీజేపీ చేసిన మేలుకు రివార్డు కాదు. కేవలం కుల రాజకీయం, మత రాజకీయంతో మాత్రమే కొద్దో గొప్పో బీజేపీ ఓట్లను పొందే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆ ఓట్లు కూడా టీడీపీ బుట్టలోంచి బీజేపీ తీసుకోనేలా ఉంది సీన్.
ఇప్పుడు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు స్పందించే బలిజలు అయినా, బీజేపీ రెచ్చగొడుతున్న మత ఉద్రిక్తతల ఓట్లు అయినా.. అవేవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి కావు. ఈ రెండు ప్రభావాలకూ లోనయ్యేవి పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఓట్లే కావడం గమనార్హం. బీజేపీ పొందే ప్రతి ఓటూ తెలుగుదేశం వైపు నుంచి వచ్చేవే అని విశ్లేషకులు కుండబద్ధలు కొట్టి చెబుతున్నారు.
రెండో స్థానంలో టీడీపీనే నిలిచినా, బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయినా.. బీజేపీ పెంచుకున్న ఓట్ల శాతమంతా తెలుగుదేశం మొత్తం నుంచి మైనస్ అయ్యేదే అని క్షేత్ర స్థాయి పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. కనీసం ఏడెనిమిది శాతం టీడీపీ ఓట్లు తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ వైపు మొగ్గే అవకాశం ఉందనేది స్థానిక విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట.