పెద్ద పాత నోట్ల రద్దుతో బ్యాంకులు దారుణంగా దెబ్బతినేశాయి. ఏటీఎంలు దాదాపు రెండు నెలలపాటు మూతపడిపోయాయి. అయితేనేం, పెద్దయెత్తున బ్యాంకుల్లోకి డిపాజిట్లు వచ్చాయంటూ రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసి పండగ చేసేసుకున్న విషయం విదితమే. అయితే, అది బలుపు కాదు – వాపు.. అని తేలడానికి పెద్దగా టైమ్ ఏమీ పట్టలేదు. బ్యాంకుల్లో ఎలాగైతే 'మనీ' డిపాజిట్ అయ్యిందో, అలాగే విత్డ్రా అయిపోయింది.
క్రమక్రమంగా బ్యాంకుల వద్ద నగదు నిల్వలు తగ్గిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అతలాకుతలమైపోయిందని బ్యాంకింగ్ రంగ నిపుణులే అభిప్రాయపడ్తున్నారు. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన బ్యాంకులు, తమ మనుగడ కోసం వినియోగదారులపై ఛార్జీల వడ్డనకు తెరలేపాయి. బ్యాంకుకి వెళితే బాదుడే.. అనే స్థాయిలో పలు బ్యాంకులు ఇప్పటికే బాదుడు మొదలు పెట్టేశాయి. ఎందుకిలా.? అని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నట్టు బ్యాంకులు వ్యవహరిస్తున్నాయి.
చిత్రంగా కేంద్రం, బ్యాంకులు ఛార్జీల వాత విషయంలో పునరాలోచించుకోవాలంటూ ఓ చిన్న సూచన చేసేసి ఊరుకుంది. ఎటూ, 'క్యాష్ లెస్ ఎకానమీ..' అనే మాయ మాట ఒకటుంది గనుక, బ్యాంకులు తీసుకుంటున్న చర్యల్ని కొంతమేర కేంద్రం, రిజర్వు బ్యాంకు సమర్థిస్తున్నట్లే కన్పిస్తోంది. ఇక్కడ కరెన్సీ సంక్షోభం సుస్పష్టంగా కన్పిస్తోంటే, దానికి క్యాష్ లెస్ అనే ముసుగు వేయడం ఎంతవరకు సబబు.? ఈ ప్రశ్న సామాన్యులనుంచి దూసుకొస్తున్నా, సమాధానం చెప్పే నాధుడెవరు.? పాలకులే బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నప్పుడు, బ్యాంకులు అదే దారిలో నడవక ఇంకేం చేస్తాయి.!
'బ్యాంకు వైపుగా వెళ్ళారో మీకు వాత పడిపోతుంది.. ఏటీఎం సెంటర్లోకి వెళ్ళక్కర్లేదు, అటు చూశారో మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది..' అంటూ, బ్యాంకులపై ప్రస్తుతానికి సెటైర్లు పడ్తున్నాయిగానీ.. బ్యాంకుల తీరు ఇలాగే వుంటే, దేశంలో క్యాష్ లెస్ ఎకానమీ కాదు.. బ్యాంక్ లెస్ ఎకానమీని మనం చూడాల్సి వస్తుందేమో.! బహుశా మోడీ, అచ్చే దిన్ అంటే బ్యాంకులు.. సామాన్యులు చచ్చే దిన్ అని అర్థమేమో.!