బ్రెగ్జిట్‌.. ఇంకో ఛాన్స్‌.!

యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగే దిశగా ఇప్పటికే బ్రిటన్‌ వాసులు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు కుదేలైపోయాయి. భారతదేశానికీ ఈ దెబ్బ గట్టిగానే తగిలింది. బ్రిటన్‌ ప్రధాని డేవిడ్ కేమరూన్‌…

యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగే దిశగా ఇప్పటికే బ్రిటన్‌ వాసులు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు కుదేలైపోయాయి. భారతదేశానికీ ఈ దెబ్బ గట్టిగానే తగిలింది. బ్రిటన్‌ ప్రధాని డేవిడ్ కేమరూన్‌ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన బ్రెగ్జిట్‌కి వ్యతిరేకంగా నినదించగా, ఆయనకు వ్యతిరేకంగా బ్రిటన్‌ ప్రజలు బ్రెగ్జిట్‌కి మద్దతు పలికారు. దాంతో, నైతిక బాధ్యత వహిస్తూ బ్రిటన్‌ ప్రధాని రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన విషయం విదితమే. 

ఇంత జరిగాక ఇప్పుడు కొత్తగా బ్రెగ్జిట్‌పై బ్రిటన్‌ వాసుల్లో పునరాలోచన షురూ అయ్యింది. అసలు ఇది సాధ్యమేనా.? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని ప్రజలు వ్యతిరేకించే అవకాశం మన దేశంలో అయితే లేనే లేదాయె. అలాంటిది బ్రిటన్‌లో, ప్రజాభిప్రాయ సేకరణకు ఓ సారి అవకాశం కలిగింది. దాన్ని పక్కన పెట్టి ఇంకోసారి ఛాన్స్‌ ఇవ్వాలని బ్రిటన్‌ వాసులు కోరుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? 

మనది చాలా పెద్ద, గొప్ప ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటుంటాం. కానీ, ఏదీ.. ఎక్కడ.? అమెరికాతో అణు ఒప్పందం, భారతదేశంలో ఎవరూ హర్షించలేదు. అధికార బలంతో యూపీఏ సర్కార్‌ ఆ పని చక్కబెట్టేసింది. నరేంద్రమోడీ తక్కువేమన్నా తిన్నారా.? ఆయనా, తనకు నచ్చిన పనులు చేసుకుపోతున్నారు. ప్రాజెక్టులు కట్టే విషయంలోనూ, ఇతర దేశాలతో ఒప్పందం విషయంలోనూ పార్లమెంటే సుప్రీం మన దేశంలో. ఆ పార్లమెంటుని ఎవరు నడిపిస్తే, వారే కింగ్‌. 

పాలకులు తీసుకునే నిర్ణయాల్ని ప్రజలు సవాల్‌ చేయగలగడం అనేది అన్ని సందర్భాల్లోనూ కాకపోయినా, చాలా చాలా సందర్భాల్లో గొప్ప విషయం. ప్రజలే దేవుళ్ళు.. అని మన దేశంలో రాజకీయ నాయకులు గొప్పలు చెబుతారు. కానీ, గుడినీ, గుడిలో లింగాల్నీ మింగేసే మొనగాళ్ళు మన రాజకీయ నాయకులు. ఆ విషయం దేశ ప్రజానీకానికి బాగా తెలుసు. అందుకే, బ్రెగ్జిట్‌పై బ్రిటన్‌లో పరిస్థితుల్ని దేశ ప్రజానీకం ఆసక్తిగా తిలకిస్తోంది. 

బ్రెగ్జిట్‌ విషయంలో తాము చేసింది తప్పని, ప్రస్తుతం బ్రిటన్‌లోని మెజార్టీ ప్రజానీకం గుర్తించింది. తొందరపడ్డామని తెలుసుకుంది. అందుకే, ఇంకోసారి రిఫరెండమ్‌ కోసం కోరుతోంది. బ్రిటన్‌ పార్లమెంటులో వుందిప్పుడు బంతి. బ్రిటన్‌ పార్లమెంటు ప్రజాభిప్రాయ సేకరణ మళ్ళీ జరపాలని నిర్ణయం తీసుకుంటే, బ్రెగ్జిట్‌ వివాదానికి కొత్త ముగింపు లభించే అవకాశముంది. ఈ తాజా ప్రయత్నం విజయవంతమవ్వాలని ఇప్పుడు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.. భారతదేశంతో సహా.