చట్టసభల్లో ఏం జరిగినా అంతేనా.?

చట్టసభకు సంబంధించి విశేషమైన అధికారాలు సభాపతులకు మాత్రమే వుంటాయి. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకలా.? అనడక్కూడదు. అదంతే. కింది స్థాయి న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానాలు, సర్వోన్నత న్యాయస్థానం.. ఇలా ఓ నేరానికి సంబంధించి, నేరం…

చట్టసభకు సంబంధించి విశేషమైన అధికారాలు సభాపతులకు మాత్రమే వుంటాయి. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకలా.? అనడక్కూడదు. అదంతే. కింది స్థాయి న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానాలు, సర్వోన్నత న్యాయస్థానం.. ఇలా ఓ నేరానికి సంబంధించి, నేరం చేసిన వ్యక్తికి లేదా, ఓ కేసులో న్యాయం కోరుకున్న వ్యక్తికీ అనేకమైన ఆప్షన్స్‌ వుంటాయి. చట్ట సభలకు సంబంధించి ఈ పరిస్తితే లేదు. స్పీకర్‌ దయాదాక్షిణ్యాల మీదనే వ్యవహారమంతా నడుస్తుంటుంది. 

ఓ రకంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్యంలో స్పీకర్‌ పొజిషన్‌లో వున్నవారు డిక్టేటర్‌లా వ్యవహరిస్తారనుకోవాలేమో.! ఇది చట్ట సభల్ని కించపర్చేందుకు కాదు. చట్ట సభల్లో, చట్టసభల పరిధిలో జరుగుతున్న అన్యాయాలు, దాడులు.. వంటి విషయాల్లో ప్రజలకు వాస్తవాలు తెలియకపోతే, అసలు మనమున్నది ప్రజాస్వామ్యంలోనే.. అని ఎలా నమ్మేది.? 

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఎమ్మెల్యే, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్‌నారాయణపై దాడి జరిగింది. మామూలుగా అయితే చాలా సీరియస్‌ అంశం ఇది. అప్పటి సెంటిమెంట్ల బాగోతం.. భావోద్వేగాల పరంపరలో అది అలా కొట్టుకుపోయింది. జేపీ లైట్‌ తీసుకున్నారు.. ఆ కేసు అలా నీరుగారిపోయింది. పార్లమెంటు సమావేశాల్ని తీసుకుంటే, విభజన బిల్లు పాస్‌ అవుతున్న వేళ, లోక్‌సభలో జరిగిన పరిణామాలు అత్యంత జుగుప్సాకరం. పెప్పర్‌ స్ప్రే ఘటన దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటన. ఓ ఎంపీ, తోటి ఎంపీల మీద దాడి చేయడమంటే చిన్న విషయం కాదు. కానీ, పెప్పర్‌ స్ప్రే ఘటనలో ప్రధాన దోషి లగడపాటి రాజగోపాల్‌పై చర్యలేవీ.? నో ఆన్సర్‌. 

ఎందుకిలా.? అని అడిగితే, మళ్ళీ సమాధానం దొరకదు. ఎందుకూ.. అంటే అదంతే. అంతకు మించి, సమాధానం లేనే లేదు. చట్టసభలకు సంబంధించి అక్కడేం జరిగినా, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పనే లేదు. ఇదేం ప్రజాస్వామ్యం.? అని ప్రశ్నించకూడదంతే. లోక్‌సభలో ఆనాటి ఘటనలకు సంబంధించి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఓ పుస్తకం రాసేశారు. అసలు ఆ బిల్లు పాస్‌ అవలేదంటారాయన. అది నిజమా.? కాదా.? ప్రజలకు తెలియాలి కదా.! 

ఇక్కడో కీలకమైన విషయం వుంది. ఇంకో పాతికేళ్ళ తర్వాత, యాభయ్యేళ్ళ తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుందది. అదేంటంటే, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పీకర్‌కి నోటీసులిచ్చారు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు. విభజన బిల్లుకి ముందే ఇది జరిగింది. కానీ, దాన్నసలు స్పీకర్‌ పరిగణనలోకే తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఇటీవల ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే, ఓసారి లేటుగా.. ఓ సారి ముందుగా రెండుసార్లు.. రెండు విధాలుగా స్పీకర్‌ దానిపై ఓటింగ్‌ జరిపించి, తుస్సుమనిపించిన విషయం విదితమే. 

ఎందుకిలా.? ఒక్కో చోట ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఎందుకు జరుగుతోంది.? పొద్దున్న లేస్తే అధికారంలో వున్నవారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. విపక్షంలో వున్నవారూ మాట్లాడేస్తుంటారు. కానీ, ప్రజాస్వామ్యం అనేది అసలు వుందా.? అన్న ప్రశ్న ప్రజల నుంచే పుట్టుకొస్తోంది. జరిగిందేదో జరిగిపోయింది. విభజన జరిగిపోయిందిగానీ, ఆనాటి సందేహాలు అలాగే వుండిపోయాయి. సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష వేసినా, క్షమాభిక్షకు ఓ అవకాశం వుంటుంది. అంతకుముందే అప్పీల్‌ చేసుకోడానికీ ఛాన్సులుంటాయి. చట్ట సభలకెందుకు ఆ పరిస్థితి వుండదు.? ఇది ఎప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.