ఎమ్బీయస్‌ : వికె మూర్తి కెమెరా విన్యాసం – 1

గురుదత్‌ సినిమాలను యిష్టపడేవారు అతని సినిమాలలోని ఫోటోగ్రఫీని కూడా యిష్టపడతారు. ''ప్యాసా'' వంటి సినిమాల్లో ఫోటోగ్రఫీ కాని, నేపథ్యసంగీతం కాని ఒక మూడ్‌ను క్రియేట్‌ చేస్తాయి. అవన్నీ కలిసి మనను ఎక్కడికో తీసుకుపోతాయి. అందుకే…

గురుదత్‌ సినిమాలను యిష్టపడేవారు అతని సినిమాలలోని ఫోటోగ్రఫీని కూడా యిష్టపడతారు. ''ప్యాసా'' వంటి సినిమాల్లో ఫోటోగ్రఫీ కాని, నేపథ్యసంగీతం కాని ఒక మూడ్‌ను క్రియేట్‌ చేస్తాయి. అవన్నీ కలిసి మనను ఎక్కడికో తీసుకుపోతాయి. అందుకే ''ప్యాసా'', ''కాగజ్‌ కే ఫూల్‌'', ''సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌'' వంటి క్లాసిక్స్‌ విడుదలైన 50 ఏళ్ల తర్వాత కూడా విదేశాల్లో సైతం మన్ననలు పొందుతున్నాయి. గురుదత్‌ సినిమాలకు ఫోటోగ్రాఫర్‌గా పని చేసిన దాదా సాహెబ్‌ ఫాల్కే ఎవార్డు గ్రహీత వికె మూర్తి ఏప్రిల్‌ 7 న 91 వ యేట మరణించారు. ఏప్రిల్‌ 8 వ తారీకు వార్తాపత్రికల్లో ఆయన గురించి కొంత సమాచారం వచ్చింది. ''పాకీజా'' వంటి క్లాసిక్స్‌కు ఫోటోగ్రఫీ అందించిన విషయాలు రాశారు. పాఠకులు అది చదివే వుంటారన్న భావనతో ఆ వివరాల జోలికి వెళ్లకుండా గురుదత్‌కి ఆయనకు వున్న సంబంధం గురించి మాత్రం రాస్తాను. 

మూర్తి మైసూరులో 1923లో పుట్టారు. మెట్రిక్‌ పాసయ్యాక సినిమాల్లో నటుడిగా చేరదామనుకుని బొంబాయి స్టూడియోల చుట్టూ తిరిగారు. పని దొరకలేదు. 1941లో మద్రాసు వచ్చి వయొలిన్‌ నేర్చుకున్నారు. అంతలో క్విట్‌ ఇండియా ఉద్యమం వస్తే దానిలో పాల్గొని జైలుకి వెళ్లి 5 నెలలున్నారు. బయటకు వచ్చాక రామ్‌గోపాల్‌ అనే డాన్సర్‌ ట్రూపులో వయొలినిస్టుగా ఆరునెలల కాంట్రాక్టు లభించింది. 1946లో మద్రాసులో పాలిటెక్నిక్‌ యిన్‌స్టిట్యూట్‌లో ఫోటోగ్రఫీ కోర్సులో చేరి పాసయ్యారు. బొంబాయి స్టూడియోల్లో కెమెరా యూనిట్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నించి దొరకక, జీవనోపాధి కోసం కొన్ని సినిమా పాటలకు వయొలిన్‌ వాయించారు. కొన్నాళ్లకు ఫాలీ మిస్త్రీ అనే టాప్‌ కెమెరామన్‌ వద్ద అసిస్టెంటుగా వుద్యోగం దొరికింది. ఆయనతో లక్ష్మీ స్టూడియోస్‌ వదలి ఫేమస్‌ సినీ స్టూడియోకు వెళితే, మూర్తి ఆయనను అనుసరించారు. ఆ రోజుల్లో స్టూడియోలు వీళ్లకు స్టూడియోలు నెలజీతాలు యిచ్చేవి. ఎవరైనా నిర్మాత, తన ఫోటోగ్రాఫర్‌ను తెచ్చుకుంటే స్టూడియో కెమెరాలతో బాటు కెమెరా అసిస్టెంట్లను కూడా తోడుగా యిచ్చేది. 

గురుదత్‌ ''బాజీ'' (1951) సినిమా షూట్‌ చేయడానికి ఫేమస్‌ స్టూడియో ఎంచుకున్నాడు. అతని ఫోటోగ్రాఫర్‌ వి. రాత్రాకు స్టూడియో తరఫున మూర్తి అసిస్టెంటుగా పనిచేశాడు. ఆ సినిమాలో చాలా క్లిష్టమైన షాట్‌ ఒకటి గురుదత్‌ ప్లాన్‌ చేశాడు. 'సునో గజరియా గాయ్‌'' పాట ఒక బార్‌లో చిత్రీకరించారు. హీరో దేవ్‌ ఆనంద్‌ డాన్స్‌ ఫ్లోర్‌కు ఎదురుగా నిలబడి క్రమంగా వేదిక వద్దకు వెళ్లి, వాళ్లను చూస్తూ ముందువరసలో వున్న కుర్చీలో కూర్చుంటాడు. ఈ కదలికలన్నీ ఒక్క షాట్‌లో కట్‌లు లేకుండా రావాలి. అది కూడా దేవ్‌ నెత్తిమీద వున్న అద్దంలోంచి టాప్‌ యాంగిల్‌ నుండి కెమెరా కన్ను చూస్తూ క్రమంగా కిందకు యాంగిల్‌ మార్చుకుంటూ దేవ్‌ను అనుసరిస్తూ వెళ్లి వేదికపై డాన్సర్లందరినీ కవర్‌ చేస్తూ చివరకు దేవ్‌పై క్లోజ్‌ షాట్‌తో ఆగాలి. ఈ ట్రాకింగ్‌ అండ్‌ ట్రాలీ షాట్‌ తీయాలంటే బరువైన కెమెరాను భుజాన వేసుకుని పరుగులు పెట్టుకుంటూ తీయాలి. రాత్రా స్థూలకాయుడు. అందుకని యీ పని మూర్తికి అప్పచెప్పాడు. అతను చక్కగా నిర్వహించాడు. గురుదత్‌ అతన్ని బాగా మెచ్చుకున్నాడు. ఆ సినిమా రషెస్‌ చూస్తూండగానే మూర్తి పనితనం అతన్ని ఆకట్టుకుంది. అంతే తర్వాతి సినిమా ''జాల్‌''కు అతన్ని ఫోటోగ్రాఫర్‌గా నియమించుకున్నాడు. అప్పట్లో సినిమాలన్నీ స్టూడియోల్లో తీసేవారు. దానికి భిన్నంగా ''జాల్‌'' బొంబాయి, గోవాలకు మధ్య రత్నగిరి తీరంలో సహజవాతావరణంలో తీశారు. అది హిట్‌ అయింది. మూర్తితో గురుదత్‌కు వ్యక్తిగత బంధం ఏర్పడింది. ఇక అక్కణ్నుంచి గురుదత్‌ సినిమాలన్నిటికీ అంటే – ''బాజ్‌'' (1953), ''ఆర్‌ పార్‌'' (1954), ''మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55'' (1955), ''సిఐడి'' (1956), ''శైలాబ్‌  (1956), ''ప్యాసా'' (1957), ''12 ఓ క్లాక్‌'' (1958), ''కాగజ్‌ కే ఫూల్‌'' (1959), ''సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌'' (1962), లకు వికె మూర్తియే ఫోటోగ్రాఫర్‌.  

1960 నాటి ''చౌధ్‌వీ కా చాంద్‌'' సినిమాకు ఫోటోగ్రాఫర్‌ నారిమన్‌ ఎ. ఇరానీ అయినా రెండు కలర్‌ సాంగ్స్‌ (వాటిలో చౌధ్‌వీ కా చాంద్‌ హో, యా అఫ్‌తాబ్‌ హో – ఒకటి) మాత్రం వికె మూర్తి చిత్రీకరించారు. దానికి కారణం సినిమా తీసే సమయానికి మూర్తి ఆ సమయానికి యూరోప్‌లో వుండడం. 1960ల నాటికి కలర్‌ సినిమాల యుగం ప్రారంభమవుతోందని గ్రహించిన గురుదత్‌ ఆ రకమైన ఫోటోగ్రఫీలో తర్ఫీదు పొందడానికై మూర్తిని తన ఖర్చులపై యూరోప్‌ పంపాడు. ''గన్స్‌ ఆఫ్‌ నవరోన్‌'' (1961) సినిమా గ్రీస్‌లో తయారవుతోంది. దాని ఫోటోగ్రాఫర్‌ ఆస్వాల్డ్‌ మోరిస్‌. ఆ టీములో మూర్తి చేరారు. టీములో యితర సభ్యులకు మూర్తి గురించి పెద్దగా తెలియదు. ఏదో సాధారణ ఫోటోగ్రాఫర్‌ కాబోలు అనుకున్నారు. ఓ రోజు గురుదత్‌ నుండి టెలిగ్రాం వచ్చింది – ''కంగ్రాట్స్‌. నీకు ''కాగజ్‌ కే ఫూల్‌'' సినిమా ఫోటోగ్రఫీకై 1960 ఫిల్మ్‌ఫేర్‌ ఎవార్డు వచ్చింది.'' అని. అప్పుడు ఓహో యీయన యింతటి ఘనుడా అనుకున్నారు వాళ్లు. ''కాగజ్‌ కే ఫూల్‌'' సినిమా భారతదేశంలోనే తొలి సినిమాస్కోప్‌ సినిమా. గురుదత్‌ 1958లో ట్వంటియత్‌ సెంచరీ ఫాక్స్‌ వారి నుండి సినిమాస్కోప్‌ కాపీరైట్‌ లైసెన్సు తీసుకుని ఆ సినిమా తీశాడు. దేశంలో అన్ని థియేటర్లలోను సినిమాస్కోప్‌లో ప్రదర్శించే సౌకర్యం అప్పట్లో లేదు కాబట్టి 35 ఎంఎంలో కూడా కొన్ని ప్రింట్లు తీశారు. ఫిల్మ్‌ ఫేర్‌ ఎవార్డు గెలుచుకునేటంతటి స్థాయిలో ''కాగజ్‌ కే ఫూల్‌'' రూపొందడానికి వెనక ఒక కథ వుంది. 

గురుదత్‌ స్వతహాగా చాలా మంచివాడు, సహచరులతో చిన్నా పెద్దా భేదం లేకుండా కలిసిపోతాడు. కానీ అతనితో పని చేయడం చాలా కష్టం. చాలా మూడీ ఫెలో. ఎప్పుడు ఏ సినిమా మొదలుపెడతాడో, ఎప్పుడు మధ్యలో మానేస్తాడో తెలియదు. షూటింగుకి వచ్చాక ఓపెనింగ్‌ షాట్‌కి సరైన యాంగిల్‌ అతనికి స్ఫురించకపోతే 'ప్యాకప్‌' అనేస్తాడు. మర్నాడు మళ్లీ అక్కడికే వచ్చి ప్రయత్నిస్తాడు. తన నటనపై తనకు నమ్మకం లేదు. అయినా తగిన హీరో దొరక్క తనే కథానాయక పాత్రలు వేసేవాడు. అందరూ బాగుందన్నా తన నటన తనకు తృప్తి నివ్వకపోతే సీను మళ్లీ తీద్దామనేవాడు. డైలాగులు మర్చిపోయేవాడు. టేకులపై టేకులు తినేవాడు. కోపిష్టి. చికాకు చూపేవాడు. మర్నాడు క్షమాపణ చెప్పేవాడు. అతని పెర్‌ఫెక్షన్‌ తక్కినవారికి విసుగు తెప్పించినా సినిమాల పట్ల అతనికున్న అంకితభావం చూసి ఎవరూ ఫిర్యాదు చేసేవారు కాదు. సాటి నటులకైతే ఆ యా దృశ్యాల వరకే సంబంధం వుంటుంది. కానీ కెమెరామన్‌ సినిమా తీసినంతకాలం అతనితో వేగవలసిందే. అయితే మూర్తి గురుదత్‌ అంటే ఎప్పుడూ చికాకు పడలేదు. అతను 'ఓకే' అనేంతవరకు ఓపిగ్గా పనిచేస్తూనే వుండేవాడు. అంతేకాదు, ఒక సినిమా విషయంలో గురుదత్‌ ఓకే అన్నా యీయన ఓకే అనలేక బాధపడ్డాడు. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]