పేరు : కున్వర్ నట్వర్ సింగ్
దరఖాస్తు చేయు ఉద్యోగం: వివాదస్పద చరిత్ర కారుడు. (ఉత్త చరిత్ర కారులెవ్వరూ చరిత్రలో నిలవరు. వివాదస్పదమయితేనే కాల గుర్తుపెట్టుకుంటుంది.) అందుకే ‘స్వీయ చరిత్ర’ రాశాను. ఇందులో నా గురించి తప్ప అందరి గురించీ రాశాను. ముఖ్యంగా నెహ్రూ` గాంధీ కుటుంబ చరిత్రతోనే పేజీలు నింపాను. వీరిగురించి రాయాలంటే ‘ఒక జీవితం సరిపోదు’ అందుకే నా పుస్తకానికి ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ అని పేరు పెట్టాను.
ముద్దు పేర్లు : ‘నట్టు’ లూజ్ సింగ్.( నన్ను ఏ పదవిలో బిగించినా నిలవను. అది అధికార పదవి కావచ్చు, మంత్రి పదవి కావచ్చు. అంతే కాదు. నా మాట, రాత కూడా ఒక చోట నిలవదు. కావాలంటే, నా స్వీయచరిత్ర చదవండి.)
‘విద్యార్హతలు : అందరూ ‘ఇండియన్ ఫారిన్ సర్వీస్’ (ఐఎఫ్‌ఎస్) చేశానంటారు. చేసిన మాట వాస్తవమే కానీ, అంతకు మించి, గొప్ప సర్వీస్ చేశాను. అదే ‘ఐజిఎస్’ ( ఇండియన్ ‘గాంధీస్’ సర్వీస్). ఆ అనుభవంతోనే ఈ పుస్తకాన్ని రాశాను.
హోదాలు : ఏ హోదా చెబుదామన్నా చివర ‘మాజీ’ తగిలించాల్సి వుంటుంది.(మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ సివిల్ సర్వెంట్.) మాజీ లేని హోదా ఇన్నాళ్ళకు సాధించాను. అదే రచయిత హోదా. తర్వాత పుస్తకాలు రాయక పోయినా సరే, ఎవరూ ‘మాజీ రచయిత’ అని పిలవరు.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ఏ పదవినీ పూర్తి పదవీ కాలం పాటు చేయను. నా ‘ఐఎఫ్‌ఎస్’ తో పాటు. మంత్రి పదవులు కూడా అంతే.
రెండు: నెహ్రూ` గాంధీ కుటుంబానికి ఎప్పుడూ భక్తుణ్ణే. కడకు సోనియా గాంధీ మీద నేను నా పుస్తకంలో రాసిన అంశాలు కూడా భక్తితో రాసినవే. భక్తిలో ‘వైరి భక్తి’ అని ఒకటి వుంటుంది కదా! భగవంతుణ్ని భక్తుడు తిట్లతో కొలుస్తాడు. అది అన్నమాట.
సిధ్ధాంతం : నాకు నచ్చిందే నా సిధ్ధాంతం. లేకుంటే రాధ్ధాంతమే.
వృత్తి : సంజయ్ బారు వృత్తీ, నా వృత్తీ ఒకటే. ఎవరి కొలువులో పనిచేశామో, వారి గురించే తప్ప, మరెవరి గురించీ వ్యతిరేకంగా మాట్లాడం.
హాబీలు :1.గ్రూపులు కట్టటం, పార్టీలు పెట్టటం.(పి.వి.నరసింహారావు ప్రధాని గా వున్నప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా ఎన్.డి.తివారీ, అర్జున్ సింగ్‌లతో గ్రూపూ కట్టాను. ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్(తివారి) అనే పార్టీ కూడా పెట్టించాను. మళ్ళీ ఈ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశామనుకోండి. అది వేరే విషయం.
2. ‘కామి కాని వాడు మోక్షకామి కాదంటా’రు. నా విషయంలో ఈ సామెతను మార్చుకోవాల్సి వుంటుంది. ‘స్కామి( స్కాములో ఇరుకున్నవాడు) కాని వాడు అధికారకామి కాలేడు’. అందుకనే ‘ఇరాక్ చమురు స్కాము’లో ఇరుక్కున్నాను. అఫ్ కోర్స్. బయటకూడా పడ్డాను.
అనుభవం : ‘యూజ్ అండ్ త్రో’ అన్నది ఏ పార్టీలో అయినా, అమలు లో వున్న విధానమే. కాక పోతే కొన్ని పార్టీలు కాస్త ఉదారంగా వుంటాయి. ‘యూజ్ నౌ’ (ఇప్పుడు వాడుకుని) ‘త్రో లేటర్’( తర్వాత విసిరేయ్) అనే విధానం అవలంభిస్తాయి. వెంటనే నెట్టివేయవు. కాంగ్రెస్ అలాంటి ఉదారం చూపే పార్టీ. కాబట్టే ఉండగలిగాను. కానీ నేను స్కాంలో ఇరుక్కున్న వెంటనే, ‘నన్ను ఏకాకి’కిని చేసి పార్టీ తప్పుకుంది.
మిత్రులు : నేను మిత్రుణ్ణే. కాబట్టే రహస్యాలను దశాబ్దాల పాటు దాచి వుంచగలిగాను. కానీ ఏదో ఒక నాడు చెప్పక తప్పదు కదా` కాబట్టే పుస్తకంలో బయిట పెట్టాను. 2004లో సోనియాను ప్రధానిని కానివ్వకుండా అడ్డుకున్నది రాహుల్ గాంధీయేనన్న విషయం చెప్పాను. అది కూడా ఆయనకు తల్లి మీద వుండే అపారమైన ప్రేమతోనేనని కూడా రాశాను.
శత్రువులు : ఇంతవరకూ లేరు కానీ, ఇప్పుడు పెరుగుతారు. కావాలంటే మీరు కూడా స్వీయ చరిత్ర రాసి చూడండి. మన్‌మోహన్ వివరాలు బయట పెట్టిన సంజయ్ బారు కు శత్రువులు పెరగలేదా? అలాగన్న మాట.
మిత్రశత్రువులు : కాంగ్రెస్ ను తిడితే చాలు, నాకు ప్రోత్సాహం ఇస్తామంటూ వస్తారే… వారే మిత్ర శత్రువులు. అందుకే వారిమీద ఒక కన్నేసి వుంచుతాను.
వేదాంతం : వ్రతం చెడ్డా ఫలం దక్కనప్పుడు ఎవరికయనా వేదాంతం వస్తుంది. నా రాజకీయజీవితంలో ఎప్పుడూ ఇలాగే జరిగేది. ఇప్పుడు కూడా ఇలాగే జరిగిపోతుంది.
జీవిత ధ్యేయం : కాంగ్రెస్ లో నాలాంటి వాళ్ళకు వుండే కోరిక ఎప్పుడూ ఒక్కటే ప్రధాని కావాలని. కానీ, శంకర్ దయాళ్ శర్మకు వచ్చినట్టు వయసుడిగిపోయిన తర్వాత వస్తుందన్నదే భయం. పీవీ నరసింహారావును ప్రధానిగాప్రతిపాదించే ముందు సోనియా, శర్మనే ఆడిగారు. కానీ ఆయనకు అప్పటికే వయసు మీరి పోయింది.
-సర్