దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శకటాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. కొత్త రాష్ట్రం తెలంగాణ బోనాల వేడుకల్ని కళ్ళకు కట్టేలా రూపొందించిన శకటంతో రిపబ్లిక్ డే వేడుకల్లో తన ప్రత్యేకతను చాటుకుంది. పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, సంక్రాంతి వేడుకల్ని ప్రతిబింబించే శకటాన్ని రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించింది.
ప్రతియేటా రిపబ్లిక్ డే వేడుకల కోసం వివిధ రాష్ట్రాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తమ రాష్ట్రాల తరఫున శకటాల్ని రూపొందిస్తుంటాయి. ఈసారి కూడా వివిధ రాష్ట్రాలు తమ ప్రత్యేకతను చాటుకునేందుకు భిన్న రూపాల్లో శకటాల్ని రూపొందించాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే.. అన్నట్టు తమ తమ రాష్ట్రాల్లోని సంస్కృతీ సంప్రదాయాలు చాటి చెప్పే శకటాలతో రిపబ్లిక్ డే వేడుకలకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాల్ని శకటాల్ని తిలకించడం ద్వారా తెలుసుకున్నారు. ఆయనకు ప్రతి విషయం గురించీ వివరిస్తూ వచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.