చచ్చిపోవాలి.. చంపకూడదంతే.!

సంయమనం పాటిస్తుండడాన్ని చేతకానితనంగానే భావించారంతా. అవును, ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం. పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు, పాకిస్తాన్‌ సైన్యం, పాకిస్తాన్‌ ప్రభుత్వమే కాదు, పాకిస్తాన్‌కి అన్ని వేళలా అండదండలందించే చైనా, పాకిస్తాన్‌తో అంటకాగే అమెరికా…

సంయమనం పాటిస్తుండడాన్ని చేతకానితనంగానే భావించారంతా. అవును, ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం. పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు, పాకిస్తాన్‌ సైన్యం, పాకిస్తాన్‌ ప్రభుత్వమే కాదు, పాకిస్తాన్‌కి అన్ని వేళలా అండదండలందించే చైనా, పాకిస్తాన్‌తో అంటకాగే అమెరికా ఆలోచనలు కూడా ఇలాగే వున్నాయి. 

భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రదాడి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. తీవ్రవాదులు సముద్ర జలాల్లోంచి దూసుకొచ్చి, మారణహోమం సృష్టించారు. అంతకు ముందు కూడా ముంబై అనేక దాడుల్ని ఎదుర్కొంది. దొంగచాటుగా బాంబులు పేల్చడమే అప్పటిదాకా అందరికీ తెలుసు తీవ్రవాదుల గురించి. కానీ, ముంబై మీద పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదులు సముద్ర మార్గంలో చొరబడి చేసిన దాడి ప్రపంచానికే షాకిచ్చింది. 

చైనా, అమెరికా అప్పట్లో పాకిస్తాన్‌ తీరుని తప్పు పట్టి ఊరుకున్నాయంతే. భారత్‌ కూడా, ఆ సమయంలో మరీ అంత సీరియస్‌గా వ్యవహరించలేకపోయింది. సజీవంగా దొరికిన టెర్రరిస్టుని, ఇంటి అల్లుడిలా 'మేపాం'. అదీ ఒకందుకు మంచిదయ్యింది. ఈ రోజు అమెరికా అయినా, చైనా అయినా నోరు మెదపలేకపోతున్నాయంటే, పాకిస్తాన్‌ని సమర్థించలేకపోతున్నాయంటే దానికి కారణం ఆనాటి సంయమనమే. 

అయితే, ఇప్పుడు కూడా చైనా, అమెరికా స్పందించాల్సిన స్థాయిలో పాకిస్తాన్‌పై స్పందించడంలేదు. పైగా, 'సంయమనం పాటించండి..' అంటూ పాకిస్తాన్‌తో కలిపి, భారత్‌కి ఉచిత సలహాలిచ్చేస్తున్నాయి. ఏం, దశాబ్దాలుగా సీమాంతర తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై ఇన్నాళ్ళూ చైనా, అమెరికా ఎందుకు మాట మెదపలేకపోయాయి.? 

పాకిస్తాన్‌లోకాదు, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో 40 మంది తీవ్రవాదుల్ని బారత సైన్యం కమెండో ఆపరేషన్‌ ద్వారా హతమార్చగానే, ఐక్యరాజ్యసమితికీ శాంతిమంత్రం గుర్తుకొచ్చేసింది. అదే, అమెరికా – పాకిస్తాన్‌పైకి దూసుకెళ్ళి, పాకిస్తాన్‌లో దాక్కున్న అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్‌ లాడెన్‌ని హతమార్చగానే ప్రపంచమంతా పండగ చేసుకుంది. ఐక్యరాజ్యసమితి అప్పుడు నోరు మెదపలేదు. ఒసామా బిన్‌ లాడెన్‌ తీవ్రవాది అయితే, ఇప్పుడు ఇండియా చేపట్టిన ఆపరేషన్‌లో చచ్చిందెవరు.? 

దౌత్య యుద్ధం అనేది ఎప్పటికీ కొనసాగాల్సిందే. అదే సమయంలో, ప్రపంచానికి మన సైనిక సత్తా ఏంటో చాటి చెప్పి తీరాలి. సంయమనం అనేది చేతకానితనం కాబోదు. యుద్ధతంత్రంలో భారత్‌, ప్రపంచంలో ఎవరికీ తీసిపోదు. మరీ ముఖ్యంగా, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో వెనుకంజ వేయబోదు.. అన్న సంకేతాల్ని గట్టిగానే ఇవ్వాలి. ఇన్నాళ్ళకు ఆ పని సమర్థవంతంగా చేయగలిగాం. ఉగ్రదేశం పాకిస్తాన్‌కి ఈ సమాధానం సరిపోదు.. ఇంకా గట్టిగా, కోలుకోలేనంత గట్టిగా దెబ్బ తగిలితీరాల్సిందే.