కొందరు గొప్పవారు జీవించివున్నంత కాలం కొన్ని షాకింగ్ విషయాలు బయటకు రావు. వారి గొప్పతనమే ప్రజలకు తెలుస్తుంది తప్ప కష్టాలు, నష్టాలు వెలుగులోకి రావు. వారు మరణించాక షాకింగ్ న్యూస్ బయటపడుతుంది. దీంతో ఇలా జరిగిందేమిటి? అని జనం ఆశ్చర్యపోతారు. ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ గొప్పతనం, ప్రతిభాపాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ తమిళ దర్శకుడు తెలుగువారికీ సుపరిచితులు. ఈ భాషలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. ఇదో కోణం. ఆయన మరణించిన చాలా కాలం తరువాత తాజాగా అప్పుల ఊబి విషయం బయటకు వచ్చింది.
ఆయన సొంత చిత్ర నిర్మాణ సంస్థ పేరు కవితాలయ. ఈ కార్యాలయాన్ని, చెన్నయ్ మైలాపూర్‌లో ఆయన రెండు ఇళ్లను (ఫ్లాట్స్) వేలం వేసే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం యూకో బ్యాంకు నుంచి తీసుకున్న కోటీ 36 లక్షల అప్పును తీర్చకపోవడమే. ఆస్తులను వేలం వేస్తామంటూ బ్యాంకు అధికారులు బాలచందర్ కుటుంబానికి నోటీసులు పంపారు. అయితే ఆస్తుల వేలం విషయాన్ని దర్శకుడి కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. ఆస్తులను తనఖా పెట్టి అప్పు తీసుకున్న మాట నిజమేనని, అయితే దాన్ని సెటిల్ చేసుకునేందుకు బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
ఇదివరకే కొంత మొత్తం చెలించామని, మిగిలిన మొత్తం చెల్లింపు విషయమై సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. యూకో బ్యాంకు వేలం వేయాలని నిర్ణయించుకున్న రెండు ఫ్లాట్స్ మైలాపూర్‌లోని దేశికా రోడ్డులో ఉన్నాయి. వీటిల్లో ఒకటి 1700 చదరపు అడుగుల విస్తీర్ణం కాగా, మరోటి 2,400 చదరపు అడుగులు. చిన్న ఫ్లాట్ బాలచందర్ కుమార్తె పుష్పకు చెందింది. వేలం పాటలో దీనికి బ్యాంకు నిర్ణయించిన అతి తక్కువ ధర 87 లక్షలు. బాలచందర్ భార్య రాజంకు చెందిన మరో ఫ్లాట్‌కు నిర్ణయించిన ధర 119 లక్షలు. పుష్ప, రాజం ఇద్దరూ కవితాలయలో భాగస్వాములుగా ఉన్నారు. బాలచందర్ 2014 డిసెంబరులో మరణించారు.
ఆయన మరణించాక కవితాలయ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరగలేదు. ఈ బ్యానర్‌పై బాలచందర్ యాభైకి పైగా చిత్రాలు నిర్మించారు. నాన్ మహాన్ అల్ల (1984), సింధుభైరవి (1985), పున్నగై మన్నన్ (1986), సామి (2003) వంటి విజయవంతమైన చిత్రాలెన్నింటినో తీశారు. ఈ చిత్రాల్లో కనీసం అరడజన్ వరకు జాతీయ, రాష్ట్ర పురస్కారాలు అందుకున్నాయి. కవితాలయ బ్యానర్‌పై చివరగా రజనీకాంత్ హీరోగా కుచేలన్ చిత్రం నిర్మించారు. దీనికోసం బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. కొన్ని సినిమాల అపజయం, ఇతర కారణాల వల్ల అప్పుతీర్చడం సాధ్యంకాలేదని తెలుస్తోంది.