డబ్బు.. డబ్బు.. డబ్బు.. ఎటు చూసినా మనిషికి నిత్యం దీనితోనే అవసరం. డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవారు సమాజంలో చాలామందే వున్నారు. వున్న డబ్బుని ఏడాది తిరగకుండానే పదింతలు (వక్రమార్గంలో అయినాసరే) చేసేయాలనుకునేవారు మరికొందరు. అలాంటివారి కారణంగా అమాయకులు నిత్యం బలైపోతూనే వున్నారు.
అవసరానికి అప్పు చేస్తే, ఆ అప్పు క్యాన్సర్‌లా మనిషిని హరించేస్తుంది. ఈ విషయంలో సినీ జనం అతీతులేమీ కాదు. ఆ మాటకొస్తే, ఎక్కడా లేనంత దారుణంగా సినీ పరిశ్రమలో అప్పులు ` వడ్డీలు వుంటాయనే అభిప్రాయం విన్పిస్తుంటుంది సినీ రంగంతో కాస్తంతయినా టచ్ వున్నవాళ్ళకి. నిజమెంత.? అనడక్కండి.. ఇది సీక్రెట్ బిజినెస్. దాంతో ‘అబ్బే.. అంతా ఉత్తదే..’ అనేస్తారు.
చిట్టీలరాణి.. అదేనండీ బుల్లితెర నటి విజయరాణి కోట్ల రూపాయల సొమ్ముతో ఉడాయించిన వ్యవహారం సినీ, టెలివిజన్ రంగాల్లో కలకలం రేపిన విషయం విదితమే. ఎట్టకేలకు ఆమె పోలీసులకు చిక్కింది. మొత్తంగా నాలుగైదు కోట్ల రూపాయల ‘కుంభకోణం’ ఇందులో వుందని తేల్చారు పోలీసులు. విచిత్రమేంటంటే ఈ ఎపిసోడ్లో విజయరాణి కూడా బాధితురాలేనట.
పోలీసులేమంటున్నారంటే, లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే, దానికి రోజువారీ 3,500 రూపాయల వడ్డీ చెల్లించేదట విజయరాణి. గుండె ఆగినంత పనవుతోంది కదా. అదే మరి, వడ్డీ క్యాన్సర్ అంటే. ఈ దెబ్బకి విజయరాణి కాదు కదా.. బడా పారిశ్రామికవేత్త అయినా తట్టుకోలేడు మరి. చేసిన అప్పులు తీర్చడానికి, విజయరాణి.. తనను నమ్ముకున్నవాళ్ళను నట్టేట్లో ముంచేయాలనే ప్లాన్ వేసిందన్నమాట.
20 లక్షల రూపాయలకి కోటి రూపాయల వడ్డీ కూడా విజయరాణి కట్టిందన్నది పోలీసుల వెర్షన్. ‘నేను మోసపోయాను.. ఎవర్నీ మోసం చేయాలనుకోలేదు..’ అంటూ కన్నీరుమున్నీరయ్యింది విజయరాణి. ఇది ఒక్క విజయరాణి గాధ మాత్రమే కాదు.. చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేక జీవితాల్ని నాశనం చేసుకుంటోన్నవాళ్ళు రాష్ట్రంలో లక్షలాదిమంది వున్నారు.
పరిమితికి మించి వడ్డీని వసూలు చేయడం నేరం. అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్న వ్యక్తిని బెదిరించకూడదన్న నిబంధన కూడా వుంది వడ్డీ వ్యాపారులమీద. అయినాసరే, అవన్నీ కేవలం నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. విజయరాణి ఉదంతం వెలుగు చూశాక అయినా ప్రభుత్వం ఈ తరహా ‘క్రైమ్’ని అరికట్టగలుగుతుందా.? అప్పు ` వడ్డీ ` క్యాన్సర్ అనే మహమ్మారిని సమాజం నుంచి తరిమికొడ్తుందా.? ఆ ఒక్కటీ అడక్కండి.