కేసీఆర్ తాలిబన్ తత్వం….!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉరఫ్ కేసీఆర్ ఓ పట్టాన అర్థంకారు. ‘అపరిచితుడు’లా ఆయనలో అనేక రూపాలున్నాయి. ఒక్కోసారి ప్రజాస్వామికవాదిలా కనబడతారు. మరోసారి అపర నియంతలా కనబడతారు. సున్నిత మనస్కుడిలా కనబడతారు.  కరడుగట్టిన తాలిబన్…

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉరఫ్ కేసీఆర్ ఓ పట్టాన అర్థంకారు. ‘అపరిచితుడు’లా ఆయనలో అనేక రూపాలున్నాయి. ఒక్కోసారి ప్రజాస్వామికవాదిలా కనబడతారు. మరోసారి అపర నియంతలా కనబడతారు. సున్నిత మనస్కుడిలా కనబడతారు.  కరడుగట్టిన తాలిబన్ మాదిరిగా కనబడతారు. ఆయన పట్ల ఒక అభిప్రాయం మనసులో ముద్రపడేలోగానే మరో అభిప్రాయం కలిగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన బుర్రకు ఏది తోస్తే అది చేస్తారు. ప్రజాస్వామికంగా వ్యవహరించడం, సంప్రదింపులు జరపడం, విశాల దృక్పథంతో ఆలోచించడం…ఇలాంటి లక్షణాలు  ఒంటికి సరిపడవేమోనని అనిపిస్తోంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చేటప్పుడు కొందరు మళ్లీ దొరల పాలన రాబోతున్నది అన్నారు. ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదని కొందరన్నారు. కాని దొరల పాలనను మించిపోయి ‘తాలిబన్ల’ పాలనను రుచిచూపిస్తున్నారు. ఆయనలో తాలిబన్ తత్వం ఉందని, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ‘ఆంధ్రా వ్యతిరేకత’కు తెలంగాణవారిని కూడా బలి చేస్తారని అర్థమవుతోంది. అంటే తెలంగాణ ప్రజల్లో ‘తెలంగాణ సెంటిమెంట్’ అనే ఆంధ్రా వ్యతిరేకతను పెంచి పోషించడానికి  తెలంగాణ కళాకారులను కూడా బలి పెడతారు. ఈమధ్య ఇదే జరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రశ్నించలేదు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు ఉన్న తెలంగాణకు చెందిన కూచిపూడి నృత్య కళాకారులు రాజా రాధారెడ్డి దంపతులకు హైదరాబాదులోనే ఘోర అవమానం జరిగింది. కాని దీనిపై తెలంగాణ కళాకారులుగాని, ఆంధ్రప్రదేశ్ కళాకారులుగాని నిలదీయలేదు. ఇలా నిలదీయకపోవడం తప్పే అవుతుంది.  ఎందుకంటే  ఓ గొప్ప కళను తెలంగాణలో భూస్థాపితం చేసే కుట్రకు టీఆర్‌ఎస్ సర్కారు నాంది పలికింది. కేసీఆర్‌ది తాలిబన్ తత్వమని ఎందుకన్నామంటే…తాలిబన్లకు కళలంటే పడదు.  కేసీఆర్‌కు ఆంధ్రా కళలంటే పడదు. కాబట్టి ఈయనలో తాలిబన్ల తత్వం ఉంది. 

సర్కారు అవమానించింది ఎవరిని?

రాజా, రాధారెడ్డి దంపతులెవరో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కూచిపూడి నాట్యాభిమానులకు ఆ పేర్లు సుపరిచితం. ఆ మొత్తం కుటుంబం కూచిపూడి నాట్య కళకు అంకితమైంది. కూచిపూడి నృత్యానికి అనేకమంది కళాకారులు ప్రాచుర్యం కల్పించారు. వారిలో రాజా రాధారెడ్డి దంపతులూ ఒకరైనప్పటికీ ఆ నృత్య కళకు అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రతిష్టలు తీసుకురావడంలో వారి కృషి ప్రశంసనీయం. తెలంగాణలోని అత్యంత వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాజా రాధారెడ్డి దంపతులను ప్రాంతాలకు అతీతంగా కళాకారులు, కళాభిమానులు ప్రేమిస్తారు. వారు  ఈమధ్య హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వడానికి అనుమతి అడిగితే కేసీఆర్ ప్రభుత్వం నిరాకరించింది. రవీంధ్రభారతిలో వారు ప్రదర్శన ఇవ్వడం కొత్త కాదు.  మొదటిసారి ప్రదర్శన ఇస్తున్న కళాకారులూ కాదు. ఏడాదికోసారి రవీంద్రబారతిలో  ప్రదర్శన ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయినా ప్రభుత్వం కాదు పొమ్మంది. ఇందుకు చెప్పిన కారణం విచిత్రంగా ఉందనడం కంటే తాలిబన్ తత్వంతో కూడి ఉందని చెప్పొచ్చు. ‘‘కూచిపూడి నృత్యంతో తెలంగాణ సాంస్కృతిక రంగానికి సంబంధం లేదు. ఇది ఆంధ్రాకు చెందిన కళ. అందుకే అనుమతి ఇవ్వడంలేదు’’ అని సర్కారు రాజా రాధారెడ్డి దంపతులకు స్పష్టం చేసింది. దీంతో వారు గమ్మున ఉండిపోయారు తప్ప ప్రభుత్వాన్ని నిలదీయలేదు. అది సంస్కారం కాదనుకున్నారో, ఎందుకొచ్చిన గొడవ అని ఊరుకున్నారో తెలియదు. అయితే ఇక్కడో ప్రశ్న వేసుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం అవమానించింది ఎవరిని? తెలంగాణకు చెందిన రాజా రాధారెడ్డి దంపతులనా? ఆంధ్రాకు చెందిన కూచిపూడి నృత్యాన్నా? 

కేసీఆర్‌కు తెలియకుండా జరిగిందా?

రాజా రాధారెడ్డి దంపతుల నృత్య ప్రదర్శనకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా అనుమతి నిరాకరించలేదు.  ఆయన ప్రభుత్వం నిరాకరిస్తే అది ఆయన నిరాకరించినట్లే  అవుతుంది. రవీంద్రభారతి ప్రభుత్వ ఆడిటోరియం. సాంస్రృతిక శాఖ ఆధ్వర్యంలో ఉండే ఈ ఆడిటోరియం వ్యవహారాలు చూడటానికి ప్రత్యేక అధికారి ఉంటారు. కూచిపూడి ఆంధ్రా నృత్యం కాబట్టి మీకు అనుమతి ఇవ్వడంలేదని చెప్పిన విషయం మీడియాలో వచ్చింది. అనుమతి నిరాకరించిన విషయం కేసీఆర్‌కు తెలియకపోయినా మీడియాలో వచ్చిన తరువాతైనా తెలియకుండా ఉంటుందా? అందులోనూ రాజా రాధారెడ్డి కేసీఆర్‌కు తెలియనివారు కాదు. మరి ఆ తరువాతైనా తప్పును సరిచేయాలి కదా…! అదేమీ జరగలేదు. తమకు అనుమతి ఇవ్వని మాట నిజమేనని రాజా రాధారెడ్డి దంపతులు చెప్పిన విషయం కూడా మీడియాలో వచ్చింది. అయినా కేసీఆర్ స్పందించలేదు. దీన్నిబట్టి చూస్తే రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శనలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందా అనే అనుమానం కలుగుతోంది. రాజారాధారెడ్డి దంపతులేక ఇవ్వకపోతే సామాన్యులకు ఇవ్వరు కదా.   ఇదే నిజమైతే, రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శనలను నిషేధించామని, అది ఆంధ్రా కళారూపం కాబట్టి తెలంగాణకు సంబంధంలేదని బహిరంగ ప్రకటన విడుదల చేయాల్సింది. కాని అలా చేయరు. ఆంధ్రా వ్యతిరేకతను చాప కింద నీరులా వ్యాప్తి చేస్తారు. 

బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఏ ఎన్నికల్లోనైనా ఆంధ్రావారి ఓట్లు నష్టపోవల్సి వస్తుంది కదా…! రాజా రాధారెడ్డి దంపతులను కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ‘పద్మ’ పురస్కారాలతో సత్కరించింది. మారుమూల ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన వీరు కూచిపూడి నృత్యంతో మమేకమై ఆ కళేక కాకుండా తెలంగాణకూ కీర్తిని తెచ్చారు. 2001లో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన తరువాత కేసీఆర్ ఈ దంపతులను ఎంతో గౌరవించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభిచగానే తెలంగాణ ముద్దు బిడ్డల మీద ఆయనకు ఎనలేని ప్రేమ కలిగింది. టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లోని బోర్డులో రాజారాధా రెడ్డి దంపతుల పేర్లు కూడా రాయించారు. 2014 ఎన్నికల్లో వీరిలో ఒకరికి ఆదిలాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు ఇస్తామని కేసీఆర్ ప్రతిపాదించారని, అందుకు వారు తిరస్కరించారని సమాచారం. కాని అది నిజం కాదని ఈ దంపతులు చెప్పారు. కళాకారులుగా తమకు అన్ని పార్టీల వారు సన్నిహితులేనని, తమకు రాజకీయాల మీద ఆసక్తి లేదని చెప్పారు. ఈ లెక్కన కేసీఆర్‌కు రాజా రాధా రెడ్డి దంపతులంటే అయిష్టమేమీ లేదు. కూచిపూడి నృత్యం తెలంగాణలో ఉండకూడదని ఆయన అనుకున్నారు. రవీంద్ర భారతి ప్రభుత్వ ఆడిటోరియం కాబట్టి అనుమతి ఇవ్వలేదు. 

తెలంగాణలో కూచిపూడి నృత్యం భూస్థాపితమేనా? 

కళాకారులు విశ్వమానవులు. వారికి ప్రాంతీయ భేదాలుండవు. అన్ని ప్రాంతాల ప్రజలు వారిని ఆదరిస్తారు. తెలంగాణ కవులకు, కళాకారులకు ఆంధ్రలో గౌరవం లేదా? గద్దర్ పాటలకు ఆంధ్ర ప్రజలు తన్మయులు కావడంలేదా? ఇలాంటి ఉదాహరణలు ఎన్నయినా ఇవ్వొచ్చు. ఉమ్మడి రాష్ర్టం భౌగోళికంగా, రాజకీయంగా మాత్రమే విడిపోయిందనే  విషయం గమనంలో ఉంచుకోవాలి. కేసీఆర్ వైఖరి చూస్తుంటే భవిష్యత్తులో తెలంగాణ వారు కూచిపూడి నృత్యం నేర్చుకునే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో, తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడి నృత్యం కోర్సు ఎత్తేయాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వొచ్చు. లేదా ఆ నృత్యం నేర్చుకునేవారికి ఉపాధి అవకాశాలు లేవని చెప్పొచ్చు. నృత్య ప్రదర్శనలకు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆ నృత్యం పట్ల ఏహ్య భావాన్ని పెంచిపోషించవచ్చు. ఇప్పటికే సాహిత్యాన్ని ఆంధ్ర సాహిత్యం, తెలంగాణ సాహిత్యం అని విడగొట్టారు. తెలంగాణకు ఓ ఆది కవిని (పాల్కురికి సోమనాథుడు) ప్రకటించారు. పాఠ్యపుస్తకాల్లో, పోటీ పరీక్షల సిలబస్‌లో ఆంధ్ర సాహిత్యం, చరిత్రకు స్థానం ఉండకూడదని తీర్మానించారు. ఇప్పుడు కళలకూ ఈ నిషేధం అమలు చేస్తున్నారు. కూచిపూడికి తెలంగాణ సంస్కృతితో సంబంధం లేనప్పుడు తమిళనాడుకు చెందిన భరత నాట్యానికి తెలంగాణతో సంబంధం ఉందా? దానిపై నిషేధం పెడతారా? త్యాగరాజును తమిళులు ఆదరించకపోయుంటే ఆయన కీర్తనలు తెలుగువారు పాడుకునేవారా? ప్రజాకవి వేమన్నను ఆంగ్లేయుడైన బ్రౌన్ వెలికి తీయకపోయుంటే ఆయన పద్యాలు వినగలిగేవారమా? వీళ్లు తమకు సంబంధం లేని వ్యక్తులని తమిళులు, బ్రౌన్ భావించలేదు. వారు కళను, సాహిత్యాన్ని గౌరవించారు. ప్రాంతాలు పట్టించుకోలేదు. తెలుగు సాహిత్యం చదువుకున్న కేసీఆర్‌కు ఈ సంగతులు తెలియవా? తెలుసు. కాని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన కళలను, కళాకారులను కూడా చంపేయడానికి సిద్ధపడ్డారు. కళను కళగా చూడాలి తప్ప ఆంధ్ర, తెలంగాణ కళలుగా చూడకూడదు. ప్రతి కళ గొప్పదే. ఈ సత్యం కేసీఆర్ తెలుసుకుంటారా? 

ఎం.నాగేందర్