మునుపెన్నడూ లేని స్థాయిలో జలవిలయానికి భాగ్యనగరం తల్లడిల్లిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి భాగ్యనగరం చెరువులా కాదు, ఉప్పొంగిన నదిని తలపించింది. రోడ్లెక్కడో, ఇళ్ళెక్కడో, కాలువలెక్కడో తెలియని పరిస్థితి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ నగరాన్ని వణికించిన హుద్ హుద్ తుపాను నాటి పరిస్థితులు హైద్రాబాద్‌లో కన్పిస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో.! ఆ స్థాయిలో కాకపోయినా, హైద్రాబాద్ వరకూ ఇది అతి పెద్ద జలవిలయం.
కానీ, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ.? హైద్రాబాద్‌కి బ్రాండ్ అంబాసిడర్‌నంటూ ప్రచారం చేసుకున్న మంత్రి కేటీఆర్ ఎక్కడ.? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో అన్నీ తానే అయి వ్యవహరించి, పార్టీకి ఘనవిజయాన్ని ఇచ్చిన కేటీఆర్, ఆ సమయంలో హైద్రాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కావు. నిన్నగాక మొన్న హైద్రాబాద్‌లో రోడ్ల పరిస్థితిపై మంత్రి కేటీఆర్, అధికారుల వద్ద నానా హడావిడీ చేశారు. అంతే, ఆ తర్వాత మాయం.
ఢిల్లీ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తూతూ మంత్రంగా అక్కడి నుంచే అధికారులతో సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన పరిస్థితుల్ని చక్కదిద్దాలని అధికారులకు సూచించారు. అంతే తప్ప, మీడియా ముందుకొచ్చి ముఖ్యమంత్రి హోగాలో కేసీఆర్ భరోసా ఇవ్వలేకపోయారు. మంత్రి కేటీఆర్ కూడా అంతే. హోంమంత్రి నగరం నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆచూకీ కూడా కన్పించలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం ప్రజల వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, నగర మేయర్ మినహా.. మిగతా ప్రముఖులెవరూ కన్పించకపోవడం శోచనీయం.
ఒక్క మాటలో చెప్పాలంటే కనీ వినీ ఎరుగని జలవిలయంలో నగరవాసి బిక్కుబిక్కుమంటోంటే, భాగ్యనగరవాసులకు భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు. హైద్రాబాద్ భాగ్యనగరం కాదు.. విశ్వనగరం అసలే కాదు.. ఓ అనాధ మాత్రమే.. అని అంటే, అది తప్పెలా అవుతుంది.?
చివరగా: రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన ఉత్పాతం కాదిది. గత కొద్ది రోజులుగా వరుణుడు భాగ్యనగరంపై పడగ విప్పాడు. కానీ, అధికార యంత్రాంగం అప్రమత్తం కాలేదు. ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు. గత పాలకుల మీద నెపం మోపేద్దాం.. అనుకుందో ఏమో, భాగ్యనగరాన్ని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం గాలికొదిలేసింది.. అనాధను చేసేసింది. ఎనీ డౌట్స్.?