బెజవాడకున్న ప్లస్సులు, మైనస్సులివే…

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కాబోతోంది బెజవాడ. బెజవాడ సినిమాలో ‘బెజబెజబెజబెజవాడ.. గజగజగజగజలాడ..’ అనే పాట ఒకటుంటుంది. ఆ పాటకు తగ్గట్టే వుండేది ఒకప్పుడు విజయవాడలో కక్షలు, కార్పణ్యాల గోల. కానీ, ఇప్పుడది లేదు.…

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కాబోతోంది బెజవాడ. బెజవాడ సినిమాలో ‘బెజబెజబెజబెజవాడ.. గజగజగజగజలాడ..’ అనే పాట ఒకటుంటుంది. ఆ పాటకు తగ్గట్టే వుండేది ఒకప్పుడు విజయవాడలో కక్షలు, కార్పణ్యాల గోల. కానీ, ఇప్పుడది లేదు. అప్పట్లో ఆ ముఠాతగాదాలు విజయవాడకి చాలా చెడ్డపేరు తెచ్చాయన్నది నిర్వివాదాంశం. ఆ ముఠా తగాదాల కారణంగానే కులాల కుంపట్లు రగిలాయి. అయితే అదంతా గతం. మరి కొద్ది గంటల్లో విజయవాడను రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌కి మధ్యలోనే రాజధాని వుండాలి.. అది కూడా విజయవాడ – గుంటూరు మధ్యనే రాజధాని వుంటుంది.. అని ఇదివరకే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. మంత్రి నారాయణ అయితే ఇప్పటికి ఓ వందసార్లన్నా విజయవాడ – గుంటూరే రాజధాని అని చెబుతూ వచ్చారు. ఇక, చాలామంది రాజకీయ నాయకులు విజయవాడ – గుంటూరును రాజధానిగా వ్యతిరేకిస్తున్నా, అది తప్ప వేరే ఆప్షన్‌ లేదంటే, దాన్ని వ్యతిరేకించలేం.. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అంతా అభవృద్ధి చెందాలి.. అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

విజయవాడ – గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లేవని రాజధాని విషయమై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ తేల్చింది. అయినాసరే, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంటోంది. ఆ మధ్య, విజయవాడ – గుంటూరు ప్రాంతం ‘భూకంపం జోన్‌’లో వుంది.. అనే వాదనలు తెరపైకొచ్చాయి. ‘అలాగైతే జపాన్‌ భూకంపాల దేశం కదా..’ అంటూ ఆ వాదనలకు చెక్‌ పెట్టారు చాలామంది. విజయవాడ చాలా ఇరుకు.. అని సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని అంటే సామాజిక సమీకరణాల పరంగా, ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా ఇబ్బందులుంటాయని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పడమే కాదు, సామాజిక సమీకరణాల వ్యవహారంపై సామాన్యుల్లోనూ చాలా అనుమానాలున్నాయి.

ఎవరేమనుకున్నా, ఎవరెలాంటి వాదనలు చేసినా విజయవాడ – గుంటూరు మధ్య రాజధానిపై ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. పేరుకి విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని అనే వార్తలు విన్పిస్తున్నా, విజయవాడనే రాజధాని.. అన్న ఊహాగానాలు రెండ్రోజుల నుంచీ గట్టిగా విన్పిస్తున్నాయి. ప్రధానంగా విజయవాడ – నూజివీడు రాజధానికి అనుకూలమన్న వాదన తెరపైకి వచ్చింది. అంటే ఇక్కడ గుంటూరు కూడా మైనస్‌ అయ్యిందన్నమాట. విజయవాడ – నూజివీడు.. లేదంటే విజయవాడ – గన్నవరం ప్రాంతాల్లో కొత్త రాజధాని నిర్మితమవుతుందన్నది తాజా ఖబర్‌.

విజయవాడ – గుంటూరు అయినా, విజయవాడ – అమరావతి అయినా, విజయవాడ – గన్నవరం అయినా, విజయవాడ – నూజివీడు అయినా అన్నిట్లోనూ కామన్‌ థింగ్‌ విజయవాడ. కాబట్టి, బెజవాడ క్యాపిటల్‌ కానుందనేది స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలో విజయవాడకున్న ప్లస్సులు మైనస్‌ల గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. అవేంటో మనమూ ఓ సారి లుక్కేసేద్దాం.

ప్లస్సుల విషయానికొస్తే..

రహదానికి కావాల్సింది ‘కనెక్టివిటీ’. ఆ కోనంలో చూస్తే విజయవాడకు అసలు సమస్యలే లేవు. నాలుగు లేన్ల హైవే ఇటు హైద్రాబాద్‌కీ, అటు చెన్నయ్‌కీ లింకప్‌ అయి వుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్‌ అంతటికీ విజయవాడ నుంచి రోడ్డు మార్గం వుంది. రైల్వే పరంగా చూస్తే, అతి పెద్ద జంక్షన్‌గా ఇప్పటికే విజయవాడ విలసిల్లుతోంది. ఎయిర్‌ కనెక్టివిటీ గురించి ఆలోచిస్తే, గన్నవరంలో విమానాశ్రయం ఇప్పటికే వుంది. దాన్ని విస్తరించి, అంతర్జాతీయ స్థాయికి పెంచాలని పాలకులు అనుకుంటే, అది పెద్ద విషయమే కాదు. దగ్గర్లోనే సముద్ర తీరం వుండడంతో అది కూడా ప్లస్‌ పాయింటే. విజయవాడ కృష్ణా నది ఒడ్డున వుంది గనుక నీటి సమస్య లేనట్టే.

మైనస్‌లు ఏమేం వున్నాయంటే..

అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్న చందాన విజయవాడకు లేనివేమీ లేవు.. అన్నీ వున్నాయి. కానీ, చాలా ఇరుకైన నగరం విజయవాడ. భూముల లభ్యత చాలా తక్కువ. భూ సేకరణ అంటే కనాకష్టంగానే చెయ్యాల్సి వుంటుంది. గట్టిగా ఓ వందెకరాలు సేకరించాలంటే నానా తంటాలూ పడక తప్పదు. రాజధాని అంటే మాటలు కాదు కదా. అసెంబ్లీ, సెక్రెటేరియట్‌ ఇవే కాదు, ఉద్యోగుల కోసం నివాస స్థలాలూ గట్రా కావాలంటే ఎలా తీసుకొస్తారు.? వాతావరణమూ ఓ సమస్యే. మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే డిఫరెంట్‌ వెదర్‌ విజయవాడలో వుంటుంది. అత్యంత ఉక్కబోత ప్రాంతంగా విజయవాడ గురించి చెప్పుకోవచ్చు. సామాజిక సమీకరణాలు, కులాల ఆధిపత్య పోరు విజయవాడలో చాలా ఎక్కువ. ఇప్పటికీ గత కాలపు దౌర్భాగ్యపు నీడలు ఇంకా అక్కడక్కడా కన్పిస్తూ వుంటాయి. అవి అభివృద్ధికి ఆటంకం అన్నదాంట్లో ఎవరికీ ఇంకో అభిప్రాయమే లేదు. చెప్పుకుంటూ పోతే మైనస్‌ల లిస్ట్‌ చాంతాడంత అవుతుంది.

అయినప్పటికీ బెజవాడే రాజధాని. ఇది ఫిక్స్‌. మరికొద్ది గంటల్లో రాజధాని ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రానుంది. ‘రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి.. మీరనుకున్నట్టే కృష్ణా – గుంటూరు అయినా అభ్యంతరం లేదు.. కానీ అభివృద్ధిని వికేంద్రీకరించండి..’ అని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. రాజకీయ కోణంలోనే వైసీపీ ఈ వాదన చేస్తోందనేది వాస్తవమేగానీ, వైసీపీ వాదనలోనూ నూటికి నూరుపాళ్ళూ వాస్తవం వుంది. బెజవాడలో రాజధాని పెడితే ఉత్తరాంధ్రకు ఏం చేస్తారు.? రాయలసీమ సంగతేంటి.? అన్న ప్రశ్నలకూ రేపు చంద్రబాబు సమాధానమిస్తారనే చాలామంది ఆశిస్తున్నారు. తొమ్మిదేళ్ళు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, నిజంగానే గొప్ప అడ్మినిస్ట్రేటర్‌ అన్పించుకోవాలంటే, రాజధానిపై రేపు ఆయన ప్రకటన అత్యంత బాధ్యతాయుతంగా వుండాలి. రాజధాని ఎక్కడైనా కావొచ్చుగాక.. మొత్తం 13 జిల్లాల్లో ఏ ఒక్కరూ ఆందోళన చెందకుండా వుండేలా ‘అభివృద్ధి వికేంద్రీకరణ’ కోణంలో చంద్రబాబు ప్రకటన వుంటుందనే ఆశిద్దాం.

– సింధు