భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. ప్రత్యేకంగా తన కోసమే రూపొందించిన ‘బీస్ట్’ వాహనంలోనే ఆయన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
వాస్తవానికి, భారత రాష్ట్రపతి ఉపయోగించే వాహనంలోనే ముఖ్య అతిథి ఎవరైనా రిపబ్లిక్ డే వేడుకలకు హాజరవ్వాల్సి వుంటుంది. దశాబ్దాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే ఎంతైనా అమెరికా అధ్యక్షుడు కదా. అందుకే, సంప్రదాయాల్ని పక్కన పెట్టి, తన భద్రతే ముఖ్యమనుకున్నారు ఒబామా. ఈ క్రమంలోనే ఆయన బీస్ట్ వాహనంలోనే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో వివిధ రాష్ట్రాలు రూపొందించే శకటాలు, మిలిటరీ, వైమానిక, నౌకాదళాలు ప్రదర్శించే వాహనాలు.. వీటిల్లానే ‘ది బీస్ట్’ వాహనం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలో ఏ దేశంలో పర్యటించినా, ఒబామా తన వెంట ‘ది బీస్ట్’ వాహనాన్ని తీసుకెళ్తారు. అంత ప్రత్యేకత కలిగిన వాహనం అది.