పెళ్లి-పెటాకులు: ఓపికలేని గుణమా? జ్ఞానోదయమా?

పెళ్లి చేసుకున్నవాళ్లకి విడాకులు తీసుకున్న జంటలు నచ్చరు.  Advertisement పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఆర్జీవీ లాంటి వాళ్లకి వివహావ్యవస్థలో ఉన్నవాళ్లు నచ్చరు.  ఎందుకంటే ఎవరికి వాళ్లు తాము బతుకుతున్న జీవితమే ఆదర్శం అనుకుంటారు. …

పెళ్లి చేసుకున్నవాళ్లకి విడాకులు తీసుకున్న జంటలు నచ్చరు. 

పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఆర్జీవీ లాంటి వాళ్లకి వివహావ్యవస్థలో ఉన్నవాళ్లు నచ్చరు. 

ఎందుకంటే ఎవరికి వాళ్లు తాము బతుకుతున్న జీవితమే ఆదర్శం అనుకుంటారు. 

తాజాగా ధనుష్ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించగానే ఆర్జీవీ తన దోరణిలో ట్వీట్లు పెట్టారు. ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టేది పెళ్లే అని మరొకసారి ఎలుగెత్తి చాటారు. 

కొందరు మాత్రం- “ఛీ ఛీ! పెళ్లి మీద, సంప్రదాయం మీద అస్సలు గౌరవం లేకుండా పోయింది. బట్టలు మార్చినట్టు పెళ్లాల్ని, మొగుళ్లని మార్చేస్తున్నారు” అని వాపోతున్నారు. 

అలా వాపోతున్న వాళ్లల్లో అధికశాతంమంది పెళ్లి చేసుకుని ఏదో రకంగా సర్దుకుని కాపురాలు చేస్తున్నవాళ్లు మాత్రమే. లేదా అదృష్టం బాగా పండి ఏ గొడవలూ లేని వివాహబంధాన్ని అనుభవిస్తున్నవారే. మిగతా వాళ్లు పెళ్లి చేసుకోకుండా స్వామీజీలుగా ఉండి వివహావ్యవస్థను గురించి గొప్పగా ప్రవచనాలు చెప్పేవాళ్లు కావొచ్చు. 

పెళ్లి చేసుకున్నాక కలిసుండాలని భార్యాభర్తలకిద్దరికీ ఉండాలి. ఇద్దరికీ ఆ వ్యవస్థకి లోబడుండాలనే ఆలోచన బలంగా ఉండాలి. 

ఒకర్నొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయే తత్వం ఇద్దరికీ ఉండాలి. ఏ ఒక్కరికి లేకపోయినా విడాకులకి దారి తీయొచ్చు. 

గతంలోకంటే రాను రాను విడాకుల కేసులు ఎక్కువౌతున్నాయని ఒక వాదనుంది. అది నిజం కాదు. మీడియా పెరిగి ఒకే వార్తని పదిసార్లు చెప్పుకోవడం వల్ల అలా అనిపించొచ్చేమో గానీ గతంలో కూడా విడాకుల కేసులు ఎక్కువే. 

రామానాయుడు కుమార్తెతో నాగార్జున విడాకులు కావొచ్చు, ప్రతాప్ పోతన్ తో రాధిక విడాకులు కావొచ్చు, రఘు వరన్ తో రోహిణి విడాకులు కావొచ్చు..అలా తవ్వుకుంటూ పోతే 1980 ల నుంచే దక్షిణభారత సినిమా రంగంలో ఎన్నో పాపులరైన విడాకుల ఉదంతాలున్నాయి. 

ఇంకా ముందుకెళితే బాలీవుడ్ సింగర్ కిషోర్ కుమార్ 1958 లోనే మొదటిభార్య రుమా ఘోష్ కి విడాకులిచ్చి మధుబాలని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పోయాక యోగితాబాలిని పెళ్లి చేసుకుని 1978లో ఆమెకి కూడా విడాకులిచ్చాడు. ఆ తర్వాత లీనా చంద్రవర్కర్ ని పెళ్లి చేసుకున్నాడు. 

ఇప్పుడేదో పవన్ కళ్యాణ్ ని అన్నేసి పెళ్ళిళ్లు చేసుకున్నాడని ఆడిపోసుకుంటారు గానీ ఆ ప్రక్రియకి సెలేబ్రిటీల్లో ఆద్యుడు కిషోర్ కుమార్. ఇంకా ముందు ఎవరన్నా ఆ స్థాయిలో ఉన్నారేమో తెలియదు. ఉంటే ఉండుండొచ్చు. 

“పెళ్లంటే నూరేళ్ల పంట” అని కొటేషన్ బానే ఉంటుంది. కానీ నిక్కచ్చైన అభిప్రాయలుండే వారికి ఆ బంధం అడ్డంకిగా ఉంటుంది. ప్రేమంటే ఇద్దరే. కానీ పెళ్లంటే రెండు కుటుంబాలు..అనేకమంది అటు- ఇటు వాళ్లు. వాళ్లల్లో ఎవరు ఎవరివల్ల నొచ్చుకున్నా చిలికి చిలికి గాలి వానై వివాహబంధం మీద పడే అవకాశాలుంటాయి. 

ప్రధానంగా పెళ్లి పెట్టాకులయ్యేది ఇగోల వల్లే. ఇగో ఎక్కువగా ఉన్నప్పుడు సర్దుకుపోవడమనేది బానిసత్వంలాగ అనిపిస్తుంది. ఇగో ఎక్కువైనప్పుడు తల వంచి సారీ చెప్పడానికి మనసు రాదు. పెళ్లి పెటాకులవ్వకూడదనుకునే వాళ్లు తప్పు తమది కాకపోయినా తమ మీద వేసుకుని “సారీ” చెప్పాలి. అదే అధికశాతం జంటలకి ఛాలెంజింగ్ గా మారుతోంది. కనీసం ఇద్దరిలో ఒకరికైనా ఈ 'సారీ' చెప్పగలిగే నరం ఉంటేనే బంధాలుంటాయి. 

మరీ ముఖ్యంగా పెళ్లైన జంటలు శారీరకంగా బలహీనపడే వరకూ ఈ ఇగోలు బలంగా ఉంటాయి. శరీరం వీకయ్యాక ఇగో కూడా దిగుతుంది సాధారణంగా. కనుక శరీరం వీకయ్యే లోపు ఎప్పుడైనా ఇగోలు జూలు విదిలించి విడాకులకి దారి తీయొచ్చు. 

ధనుష్- ఐశ్వర్యలు తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్బై చెప్పగలిగారంటే వాళ్లిద్దరూ ఇంకా శారీరకంగా బలంగా ఉండి మానసికంగా అడ్జస్టయ్యుండే బలం ఒక్కటీ కోల్పాయారు కనుక. 

ఆ మధ్యన ప్రకాష్ రాజ్ కూడా తన సుదీర్ఘ వైవాహిక జీవితానికి స్వస్తి పలికి తనను అర్థం చేసుకోగలిగే వ్యక్తిని పెళ్లాడాడు. ఆ బంధం ఇప్పటివరకూ చక్కగానే కొనసాగుతోంది కనుక వారిద్దరి మధ్యలో పరస్పర ఇగోలని హర్ట్ చెయ్యకుండా ప్యాంపర్ చేసుకునే నైపుణ్యముందని అర్థం చేసుకోవాలి. 

ఇక్కడ అందరికీ కనెక్ట్ కావడం కోసం సెలెబ్రిటీల గురించి మాట్లాడుకుంటున్నాం. నిజ జీవితంలో మనలో, మన చుట్టూ ఇలా ఎన్నో జంటలు పెళ్ళిన కొత్తల్లోనూ, కొందరు పెళ్లైన కొన్నేళ్లకి విడిపోవడం చూస్తున్నాం. 

ఎవరు కలిసున్నా విడిపోయినా అవి వారి మానసిక శక్తికి లోబడి తీసుకునే నిర్ణయాలు. వారి వారి నిర్ణయాలని గౌరవించి మౌనంగా ఉండాలి. కోరితే మోరల్ బూస్టింగ్ ఇవ్వగలగాలి కానీ ధర్మసంస్థాపకుల్లాగ వారిని, వారి తల్లిదండ్రుల పెంపకాల్ని వెక్కిరించాల్సిన పనిలేదు. 

అలాగే “పెళ్లి”ని ఒక అనాచారంగా భావించే ఆలోచనలు కూడా అనవసరం. 

కొందరు విడిపోయి ప్రశాంతంగా ఉన్నా, అధికశాతం మంది చికాకులున్నా సర్దుకుపోయి చక్కగా కాపురాలు చేసుకుంటూ, ఉన్నదాంట్లో డార్క్ సైడ్ ని కాకుండా బ్రైట్ సైడ్ ని చూసుకుంటూ  వివాహవ్యవస్థని నిలుపుతూ బతుకుతున్నారు.  

ఎవరి అదృష్టం వాళ్లది, ఎవరి శక్తి వాళ్లది, ఎవరి నిర్ణయం వాళ్లది. అంతే. 

కనుక పరస్పర అంగీకారంతో విడాకులు పుచ్చుకున్నవాళ్లు జ్ఞానోదయం పొందినట్టు కాదు. వాళ్లకి సర్దుకునే ఓపిక లేక ఏది కంఫర్టో ఆ నిర్ణయం తీసుకున్నారనుకోవాలంతే. 

– శ్రీనివాసమూర్తి