వ్యాపార రంగంలో….చందన బ్రదర్స్, బొమ్మన, ఆర్ ఎస్, ఇలా..
రాజకీయాల్లో…జెసి బ్రదర్స్, ఆనం బ్రదర్స్
సినిమా రంగంలో…మెగా బ్రదర్స్..పరుచూరి బ్రదర్స్
అసలు బ్రదర్ అన్న పదం పలకగానే గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు. ఆయన ఎవరినైనా బ్రదర్ అనే పిలిచేవారు. రండి బ్రదర్..ఎలా వున్నారు బ్రదర్..అంటూ. పరుచూరి బ్రదర్స్ కు ఆ నామకరణం చేసిందీ ఆయనే. తన సోదరుడు త్రివిక్రమ రావును చేరదీసి, తనతో పాటు నిర్మాణ రంగంలో పైకి తెచ్చిందీ ఆయనే. త్రివిక్రమరావు పిల్లలు హీరోలుగా మారడం వెనక ఎన్టీఆర్ సహకారం కూడా ఆరోజుల్లో ఎంతో వుంది…కానీ…
వంశం..బ్లడ్..మడమతిప్పని వైనం లాంటి వ్యవహారాలుచెప్పే నందమూరి వారసుల మాత్రం బ్రదర్స్ అన్న పదం ఎక్కడా వినిపించరు..మా వంశం అన్న డైలాగులు వుంటాయి కానీ, మా కుటుంబం అన్న మాట వినిపించదు..రామ్ చరణ్ మాత్రం ఓ సినిమాలో నా వాళ్ల జోలికి వస్తే సహించను అనే అర్థం వచ్చే డైలాగు వినిపించాడు కానీ, నందమూరి హీరోల సినిమాల్లో మా కుటుంబం..మా అనుబంధం వంటివి పెద్దగా వినిపించిన దాఖలాలు లేవు.
నందమూరి అన్నదమ్ములు ఒక్కరు ఇద్దరు కాదు. పైగా అందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సినిమా రంగాన్ని అంటి పెట్టుకునే వున్నారు. అయినా కూడా ఒకరికి ఒకరం..ఒకరి కోసం ఒకరం అనే భావన వున్నట్లు బయటకు అయితే కనిపించదు. అదే మెగా బ్రదర్స్ లో కానీ, నారా బ్రదర్స్ లో కానీ చూస్తే వేరేగా వుంటుంది.
అసలు అన్నదమ్మలు అంటే ఎలా వుంటారు..ఎక్కడో మరీ పంతాలకు పోయి మొహమొహాలు చూసుకోకపోయినా, ఒకరి క్షేమం మరొకరు కోరుతూ వుంటారు. పూసపాటి వారిని చూడండి. ఆనంద్ గజపతి, అశోక్ గజపతి వేరు వేరు పార్టీల్లో వుంటూ వచ్చారు. కానీ వెనకాల ఒకరి క్షేమం ఒకరు కాంక్షిస్తారు. సంబంధ బాంధ్యవాలు సజీవంగా వున్నాయి. శ్రీకాకుళం ధర్మన సోదరులు..అప్పుడప్పుడు అటు ఇటు పార్టీలు మారినా ఒకటే. జెసి దివాకర రెడ్డి సోదరులు..ఏకమాట..
మెగా బ్రదర్స్
చిరంజీవి..పవన్..నాగ్ బాబు..వేరు వేరుగా వున్నా ఒకరంటే ఒకరికి గౌరవం. పవన్ తన అన్నకు దూరమై వేరే పార్టీ పెట్టినా అన్నను చిన్న మాట అనలేదు. పైగా పదే పదే ఆయనను పొగుడుతూ, ఆయన పై వున్న గౌరవాన్ని ప్రకటిస్తూనే వచ్చారు. ఇప్పుడు అన్న కొడుకుతో సినిమా నిర్మించబోతున్నారు. బాబాయ్ అంటే చరణ్ కు గౌరవమే. ఇప్పుడు అన్నదమ్ములంతా ఒక్కటే అని గుసగుసల సారంశం.
నారా బ్రదర్స్
నారా చంద్రబాబు నాయుడు, రామ్మూర్తి నాయుడు. ఒక దశవరకు వారి సఖ్యత బాగా వుండేది. చంద్రబాబు అన్నదమ్ముడిని కూడ బాగానే చూసారు. కానీ ఏమయిందో వేరయ్యారు. రామ్మూర్తి నాయుడు వైఎస్ పంచన చేరి, అన్నదమ్ముడిని అనరాని మాటలు అన్నారు… కట్ చస్తే..
తప్పు ఎవరైనా చేస్తారు. మన్నించడంలోనే వుంది మంచి మనసు. చంద్రబాబుది మంచి మనసు..మన్నించారు..కాలం మారింది. రామ్మూర్తి నాయుడు మళ్లీ చంద్రబాబు చెంత చేరారు. ఇప్పుడు ఇద్దరూ మళ్లీ ఒకటయ్యారు. సోదరుడి కొడుకు నారా రోహిత్ అంటే చంద్రబాబుకు హితమయ్యారు. నారా రోహిత్ అచ్చమైన తెలుగుదేశం మనిషి అయిపోయారు. తెలుగుదేశం అనుకూల వర్గాలను ఆయనను తమ తమ ప్రాంతాలకు ఆహ్వానిస్తున్నాయి..చిట్ చాట్ లు పెడుతున్నాయి. నారా రోహిత్ సినిమా అడియో ఫంక్షన్లు పసుపు మయమైపోతున్నాయి. మంత్రులు వచ్చి ముందు వరుసలో కూర్చుంటున్నారు. కార్యక్తరలు జిందాబాద్ లు కొడుతున్నారు.
నందమూరి బ్రదర్స్
హరికృష్ణ-బాలకృష్ణ బ్రదర్స్..కానీ ఒకరి సినిమా ఫంక్షన్లకు మరొకరు రారు. హరికృష్ణకు పార్టీలో గౌరవమేలేదు. అయినా బాలయ్య పట్టించుకోరు. తన అన్నను కూడా పార్టీలో మంచి స్థానంపై చూడాలని అనుకోరు. అన్నదమ్ముడి కొడుకులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ బాబాయ్ బాబాయ్ అని కలవరిస్తారు. వారి ఫంక్షన్లలోఆయనను తలుస్తారు. తమ సినిమాల్లో ఆయన పాటలు రీమిక్స్ చేస్తారు. కానీ ఈయన మాత్రం వారిని పట్టించుకున్న దాఖలాలు వుండవు. బాలయ్య తలుచుకుంటే వీరి సినిమాలకు మరింత ప్రచార బలం వస్తుంది.
కానీ తలచుకోరు. వీరి సినిమా ఫంక్షన్లన్నా, సినిమాలన్నా తెలుగుదేశం జనాలు ఆమడ దూరం వుంటారు. అయిందేదో అయింది మంచికో చెడ్డకో హరికృష్ణ నిర్మొహమాటంగా మాట్లాడి వుండొచ్చు. అంత మాత్రం చేత చంద్రబాబుకు దూరం కావచ్చు కానీ బాలయ్య కు కాదు కదా? రక్త సంబంధం ఎక్కడికిపోతుంది. తప్పు చేసేవాడు మనిషి..మన్నించేవాడు మహా మనిషి అన్నారు కదా.. రామోజీరావు కొడుకు సుమన్ ను చూడండి. బయటకు వచ్చారు..సాక్షిలో ఇంటర్వూ ఇచ్చి తండ్రిని నానా మాటలు అన్నారు. అయినా మళ్లీ తండ్రి కొడుకులు ఒక్కటి కాలేదా? తండ్రి కొడుకును దగ్గరకు తీయలేదా?
జనాలకు తెలిసి కళ్యాణ్ రామ్ కానీ, ఎన్టీఆర్ కానీ ఎప్పుడూ బాలయ్యను పల్లెత్తు మాట అనలేదు. ఇంకా బాలయ్యే పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు . అయినా పోనీ, తెరవెనుక ఏదో జరిగింది అనుకుందాం..ఆ మాత్రం బాలయ్య తన బిడ్డలతో సమానమైన క్షమించి దగ్గరకు తీయలేరా? మనం మన కుటుంబం అనలేరా? టాలీవుడ్ లో చెప్పుకునే కబుర్ల సారాంశం ప్రకారం ఎన్నిసార్లు దగ్గరవుదామని అనుకున్నా, ఎన్టీఆర్ ను బాలయ్య దూరంగానే వుంచుతున్నారట.
బాలయ్య ఓకె అంటే దగ్గరకు తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు, లోకేష్ చెప్పేసారట. మరి బాలయ్యకు అంత హాని ఎన్టీఆర్, హరికృష్ణ ఏం చేసినట్లు? ఏం చేసినా..సరే క్షమించలేనంత పెద్ద తప్పా అది?
తను ఎమ్మెల్యే అయ్యారు. బాబుకు చెబితే కనీసం ఎమ్మెల్సీ కూడా హరికృష్ణకు ఇవ్వలేరా? లేదా ఏదైనా పదవి. పోనీ అవన్నీ వదిలేస్తే, పిల్లల సినిమాలు చూడవచ్చు కదా..ఎందరి హీరోల సినిమాలో స్పెషల్ షోలు వేయించుకుమరీ బాలయ్య చూసారనివార్తలు వినవస్తాయి. మరి పటాస్, టెంపర్ చూసారా? వంశం..రక్తం మాటల్లో కాదు..చేతల్లో కూడా వుంటే అభిమానులు ఆనందిస్తారు కదా?
జూనియర్ ఎన్టీఆర్ చేసిన తప్పంతా పార్టీలో లోకేష్ మాదిరిగా తాను ఎదగాలనుకోవడమేనా? పార్టీ తనను చిన్న చూపు చూస్తే జగన్ పార్టీ వైపు మొగ్గడమా?
ఇదంతా తెరవెనుకే కానీ బాహాటంగా కాదు కదా..మరి బాహాటంగానే వేరే పార్టీలోకి వెళ్లి వచ్చిన అనేకానేక మందిని బాబు చేరదీసారు కదా..సాక్షాత్తూ ఆయనే కాంగ్రెస్ పార్టీలోంచి వస్తే అల్లుడు అని ఎన్టీఆర్ చేరదీసారు కదా? మరి ఏ పార్టీలోకీ వెళ్లని వారిని, కేవలం మధ్యవర్తుల మాటలు విని, నమ్మి, బాలయ్య దూరం పెట్టడమేమిటి?
నిజానికి తారక్ చేరువైతే అది తెలుగుదేశం పార్టీకి మరింత బలమే కానీ వేరుకాదు. ఎందుకంటే మాస్ పుల్లింగ్ లో బాలయ్యకు వున్న చరిష్మా, ఎన్టీఆర్ కు కూడా వుంది. ఇది తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. ఎందుకంటే ఎల్లకాలం పవన్ మన పక్కనే వుంటారని అనుకోవడానికి లేదు కదా?
ఇకనైనా నందమూరి సోదరులంతా ఒకటి వుంటారని, వుండాలని,.బాబాయ్ బాబాయ్ అని కలవరించే తారక్ , కళ్యాణ్ రామ్ లను బాలయ్య బాబు దగ్గరకు తీసుకుంటారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు..మరి ఆరోజు ఎప్పుడు వస్తుందో?
'కలం'కార్