ప్రధాని సంకల్పం నెరవేరుతుందా?

మన నాయకులు, మంత్రులు అనేకమంది వృథా మాటలు చాలా మాట్లాడతారు. సామాన్యుల భాషలో చెప్పాలంటే అవి పనికిమాలిన మాటలు. గొప్పనేతల జయంతులు, వర్థంతులు, కొన్ని సందర్భాల్లో నిర్వహించే సభల్లో సమావేశాల్లో నాయకులు సూక్తిముక్తావళి వినిపిస్తారు.…

మన నాయకులు, మంత్రులు అనేకమంది వృథా మాటలు చాలా మాట్లాడతారు. సామాన్యుల భాషలో చెప్పాలంటే అవి పనికిమాలిన మాటలు. గొప్పనేతల జయంతులు, వర్థంతులు, కొన్ని సందర్భాల్లో నిర్వహించే సభల్లో సమావేశాల్లో నాయకులు సూక్తిముక్తావళి వినిపిస్తారు. ప్రవచనకారుల్లా ఏవేవో ఏకరువు పెడతారు. అంబేద్కర్‌ కలలు నెరవేరుస్తాం, గాంధీజీ ఆశయాలు సాధిస్తాం, ఫలానా నాయకుడు చూపించిన బాటలో నడుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం… అంటూ ఊదరగొడుతుంటారు. ఈ మాటలు చేతల్లో కనబడతాయా? అంటే అది ఎండమావే.

ఏదో ప్రసంగించాలి కాబట్టి ప్రసంగిస్తారు. ఇందిరాగాంధీ తరువాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళ అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మీద ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఆమె తొలి బడ్జెటును ప్రవేశపెట్టి 'ఓ పనైపోయింది బాబూ' అనిపించారు. బడ్జెటును బ్రీఫ్‌కేసులో తెచ్చే బ్రిటిష్‌ విధానానికి స్వస్తి పలికి ఎర్రటి వస్త్రంలో చుట్టుకొని వచ్చారు. ఆమె మాతృభాష తమిళంలో పద్యాలు చదివి అలరించారు. బేతాళ కథ మాదిరిగా ఎప్పటిమాదిరిగానే అధికార పక్షం 'బడ్జెటు బ్రహ్మాండం' అంటే, 'బడ్జెటు ఏం బాగాలేదు' అని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. 'మాయాబజారు' సినిమాలో మాదిరిగా 'అవేవీ.. ఇవేవీ' అని నిలదీశాయి.

బడ్జెటులో ఇతర అంశాలు ఎలా ఉన్నా ఒక ఆసక్తికరమైన విషయం నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించారు. అది మహాత్మాగాంధీకి సంబంధించింది. ఇది మహాత్మాగాంధీ 150వ జయంతి సంవత్సరం. ఈ సందర్భంగా 'గాంధీపీడియా' అనే ఓ ప్రాజెక్టును తయారుచేయబోతున్నారు. దీని ద్వారా ఆయన సిద్ధాంతాలు, బోధనలు, ఆయన తెలియచేసిన విలువలు ఇప్పటి యువతరానికి తెలియచేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీన్ని సైన్స్‌ మ్యూజియంల జాతీయ మండలి రూపొందిస్తుంది. ఇది ఎలా అమలు జరుగుతుంది? యువతరంపై ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందో చెప్పలేంగాని గాంధీకి నివాళిగా మంచి ప్రాజెక్టే.

ఈ సందర్భంలోనే నిర్మలా సీతారామన్‌ 'ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి గాంధీజీ కలలుగన్న స్వచ్ఛ భారతాన్ని సాధించాలని ప్రధాని సంకల్పించారు' అని చెప్పారు. గాంధీజీ కలలను నెరవేరుస్తామని చాలామంది ప్రధానులు చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని కలలు నెరవేర్చారు? అని ప్రశ్నించుకుంటే ఏమీ సాధించలేదనే చెప్పుకోవాలి. ఇందుకు కారణం ప్రభుత్వాల్లో, ప్రజల్లో చిత్తశుద్ధి లేకపోవడమే. ఏ ఆశయమైనా ప్రజల సహకారం ఉంటే తప్ప విజయవంతం కాదు. 'స్వచ్ఛ భారత్‌' అనే కాన్సెప్టు మంచిదే. కాని దీన్ని ఫలానా సమయంలోగా లేదా ఫలానా తేదీగా సాధిస్తామని చెప్పడం సరైంది కాదు. దేశాన్ని స్వచ్ఛంగా, పరిశభ్రంగా ఉంచడమనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఫలానా తేదీవరకు దీన్ని సాధించడమంటూ ఏమీ ఉండదు. ఇది నిర్దిష్ట సమయంలో పూర్తయ్యే ప్రాజెక్టు కాదు.

స్వచ్ఛత, శుభ్రత విషయంలో కొన్ని విదేశాల్లోని ప్రభుత్వాలకు, ప్రజలకు ఉన్నంత చిత్తశుద్ధి, ఆసక్తి భారత్‌లో ప్రభుత్వాలకు, ప్రజలకులేదు. కొన్ని విదేశాల్లో ఈ విషయంలో ప్రభుత్వాలు కఠినంగా ఉంటాయి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా నిబంధనలు పాటిస్తారు. 'దేశం మొత్తాన్ని నువ్వేం బాగుచేయనక్కర్లేదు. పొద్దున్నే నీ ఇంటి ముందు నువ్వు చెత్త ఊడ్చుకున్నా చాలు దేశానికి సేవ చేసినట్లే' అని గాంధీజీ చెప్పారు. స్వచ్ఛ భారత్‌ సాధించాలంటే అందుకు ప్రజలు స్వచ్ఛందంగా కృషిచేయాలి తప్ప ఇది ప్రభుత్వాల వల్ల అయ్యే పనికాదు. స్వచ్ఛత విషయంలో మన ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడంలేదు. మోదీ సర్కారు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ మొదటి టర్మ్‌లో ప్రారంభించింది. అయినప్పటికీ నగరాలు, పట్టణాలు ఇప్పటికీ మురికి కూపాలుగానే ఉన్నాయి.

స్వచ్ఛతకు సంబంధించి కేంద్రం ర్యాంకులు ఇస్తోంది. అవి ఏ ప్రమాణాల ప్రకారం ఇస్తున్నదో తెలియదు. మన నాయకులు, పాలకులు గాంధీజీ ఆశయాలను సాధిస్తామని అలవోకగా చెప్పేస్తుంటారు. కాని ఇప్పటివరకు ఏమీ సాధించలేదు. గ్రామ స్వరాజ్యం గురించి గాంధీ ఎంతో చెప్పారు. ఆ గ్రామ స్వరాజ్యాన్ని పాలకులు ఏనాడో నిలువునా పాతరేశారు. గ్రామాలను పూర్తిగా నిర్వీర్యం చేసి అవి ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేశారు.

పట్టణీకరణను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు గ్రామాలు వట్టిపోయేలా చేశారు. ఉపాధి కోసం గ్రామీణలు పట్టణాలకు, నగరాలకు వలస పోతుండటంతో గ్రామాలు కళ కోల్పోయి, నగరాలు అధిక జనాభాతో మురికి కూపాలుగా మారుతున్నాయి. ఇది గాంధీజీ ఆశయం కదా కదా..!

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే