హత్య జరిగింది. చేసినవాడు వేరేవారి ఆదేశాలపై చేశాడు. హతుడిపై అతనికి వ్యక్తిగతమైన కక్ష లేదు. అలాటి పరిస్థితుల్లో అతన్ని హంతకుడిగా పరిగణించి ఉరిశిక్ష వేయాలా? లేక కేవలం ఆయుధంగా లెక్కవేసి చిన్నపాటి శిక్షతో సరిపెట్టాలా?
యుద్ధం జరిగింది. సైనికుడికి శత్రుదేశానికి చెందిన సైనికుడితో వైరం ఏమీ లేదు. అయినా రాజాజ్ఞ. చంపివేశాడు. శిక్ష లేకపోగా మెప్పు కూడా.
హిట్లర్ కాలంలో యూదులపై హననకాండ సాగించారు. జాతి మొత్తంగా నిర్మూలిద్దామని చూశారు. రకరకాల దారుణకృత్యాలు సలిపారు. ఆ పనికై ప్రత్యేకంగా తయారుచేసిన దళం పేరు ఎస్‌ఎస్. ఆ దళానికి ఆదేశాలిచ్చినవాడు హిట్లర్. అమలు చేసినది సామాన్యమైన మనుషులతో కూడిన ఎస్‌ఎస్ దళాలు. హిట్లర్ నేరాలకు వీరికి శిక్ష వేయాలా వద్దా? వేస్తే ఏ మేరకు? వారిలో నిర్ణయాత్మకమైన పదవుల్లో వున్న ప్రముఖ నాయకులకు కఠినశిక్షలు పడాలనుకున్నా, ఆ దళంలో చిన్న వుద్యోగం చేసిన ఏ కాపలాదారుకో కూడా పడాలా? ఇదీ ప్రస్తుతం సభ్యసమాజం జవాబివ్వవలసిన ప్రశ్న. దీనికి గత శుక్రవారం జర్మన్ కోర్టు సమాధానం యిచ్చింది.
నాజీ పాలనలో పోలండులోని ఆస్క్విజ్ అనే క్యాంపులో 13 లక్షల మంది యూదులను చిత్రహింసలకు గురి చేశారని, నాలుగేళ్లల్లో 11 లక్షల మందిని చంపేశారని లోకవిదితమే. ఆ హింసలో పాలుపంచుకున్నవారిపై న్యాయవిచారణ జరిపి శిక్షలు వేసే ప్రక్రియ 70 ఏళ్లగా కొనసాగుతోంది. ఇప్పుడది చివరి ఘట్టంలో వుంది. ప్రస్తుతం విచారణ ఎదుర్కుంటున్న ఆఖరి బ్యాచ్ నాజీలలో 94 ఏళ్ల రెయిన్‌హోల్డ్ హేనింగ్ ఒకడు. అతను 1943 జనవరి నుంచి 1944 జూన్ వరకు ఆ క్యాంపులో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఆ కాలంలో 1.70 లక్షల మంది యూదులు మరణించారు. ఆ మరణకాండలో పాలు పంచుకున్నాడంటూ తూర్పు జర్మనీలోని డెట్‌మోల్డ్ నగరంలో అతనిపై విచారణ జరుగుతోంది. అతనికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యం చెప్పడానికి వర్జీనియా నుంచి ఐరీన్ వెస్ అనే 85 ఏళ్ల హంగేరియన్ వృద్ధురాలు వచ్చింది. 13 ఏళ్ల వయసులో ఆమె ఆ క్యాంపులో ఖైదీగా వుండేది. ఆ క్యాంపులో బాధలు పడినా ప్రాణాలు దక్కించుకున్న కొందరిలో ఆమె కూడా ఒకతె. ఫిబ్రవరి నెలాఖరులో కోర్టుకి వీల్ ఛెయిర్‌లో వచ్చిన హేనింగ్‌ను ఆమె గుర్తు పట్టలేదు. ఆమెయే కాదు ప్రాసిక్యూషన్ సాక్షుల్లో ఎవరూ అతన్ని గుర్తు పట్టలేదు. అయినా తలచుకుంటే అతన్ని కోర్టు శిక్షించగలదు. ఎస్‌ఎస్‌లోని ఉన్నతాధికారులనే కాదు, ఆ దళంలో చిన్నాచితకా వుద్యోగాలు వెలగబెట్టిన హేనింగ్ వంటి అనామకులను కూడా ఆ హాలోకాస్ట్‌కు బాధ్యుల్ని చేయగలదు. ఆ మేరకు జర్మనీలో చట్టాలు యిటీవల సవరించారు.
రెండవ ప్రపంచయుద్ధంలో మిత్రదళాలు (ఎల్లయిస్) జర్మనీని యుద్ధంలో ఓడించాక 1945లో జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో యుద్ధనేరాలకై విచారణ ప్రారంభించారు. అవి నాలుగేళ్లపాటు జరిగాయి. నాజీలు, ముఖ్యంగా ఎస్‌ఎస్ దళసభ్యులందరూ ఓ పట్టాన దొరకలేదు. హిట్లర్ ఓడిపోతున్నాడన్న సంకేతాలు కనబడగానే చాలామంది చేజిక్కిన యూదు బంగారం, ఆస్తులు పట్టుకుని యితర దేశాలకు పారిపోయారు. ఆ డబ్బు లంచంగా చూపి ఆ దేశాల పౌరసత్వం కొనుక్కున్నారు. వేషం మార్చుకుని, పేరు మార్చుకుని అక్కడే స్థిరపడిపోయారు. కొన్నాళ్లకు మారుపేర్లతో మళ్లీ జర్మనీ వచ్చి చేరారు. వీళ్లని వెతికి పట్టుకోవడం జర్మన్ పోలీసులకు పెద్ద పని ఐపోయింది. వీరిపై కక్ష కట్టిన యూదులు తమకై ఇజ్రాయేలు దేశం ఏర్పరచుకున్నాక, తమ గూఢచారి సంస్థ ద్వారా వీళ్ల ఆచూకీ కనిపెట్టి న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టడం తన కర్తవ్యంగా భావించింది. ఈ గాలింపు, యీ వేట దశాబ్దాలుగా సాగుతూనే వచ్చింది. ఈ లోపునే జర్మనీ తూర్పు, పశ్చిమ దేశాలుగా విడిపోయింది. రష్యా ప్రభావంతో కమ్యూనిస్టు దేశంగా మారిన తూర్పు జర్మనీలో జరిగిన విచారణలలో రాజకీయపరమైన అంశాలు ఎక్కువగా ప్రాధాన్యత వహించాయి. మిత్రదళాల ప్రభావంతో ప్రజాస్వామ్యానికి కట్టుబడిన పశ్చిమ జర్మనీ సమాజంలో నాజీప్రభావాన్ని సమూలంగా నిర్మూలించాలనే (డీనాజిఫికేషన్) పట్టుదలతో న్యాయపరమైన అంశాలపై ఎక్కువగా దృష్టి సారించింది.
అవిభక్త జర్మనీ జనాభా 8 కోట్లయితే, దానిలో 10% అంటే 80 లక్షల మంది నాజీ పార్టీలో సభ్యులని అంచనా. వాళ్లు అన్ని రంగాలలో వున్నారు. అంటే కోర్టులో న్యాయం చెప్పవలసిన న్యాయమూర్తుల్లో కూడా నాజీ సిద్ధాంతాలను విశ్వసించిన వారుంటారు కాబట్టి, వారు నాజీ అక్రమాల పట్ల మెతకగా వ్యవహరిస్తారని కొత్త జర్మన్ ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. 1954లో జీనోసైడ్ (జాతిహననం) నేరాలకై ప్రత్యేకంగా ఏర్పరచిన చట్టాన్ని వీరు సరిగ్గా ఉపయోగించటం లేదన్న సందేహంతో యుద్ధసమయంలో జరిగే హత్యలను కూడా మామూలు హత్యల్లా పరిగణించాలనే నిర్ణయం తీసుకుంది. మామూలు హత్య అనగానే హతుడిపై హంతకుడికి వ్యక్తిగతమైన వైరం వుందని నిరూపించవలసిన భారం ప్రాసిక్యూషన్‌పై పడుతుంది. అది వారికి తలకు మించిన భారం. ఈ కష్టాన్ని గుర్తించి నాజీనేరాల విచారణ ఎలా సాగుతోందో పర్యవేక్షించడానికి జర్మన్ ప్రభుత్వం లుడ్విస్‌బర్గ్‌లో 1958లో ఒక కార్యాలయం నెలకొల్పింది. ఆస్క్విజ్‌లో పనిచేసిన ద్వితీయ, తృతీయ శ్రేణి ఎస్‌ఎస్ అధికారుల్లో 22 మందిని 1963-65 మధ్య ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన విచారణకు హాజరయ్యేట్లు ఆ కార్యాలయం చూసింది. నిందితుల్లో చాలామంది తాము ఉద్యోగధర్మంగా పై అధికారుల ఆజ్ఞల మేరకే పనిచేశామని, తమ తప్పేమీ లేదని వాదించారు. ఆ వాదన వుపయోగించి ఖైదీలను కాల్చి చంపినవారు కూడా తప్పించుకున్నారు. చివరకు 22 మందిలో పరమ శాడిస్టులైన 17 మందిపై మాత్రమే కేసు నిలిచింది. ఆరుగురికి యావజ్జీవ ఖైదు శిక్ష పడింది. తక్కినవారికి 3 నుంచి 14 సం||ల శిక్ష పడింది.
నాజీ అక్రమాలు యితర దేశాల్లో కూడా జరిగాయి. వారు కూడా విచారణలు జరిపించారు. ఆస్క్విజ్ క్యాంపులో పనిచేసిన ఎస్‌ఎస్ దళ సభ్యులలో వెయ్యి మందిని వారు విచారణకు రప్పించగలిగారు. ఆ క్యాంపులో పనిచేసిన వారి సంఖ్య అవిభక్త జర్మనీలో 6-7 వేల మంది వుందని అంచనా కానీ వారిలో సగం మందిని కూడా జర్మనీ విచారణకు రప్పించలేకపోయింది. కావాలని వాళ్లను వదిలేస్తున్నారని జర్మనీపై ఆరోపణలు వచ్చాయి. అందువలన ఎక్కువ మందిని కోర్టుకి రప్పించాలనే లక్ష్యంతో 2000 సం||లో ఒక నిర్ణయం తీసుకున్నారు. యూదులను బాధలు పెట్టిన క్యాంప్‌లలో టీ అందించిన వాడినైనా సరే పట్టుకుని శిక్ష పడేట్లా చేయాలని! నిజానికి యిది 1960లలోనే ప్రిట్జ్ బావర్ అనే అటార్నీ జనరల్ సూచించాడు. అతను యూదుడు, కాన్సన్ట్రేషన్ క్యాంపు బాధితుడు. అతని సలహాను 40 ఏళ్ల తర్వాత అమలు చేశారు. దాని ప్రకారం సోబిబార్ డెత్ క్యాంపులో పని చేసిన జాన్ అనే ఉక్రెనియన్ గార్డుకు 2011లో శిక్ష పడింది. ఆస్క్విజ్‌లో పద్దులు రాసిన ఒకతనికి 2015లో శిక్ష పడింది. ఇంకా కొంతమందిని పట్టుకున్నారు కానీ వాళ్లెవరికీ కోర్టులో నిలబడే, లేదా కూర్చునే ఓపిక కూడా లేదు. కోర్టు పిలుపు వచ్చేలోపునే ఒకతను చనిపోయాడు.
హేనింగ్ విషయానికి వస్తే అతను 1921లో పుట్టాడు. 14 వ యేట బడి వదిలి ఫ్యాక్టరీలో పనిచేశాడు. 1935లో హిట్లర్ యువసేనలో చేరాడు. ఎస్‌ఎస్‌వారి సాయుధదళం వాఫెన్ ఎస్‌ఎస్‌లో 1940లో చేరాడు. రష్యాలోని కీవ్‌లో యుద్ధంలో పనిచేసేటప్పుడు అతనికి గ్రెనేడ్ ముక్కలు గుచ్చుకుని గాయపడ్డాడు. అందువలన యుద్ధరంగం నుంచి వెనక్కి పంపించేసి ఆస్క్విజ్ క్యాంపులో 1942లో గార్డుగా వేశారు. ఎవరు ఏ రోజున ఎంతమంది వచ్చారో, ఏ ఖైదీలను ఏ డ్యూటీకి పంపారో రాయడం అతని పని. కొన్నాళ్లు పోయాక ఒక గార్డ్ టవర్‌లో సెంట్రీగా వున్నాడు. ఖైదీల్లో ఎవరిని ఎప్పుడు గ్యాస్ ఛాంబర్‌కు పంపాలో, ఎవరి చేత ఏ పని చేయించాలో నిర్ణయించే పని అతనిది కాదు. అతని చేతులతో అతనెవరినీ శిక్షించలేదు. అయినా అతన్ని ముద్దాయిగా నిలబెట్టారు. ''యూదులను చంపేస్తున్నారని నీకు తెలుసా?'' అని విచారణలో అడిగారు. ''మొదట్లో తెలియదు. ఎవరూ ఎవరితో యీ విషయాలపై మాట్లాడేవారు కారు. కానీ కొన్నాళ్లు వున్నాక ఏం జరుగుతోందో తెలిసింది. కానీ అపే శక్తి మాకు లేదు.'' అని జవాబిచ్చాడు హేనింగ్.
సాక్షిగా వచ్చిన ఐరీన్‌ను 1944 మేలో క్యాంపుకు వచ్చినపుడు ఏం జరిగిందో తనకు గుర్తున్నంత మేరకు చెప్పమన్నారు. ''హంగరీ యూదు కుటుంబానికి చెందిన మమ్మల్ని ఆస్క్విజ్‌కు తీసుకుని వచ్చాక ఒక గార్డు ఓ కర్ర పట్టుకుని ఎవర్ని ఎటువైపు పంపాలో చూపించాడు. మా అమ్మ, తమ్ముళ్లు, చెల్లెళ్లను ఒక వైపు పంపాడు, వాళ్లను వెంటనే చంపేశారు కాబోలు. మా నాన్న, అన్నలను వేరేవైపుకి పంపాడు. వాళ్ల చేత పనులు చేయించుకున్నంతకాలం చేయించుకుని రక్తమాంసాలు హరించాక అప్పుడు చంపివేశారు కాబోలు. గార్డు నా విషయంలో గందరగోళానికి లోనయ్యాడు. 14 ఏళ్ల కంటె తక్కువ వయసున్నవాళ్లను గ్యాస్ ఛాంబర్‌కు పంపాలి, ఎక్కువైతే పనికి పంపాలి. నా వయసు పదమూడే ఐనా కోటు, అదీ వేసుకోవడంతో పెద్దదానిలా కనిపించి పనికి పంపాడు. ఆ విధంగా చావు తప్పించుకున్నాను.'' అంది. ఆ నాటి గార్డు యితనేనా అని హేనింగ్‌ను చూపిస్తే 'నాకు గుర్తు లేదు' అంది. ''నా కుటుంబసభ్యులు 22 మంది క్యాంపులో చనిపోయారు. దూరపు బంధువులు న్యూయార్క్‌లో వుంటే అక్కడకు వల వెళ్లిపోయాను.'' అని చెప్పింది.
విచారణ జరుగుతూండగా ఏప్రిల్ 29 న హేనింగ్ తన నోరు విప్పాడు. ''ఒక నేరవ్యవస్థలో భాగమైనందుకు నేను సిగ్గుపడుతున్నాను. నా కళ్లెదురుగా అన్యాయం జరుగుతోందని తెలిసినా దాన్ని నివారించడానికి ఏమీ చేయలేకపోయినందుకు క్షమించమని కోరుతున్నాను.'' అన్నాడు. కానీ గత శుక్రవారం జూన్ 17న తీర్పు యిచ్చిన జడ్జి అతన్ని క్షమించలేదు. ఐదేళ్ల కారాగార శిక్ష వేశారు. ''నువ్వు ఆ క్యాంపులో రెండున్నరేళ్లపాటు ముఖ్యమైన పదవిలో వున్నావు. ఆనాటి హింసలో భాగమయ్యావు. నువ్వు దాన్ని ఆపలేవన్న మాట నిజమే. కానీ తలచుకుంటే ఉద్యోగం మారి వుండవచ్చు. ఈ క్యాంపు వుద్యోగం మానేసి యుద్ధరంగానికి వెళ్లి వుండాల్సింది'' అందామె. గాయపడడం చేత యుద్ధరంగం నుంచి వెనక్కి పంపేశారన్న మాట ఆమెకు గుర్తు లేదో, నమ్మలేదో తెలియదు. హేనింగ్ నోరు విప్పలేదు. ఏ విధంగానూ స్పందించలేదు. 94 ఏళ్ల వయసులో ఐదేళ్ల పాటు జైల్లో వుండడం ఎలా అని ఆలోచిస్తున్నాడేమో!
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2016)